High Court : ఆ బాధితురాలు బిడ్డకు జన్మనివ్వడం వర్ణనాతీతమైన దుఃఖమే : హైకోర్టు
ABN, First Publish Date - 2023-07-12T16:27:45+05:30
లైంగిక దాడికి గురైన బాధితురాలు గర్భవతి అయినపుడు, బిడ్డకు జన్మనివ్వాలని ఆమెను నిర్బంధించడం సరికాదని, అలా చేస్తే, వర్ణనాతీతమైన దుఃఖానికి దారి తీస్తుందని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) చెప్పింది. పన్నెండేళ్ల వయసుగల మూగ, చెవిటి దివ్యాంగురాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పునిచ్చింది.
అలహాబాద్ : లైంగిక దాడికి గురైన బాధితురాలు గర్భవతి అయినపుడు, బిడ్డకు జన్మనివ్వాలని ఆమెను నిర్బంధించడం సరికాదని, అలా చేస్తే, వర్ణనాతీతమైన దుఃఖానికి దారి తీస్తుందని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) చెప్పింది. పన్నెండేళ్ల వయసుగల మూగ, చెవిటి దివ్యాంగురాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పునిచ్చింది. 25 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని పిటిషనర్ కోరారు.
బాధితురాలి పరిస్థితిని పరీక్షించేందుకు ఐదుగురు సభ్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని హైకోర్టు గత వారం ఆదేశించింది. బాధితురాలి తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, బాధితురాలి పొరుగింట్లో ఉన్న వ్యక్తి ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఆమెకు మాటలు రానందువల్ల ఆమె ఆ దారుణాల గురించి ఎవరికీ చెప్పలేకపోయినట్లు తెలిపారు. ఆమె తల్లి గట్టిగా ప్రశ్నించినపుడు, తన పొరుగింటి వ్యక్తి తనపై లైంగిక దాడి చేసినట్లు సంకేత భాష ద్వారా చెప్పినట్లు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం ప్రకారం నిందితునిపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని జూన్ 16న పరీక్షించినపుడు ఆమె 23 వారాల గర్భవతి అని నిర్థరణ అయింది. ఈ విషయాన్ని మెడికల్ బోర్డుకు నివేదించారు. గర్భందాల్చి 24 వారాలు పూర్తవుతున్నందువల్ల గర్భస్రావం చేయడానికి కోర్టు అనుమతి అవసరమని బోర్డు చెప్పింది.
సంబంధిత పార్టీల వాదనలను విన్న హైకోర్టు స్పందిస్తూ, రాజ్యాంగ కోర్టులకు అసాధారణ అధికారాలు ఉన్నాయని తెలిపింది. ఈ అధికారాలను సుప్రీంకోర్టు కూడా గుర్తించిందని, అనేకసార్లు వీటిని వినియోగించి 24 వారాల తర్వాత కూడా గర్భస్రావం చేయడానికి అనుమతి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది. ఈ కేసులో అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఐదుగురు సభ్యుల వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని జవహర్లాల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించాలని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
Former Minister: ఆదాయానికి మించి ఆస్తులు.. మాజీ మంత్రిపై ఛార్జీషీటు దాఖలు
Collegium system : కొలీజియం వ్యవస్థపై సీజేఐ చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు
Updated Date - 2023-07-12T16:27:45+05:30 IST