Google: చంద్రయాన్-3 మరో రికార్డు..!
ABN, First Publish Date - 2023-12-11T20:21:48+05:30
ఈ ఏడాది భారత్‌కు సంబంధించి గూగుల్‌లో అత్యధికసార్లు వెతికిన అంశాంగా చంద్రయాన్-3 నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సెర్చుల్లో 9స్థానం కైవసం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన విషయం తెలిసిందే. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ అద్భుత విజయాన్ని అందుకుంది. గతంలో ఎవ్వరూ చేరని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న విక్రమ్ లాండర్ కాలుమోపడంతో యావత్ భారత్ సంబరాలు చేసుకుంది. చంద్రయాన్-3 విజయంతో.. శాస్త్రసాంకేతిక రంగాల్లో భారత్ సత్తాను ఇస్రో ప్రపంచానికి చాటినట్టైంది. లాండర్ చంద్రుడిపై దిగే క్షణాలను చూసేందుకు యావత్ దేశప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మిషన్ అమితాసక్తిని రేకెత్తించింది. తాజాగా గూగుల్ సెర్చ్ ఫలితాల్లో ఈ విషయాలు మరింత స్పష్టంగా రుజవయ్యాయి.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గూగుల్‌లో వెతికిన అంశాల జాబితాలో చంద్రయాన్-3 మిషన్ 9వ స్థానంలో నిలిచినట్టు గూగుల్ తాజాగా వెల్లడించింది. భారత్‌లో అయితే ఏకంగా నెం.1 స్థానాన్ని దక్కించుకుంది.
చంద్రుడిపై రోవర్ ల్యాండింగ్, ఉపరితలంపై రోవర్ కార్యాకలాపాలకు సంబంధించి ఇస్రో సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు చంద్రయాన్-3 చేపట్టిన విషయం తెలిసిందే. స్టాండర్డ్ రీఫ్యూలింగ్, డాకింగ్ టెక్నాలజీ, స్మార్ట్ స్పేస్ రోబోట్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో సాంకేతిక నైపుణ్యం ఈ మిషన్‌తో రుజువైంది. భవిష్యత్తులో ఇస్రో చేపట్టబోయే మిషన్లకు ఈ అత్యాధునిక సాంకేతికతలు కీలకం కానున్నాయి.
చంద్రుడిపై ల్యాండయ్యాక పధ్నాలుగు రోజుల పాటు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ కార్యకలాపాలు నిర్వహించాయి. రోవర్ జాబిల్లిపై కలియతిరుగుతూ పలు ప్రయోగాలు చేసింది. సౌరశక్తి ఆధారంగా నడిచే రోవర్, ల్యాండర్‌లు.. చంద్రుడిపై సూర్యాస్తమయం కావడంతో నిద్రావస్థలోని వెళ్లిపోయాయి. మరోసారి సూర్యోదయం తరువాత ఇస్రో వీటిని క్రియాశీలకం చేసేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. దీంతో, రోవర్ ల్యాండర్‌లు శాశ్వత నిద్రాణస్థితిలోకి వెళ్లాయని ఇస్రో ప్రకటించింది. అప్పటికే మిషన్ తన లక్ష్యాలను పూర్తి చేసిందని వెల్లడించింది.
Updated Date - 2023-12-11T20:27:59+05:30 IST