ఢిల్లీ నగరం అత్యంత కాలుష్యం
ABN, First Publish Date - 2023-10-05T02:32:22+05:30
ఢిల్లీలో గాలి నాణ్యత స్వల్పంగా మెరుగుపడినప్పటికీ దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా కొనసాగుతోంది...
సురక్షిత స్థాయి కంటే 3 రెట్లు ఎక్కువ
న్యూఢిల్లీ, అక్టోబరు 4: ఢిల్లీలో గాలి నాణ్యత స్వల్పంగా మెరుగుపడినప్పటికీ దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా కొనసాగుతోంది. ఇక్కడి గాలిలో పీఎం2.5 కాలుష్య గాఢత ఘన మీటరుకు 100.1 మైక్రోగ్రాములు ఉంది. అంటే ఢిల్లీలో ప్రభుత్వ సురక్షిత ప్రమాణాల స్థాయి కంటే 3 రెట్లు అధికంగా కాలుష్యం ఉంది. గతేడాది అక్టోబరు 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు గాలి నాణ్యతపై నిర్వహించిన అధ్యయనం వివరాలను క్లైమేట్ ట్రెండ్స్ అండ్ టెక్ ఫర్మ్ రెస్పిరెర్ లివింగ్ సైన్సెస్ అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా వెల్లడించింది. 2026 నాటికి గాలి కాలుష్యాన్ని 40ు వరకు తగ్గించాలనే లక్ష్యంతో జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం చేపట్టిన నగరాలలో ఈ అధ్యయనం నిర్వహించింది. దేశంలో స్వచ్ఛమైన గాలి ఉన్న నగరాలుగా మిజోరం, ఐజ్వాల్ నిలిచాయి. ఈ నగరాలలో పీఎం2.5 కాలుష్యం స్థాయి ఘన మీటరుకు 11.1 మైక్రోగ్రాములు మాత్రమే ఉంది. గాలి కాలుష్యంలో ఢిల్లీ తర్వాతి స్థానంలో బిహార్ రాజధాని పట్నా నిలిచింది. అత్యంత కాలుష్యపూరితమైన పది నగరాలలో జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్) పరిధిలోని ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్, మీరట్ కూడా నిలిచాయి. టాప్-7 కాలుష్య నగరాలైన ఢిల్లీ, పట్నా, ముజఫర్‌పూర్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్, మీరట్ మొత్తం గంగా మైదాన ప్రాంతంలోనివే కావడం గమనార్హం. కాగా, గతేడాదితో పోల్చితే గంగా మైదాన ప్రాంత నగరాలలో గత కొన్నేళ్లుగా గాలి నాణ్యత మెరుగుపడుతోందని క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ డైరెక్టర్ ఆర్తి ఖాల్స చెప్పారు. అయినప్పటికీ ఈ నగరాలలో భారీస్థాయిలో కాలుష్యం ఉండటంతో దేశంలోనే పీఎం2.5 కాలుష్యం అధికంగా ఉన్న నగరాలుగా ఇవి కొనసాగుతున్నాయన్నారు.
Updated Date - 2023-10-05T02:32:22+05:30 IST