Atiq Ahmed: ముగిసిన అతీఖ్ అంత్యక్రియలు.. హాజరైన కుమారులు, కుమార్తెలు
ABN, First Publish Date - 2023-04-16T22:02:55+05:30
అంత్యక్రియలకు అతీఖ్ కుమారులు, కుమార్తెలు హాజరయ్యారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) దుండగుల చేతిలో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్(Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ (Ashraf) అంత్యక్రియలు ముగిశాయి. ఇద్దరి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయ్యాక ప్రయాగ్‌రాజ్‌లోని(Prayagraj) కసరి మసరి శ్మశానవాటికకు తరలించారు. అక్కడే వారి మృతదేహాలను పూడ్చారు. అంత్యక్రియలకు అతీఖ్ కుమారులు, కుమార్తెలు హాజరయ్యారు. అంత్యక్రియలకు అతీఖ్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్(Shaista Parveen) హాజరవుతారని ప్రచారం జరిగినా ఆమె హాజరుకాలేదు. షైస్తా పర్వీన్ లొంగిపోతారని కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు.
అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ను శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని కెల్విన్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా.. ముగ్గురు దుండగులు మెడలో మీడియా ఐడీ కార్డులు ధరించి, అక్కడకు చేరుకున్నారు. దుండగుల్లో ఒకడు అతీక్ కణతపై రివాల్వర్‌ను పెట్టి, ట్రిగ్గర్ నొక్కేశాడు. అతీక్ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే దుండగులు అష్రాఫ్ వైపు వచ్చి.. అతణ్నీ కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా.. కుప్పకూలిన ఆ ఇద్దరిపై కాల్పులను కొనసాగించారు. దుండగులను ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్థానికులు-- లవ్లేశ్ తివారీ, సున్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించినట్లు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఆ ముగ్గురూ తమకు అతీక్‌తో ఉన్న పాతకక్షల వల్లే ఆ ఘాతుకానికి పాల్పడ్డట్లు అంగీకరించినట్లు తెలిసింది. ఇతర సమయాల్లో అతీక్ సామ్రాజ్యంలోకి ప్రవేశించడం కష్టమని, పోలీసులు వారిద్దరినీ జైలుకు తరలిస్తే మళ్లీ చాన్స్ దొరకదని చెప్పిట్లు సమాచారం. అందుకే మీడియా ముసుగులో అతీక్‌కు అతి సమీపానికి వచ్చాక.. ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అతీక్, అష్రాఫ్ హత్యపై దర్యాప్తునకు యూపీ సీఎం యోగి (Yogi) ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీని నియమించారు. డీజీపీ నుంచి ఆయన ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూపీ అంతటా అప్రమత్తత ప్రకటించారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతోంది.
అతీక్ అహ్మద్ సమాజ్‌వాదీ పార్టీ తరపున గతంలో ఎంపీగా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. నేరసామ్రాజ్యాన్ని స్థాపించాడు. 50 వరకు షెల్ కంపెనీలను సృష్టించి, నల్లధనాన్ని మార్చేవాడు. ఈ గూండారాజ్‌కు పాక్ నుంచి ఆయుధాలు సరఫరా అయ్యేవి. మొత్తంగా అతీక్ రూ. 1,400 కోట్ల నేరసామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ఇతనిపై 100కు పైగా క్రిమినల్ కేసులున్నాయి.
అతీఖ్‌కు, అతని సోదరుడు అష్రఫ్‌కు గత నెల 28న ప్రయాగ్‌రాజ్ కోర్టు యావజ్జీవ శిక్షను విధించింది. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌ను అతీఖ్ హతమార్చగా.. ఈ కేసులో ఉమేశ్‌పాల్ ప్రధాన సాక్షి. అప్పటి నుంచే ఉమేశ్‌ను అతీఖ్ టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న అతీఖ్ కుమారుడు అసద్ నేరుగా ఉమేశ్ ఇంట్లోకి చొరబడి.. అతణ్ని కాల్చి చంపాడు. రెండు రోజుల క్రితం ఝాన్సీ వద్ద పోలీసుల ఎన్‌కౌంటర్‌లో అసద్, అతడి స్నేహితులు గులాం హతమయ్యారు. ఈ కేసులో అతీఖ్‌ను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. అసద్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భద్రత కారణాల దృష్ట్యా అతీఖ్‌ను పోలీసులు అనుమతించలేదు. అయితే, అసద్ అంత్యక్రియలు ముగిసిన గంటల వ్యవధిలోనే అతీఖ్, అష్రఫ్ హత్యకు గురయ్యారు.
Updated Date - 2023-04-16T22:02:58+05:30 IST