Covid 19: బెంబేలెత్తిస్తున్న కొవిడ్ కొత్త వేరియెంట్.. రాష్ట్రాల్ని అప్రమత్తం చేసిన కేంద్రం
ABN, Publish Date - Dec 18 , 2023 | 10:36 PM
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోవడం, కేసులు కూడా గణనీయంగా పడిపోవడంతో.. ఇక ఆ వైరస్ నుంచి విముక్తి లభించినట్టేనని అంతా అనుకున్నారు. పరిస్థితులు కూడా దాదాపు సాధారణ స్థితికి వచ్చేశాయి. కానీ..
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోవడం, కేసులు కూడా గణనీయంగా పడిపోవడంతో.. ఇక ఆ వైరస్ నుంచి విముక్తి లభించినట్టేనని అంతా అనుకున్నారు. పరిస్థితులు కూడా దాదాపు సాధారణ స్థితికి వచ్చేశాయి. కానీ.. ఇంతలోనే ఈ కొవిడ్-19 మరో షాక్ ఇచ్చింది. ఇది మెల్లగా మళ్లీ వ్యాప్తి చెందుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ఇది చాలదన్నట్టు.. కేరళలో దాని సబ్-వేరియంట్ జేఎన్.1 కూడా వెలుగు చూసింది.
మునుపటి వేరియంట్లతో పోలిస్తే ఈ జేఎన్.1 చాలా భిన్నమైదని, రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకోగలదని, చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు కూడా పలు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలైతే తీసుకున్నారో.. వాటిని పునరుద్ధరించాలని అన్ని రాష్ట్రాల్ని హెచ్చరిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీ జారీ చేసింది. రానున్న పండగల సీజన్‌లో వైరస్ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని.. ఇన్‌ఫ్లుయెంజా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని పేర్కొంది.
ఇక కొత్త వేరియంట్ జేఎన్.1 పై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందిస్తూ.. భారత్‌తో పాటు 38 దేశాల్లో దీనిని గుర్తించినట్లు పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అప్రమత్తంగా ఉంటూ, కొత్త కేసులపై నిఘా ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఆర్‌టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని, వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని వెల్లడించింది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ చేపడుతోన్న మాక్ డ్రిల్స్‌లోనూ భాగస్వామ్యం కావాలని తెలిపింది.
కాగా.. ప్రస్తుతం భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసులు 1,828 ఉన్నాయి. కేరళలో ఒక మరణం నమోదైంది. అయితే.. ఈ మరణం కేవలం కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1 వల్ల అవ్వలేదని, అంతర్లీన ఆరోగ్య పరిస్థితుల వల్ల సంభవించిందని INSACOG (వైరస్ జన్యు వైవిధ్యాలను ట్రాక్ చేసే జన్యు ప్రయోగశాలల నెట్‌వర్క్) చీఫ్ డాక్టర్ NK అరోరా స్పష్టం చేశారు. INSACOG ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని.. వైరస్ ఎపిడెమియాలజీ, క్లినికల్ ప్రవర్తనను అధ్యయనం చేస్తోందని ఆయన ఉద్ఘాటించారు.
Updated Date - Dec 18 , 2023 | 10:36 PM