Israel-Hamas War: అక్టోబర్ 6వ తేదీనే హమాస్ ఎందుకు దాడి చేసింది? ఆ తేదీ వెనకున్న కథ ఏంటి?
ABN, First Publish Date - 2023-10-08T17:32:00+05:30
ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలుత హమాస్ గ్రూపు అక్టోబర్ 6వ తేదీన ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి...
ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలుత హమాస్ గ్రూపు అక్టోబర్ 6వ తేదీన ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించింది. ఓవైపు వందల సంఖ్యలో పారాగ్లైడర్స్, మరోవైపు పికప్ ట్రక్కుల్లో భారీ మిషన్ గన్లతో, ఇంకోవైపు మధ్యదరా సముద్రం నుంచి బోట్లలో హమాస్ యోధులు చొరబడి.. ఇజ్రాయెల్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే.. ఈ షాక్ నుంచి వెంటనే తేరుకొని ఇజ్రాయెల్ కూడా ఎదురుదాడికి దిగింది. హమాస్‌తో యుద్ధం ప్రకటించింది.
అక్టోబర్ 6వ తేదీన హమాస్ ఎందుకు దాడి చేసింది?
అక్టోబర్ 6వ తేదీనే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న యూదులకు అక్టోబర్ 6వ తేదీ ఎంతో పవిత్రమైన రోజు. దీనిని యోమ్ కిప్పూర్ అని పిలుస్తారు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం.. అంటే 1973 అక్టోబర్ 6వ తేదీన ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాలపై అరబ్ దేశాలు (ఈజిప్టు, సిరియా) ముప్పేట దాడి చేశాయి. ఈ యుద్ధానికి ‘యోమ్ కిప్పూర్’తో పాటు రకరకాల పేర్లు పెట్టుకున్నారు. పేరు ఏదేమైనా.. అప్పట్లో ఈ యుద్ధం మాత్రం ప్రపంచ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది. తొలుత ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వెనుకంజ వేసింది. ఆ తర్వాత అమెరికాతో పాశ్చాత్య దేశాల సహకారంతో ఇజ్రాయెల్ పుంజుకుంది. 10 రోజుల తర్వాత.. అంటే 1973 అక్టోబర్ 16వ తేదీన ఇజ్రాయెల్ దళాలు.. ఈజిప్టు, సిరియా రక్షణ రేఖలను ఛేదించి దూసుకెళ్లాయి. ఈ యుద్ధంపై ఇజ్రాయెల్ పట్టు బిగించడం మొదలుపెట్టింది.
అప్పుడు అరబ్ దేశాలు ‘చమురు’ అస్త్రాన్ని ప్రయోగించాయి. చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించడంతోపాటు అమెరికాకు సరఫరాపై ఆంక్షలు విధించాయి. దాంతో.. చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఆ సమయంలో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ రంగంలోకి దిగి.. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య చక్కర్లు కొట్టి.. యుద్ధాన్ని ఆపించారు. అరబ్, ఇజ్రాయెల్ మధ్య దౌత్యం నెరిపి.. ఆ రెండు శాంతించేలా కీలక పాత్ర పోషించారు. అయితే.. రెండు వారాల పాటు సాగిన ఆ యుద్ధంలో సుమారు 20 వేల మంది మరణించారు. ఈ యుద్ధం ముగిసే సమయానికి.. ఇజ్రాయెల్ మరింత భూభాగాన్ని స్వాధీనం చేసుకోగలిగింది. ఇలా తమ భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించిందన్న కోపంతోనే.. ఇప్పుడు యాభై ఏళ్ల తర్వాత హమాస్ గ్రూపు ఆ దేశంపై యుద్ధానికి దిగింది.
అక్టోబర్ 6 యూదుల పవిత్ర దినం
అక్టోబర్ 6వ తేదీ యూదులకు ఎంతో పవిత్రమైన దినం. అలాంటి రోజు దాడి చేస్తే.. ఇజ్రాయెల్‌కి గట్టి దెబ్బ కొట్టినట్టు అవుతుందన్న ఉద్దేశంతోనే హమాస్ ఒక్కసారిగా దాడి చేసినట్లు తెలుస్తోంది. 50 ఏళ్ల క్రితం జరిగిన యుద్ధంలోనే ఇజ్రాయెల్‌దే పైచేయి కావడం, ఆ యుద్ధం 50వ వార్షికోత్సవాన్ని సూచిస్తుండడంతో.. తన ప్రతీకారంలో భాగంగా ఇజ్రాయెల్‌తో యుద్ధానికి హమాస్ దిగింది. మరో కారణం ఏమిటంటే.. అల్-అక్సా మసీదు సమ్మేళనంపై ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదం కొనసాగుతూ వస్తోంది. ఈ స్థలం ముస్లిములు, యూదులకు ఎంతో గౌరవప్రదమైంది కూడా! ఈ అంశంలోనూ హమాస్, ఇజ్రాయెల్ మధ్య సుదీర్ఘ గొడవ జరుగుతూనే ఉంది. 2021లో 11 రోజుల పాటు రక్తపాత యుద్ధం జరిగింది.
Updated Date - 2023-10-08T17:32:00+05:30 IST