Chandrayaan-3: చంద్రునిపై అరుదైన ఫీట్.. సెంచరీ కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. ఫోటో విడుదల చేసిన ఇస్రో
ABN, First Publish Date - 2023-09-02T16:58:21+05:30
చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టినప్పటి నుంచి తన పరిశోధనలు కొనసాగిస్తున్న చంద్రయాన్-3 రోవర్ ప్రజ్ఞాన్ తాజాగా ఒక అరుదైన ఘనత సాధించింది. ఇప్పటివరకు చంద్రునిపై ఇది...
చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టినప్పటి నుంచి తన పరిశోధనలు కొనసాగిస్తున్న చంద్రయాన్-3 రోవర్ ప్రజ్ఞాన్ తాజాగా ఒక అరుదైన ఘనత సాధించింది. ఇప్పటివరకు చంద్రునిపై ఇది 100 మీటర్ల వరకు ప్రయాణం చేసింది. తన అన్వేషణల్లో భాగంగా ఇంకా తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ట్విటర్ (X ప్లాట్‌ఫార్మ్) మాధ్యమంగా తెలిపింది. ‘‘ప్రజ్ఞాన్ రోవర్ 100 నాటౌట్. చంద్రుని ఈ రోవర్ ఇప్పటివరకు 100 మీటర్లు ప్రయాణించింది, ఇంకా ప్రయాణం కొనసాగిస్తోంది’’ అంటూ ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోను సైతం ఇస్రో పోస్ట్ చేసింది.
కాగా.. ఆగస్టు 23వ తేదీన చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అవ్వడంతో, చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఇంతకుముందు అమెరికా, రష్యా, చైనా దేశాలే ఈ ఘనతను సాధించాయి. మరో విశేషం ఏమిటంటే.. దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు ల్యాండ్ అయిన వెంటనే తమ పనిని మొదలుపెట్టాయి. ఇప్పటిదాకా అవి అక్కడ చంద్రుని ఉష్ణోగ్రత వివరాల్ని భూమికి పంపించాయి. అంతేకాదు.. సల్ఫర్, ఆక్సిజన్, ఇనుము, క్రోమియం, సిలికాన్ వంటి మూలకాల ఉనికిని సైతం చంద్రయాన్-3 కనుగొంది. ప్రస్తుతం హైడ్రోజన్, హీలియం నిల్వల వేట సాగుతోంది.
మరోవైపు.. భూమిపై 14 రోజులకు సమానమైన చంద్రునిపై ఒక పగటి పూట పూర్తి కాబోతోంది. అక్కడ రాత్రి వేళ సమీపిస్తోంది. దీంతో.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను నిద్రపుచ్చేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. ‘‘రోవర్, ల్యాండర్‌లను నిద్రపుచ్చే ప్రక్రియ ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రారంభమవుతుంది. చంద్రునిపై రాత్రివేళ సమీపిస్తోంది. అక్కడ ఈ రెండు రాత్రిని తట్టుకోవలసి ఉంటుంది కాబట్టి, వాటిని స్లీప్ మోడ్‌లోకి పంపుతున్నాం’’ అని తెలిపారు. నిజానికి.. ల్యాండర్, రోవర్‌లు ఇంకా పనిచేసే స్థితిలోనే ఉన్నాయి కానీ, చంద్రునిపై రాత్రివేళ -200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ చలిని తట్టుకోవాలంటే, వీటిని నిద్రపుచ్చడమే శ్రేయస్కరం.
Updated Date - 2023-09-02T16:58:21+05:30 IST