Char DhamYatra: ప్రారంభమైన చార్‌ధామ్ యాత్ర, తెరుచుకున్న గంగోత్రి ఆలయం
ABN, First Publish Date - 2023-04-22T16:36:32+05:30
అక్షయ తృతీయ శుభ సందర్భంగా శనివారం చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి ఆలయ ద్వారం తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. గంగోత్రి ఆలయంలో ప్రధాని మోదీ పేరున తొలి పూజ..
ఉత్తరాఖండ్: అక్షయ తృతీయ శుభ సందర్భంగా శనివారం చార్‌ధామ్ యాత్ర(Chardham Yatra) ప్రారంభమైంది. యాత్రలో భాగంగా యమునోత్రి(Yamunotri Dham), గంగోత్రి(Gangotri Dham) ఆలయాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. గంగోత్రి ఆలయంలో ప్రధాని మోదీ పేరున తొలి పూజ నిర్వహించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఖర్సాలీ గ్రామం నుంచి మాతా యమునాదేవి డోలి కార్యక్రమంలో పాల్గొని యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించారు.
“శనివారం యమునోత్రి ధామ్ నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. యమునోత్రి(Yamunotri Dham), గంగోత్రి(Gangotri Dham) ఆలయాలు తెరుచుకోవడంతో చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కాగా, ఏప్రిల్ 25న కేదార్‌నాథ్ ధామ్(Kedarnath Dham), ఏప్రిల్ 27న బద్రీనాథ్ ధామ్(Badrinath Dham)లు తెరుచుకోనున్నాయి. ప్రతియేటా యమునాదేవి విగ్రహాన్ని మోసే పల్లకీని వేదశ్లోకాల మంత్రోచ్ఛారణల మధ్య బయటకు తీస్తారు.
అత్యంత ఎత్తయిన హిమాలయాల్లో ఉన్న ఈ నాలుగు యాత్రాస్థలాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను కలిపి చార్‌ధామ్ అని పిలుస్తారు. ఈ మతపరమైన కేంద్రాలకు ప్రతియేటా పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివస్తారు. ఇవి ఉత్తర భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మతపరమైన యాత్రాస్థలాలు.
ఇదిలా ఉండగా, ఉఖీమత్‌లో శీతాకాల విడిది తర్వాత బాబా కేదార్‌నాథ్ పంచముఖి డోలి ఉత్సవ్ శుక్రవారం హిలయాలకు బయల్దేరింది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఓంకారేశ్వరాలయం ఉఖిమఠానికి చేరుకున్నారు. తొలిరాత్రి బస కోసం బాబా కేదారినాథ్ డోలీ శుక్రవారం గుప్త కాశీ విశ్వనాథ ఆలయానికి చేరుకుంది. డోలీ ఏప్రిల్ 24న కేదార్‌నాథ్ చేరుకుంటుంది.
కాగా చార్‌ధామ్ యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. గురువారం యాత్రకు సంబంధించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Updated Date - 2023-04-22T18:35:09+05:30 IST