Elections : డిసెంబరు-జనవరిల్లోనే..!
ABN, First Publish Date - 2023-09-03T03:15:18+05:30
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో జమిలి బిల్లు పెడతారా? అది ఆమోదం పొందినా.. పొందకపోయినా లోక్‌సభను రద్దు చేస్తారా!? ఆ తర్వాత.. పాక్షిక జమిలి ఎన్నికలు డిసెంబరు-జనవరిల్లోనే జరిగే అవకాశాలు ఉన్నాయా!? ఈ ప్రశ్నలకు ఔను’ అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
పాక్షిక జమిలి దిశగా అడుగులు
లోక్‌సభతోపాటు 10-12 రాష్ట్రాల అసెంబ్లీలకు
రామ మందిరం ప్రారంభమూ ఆలోపే
ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, ఓబీసీ వర్గీకరణ తదితర కీలక బిల్లులు
శీతాకాల సమావేశాలు ఇక ఉండవని అంచనా
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో జమిలి బిల్లు పెడతారా? అది ఆమోదం పొందినా.. పొందకపోయినా లోక్‌సభను రద్దు చేస్తారా!? ఆ తర్వాత.. పాక్షిక జమిలి ఎన్నికలు డిసెంబరు-జనవరిల్లోనే జరిగే అవకాశాలు ఉన్నాయా!? ఈ ప్రశ్నలకు ఔను’ అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఇంత తక్కువ సమయంలో జమిలి సాధ్యమయ్యే అవకాశాలు లేవు. రామ్‌నాథ్ కోవింద్ కమిటీని శుక్రవారం నియమించి, శనివారం విధివిధానాలు ఖరారు చేసినా.. ఇంత భారీ కసరత్తుపై పక్షం రోజుల్లోనే కమిటీ నివేదిక సమర్పించే అవకాశాలు లేవు. ఒకవేళ సమర్పించినా ఐదు రాజ్యాంగ సవరణలు చేయడం, సగం రాష్ట్రాల ఆమోదం పొందడమూ సులువు కాదు. దాంతో, దశలవారీగా ఈ ఆలోచనను అమలు చేయాలని కోవింద్ కమిటీ ద్వారా ప్రభుత్వం నివేదిక తెప్పించుకునే అవకాశముందని అంటున్నారు. దాంతో, ఈ డిసెంబరు నుంచి వచ్చే డిసెంబరు మధ్యలో ఎన్నికలు జరగాల్సిన పది నుంచి 12 రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు కలిపి పాక్షిక జమిలి ఎన్నికలు జరిపే విధంగా పావులు కదుపుతున్నట్లు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది నవంబరు-డిసెంబరులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీ్‌సగఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉండగా, వచ్చే ఏడాది మే- డిసెంబరు మధ్య ఆంధ్రపదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిసా, సిక్కిం, హరియాణ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది మే-డిసెంబరు మధ్య ఎన్నికలు జరపాల్సిన అసెంబ్లీలకు ముందస్తుకు సంబంధించి పెద్దగా ఇబ్బందులుండవని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల ముందు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ, ఈ ఏడాది నవంబరు- డిసెంబరుల్లో ఎన్నికలు జరగాల్సిన అసెంబ్లీలకు సంబంధించి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉదాహరణకు, తెలంగాణ అసెంబ్లీ 2019 జనవరి 17న సమావేశమైంది. అంటే, 2024 జనవరి 16లోపు మళ్లీ ఇక్కడ సర్కారు కొలువు తీరాలి. లేకపోతే, రాష్ట్రపతి పాలన విధించాలి. పాక్షిక జమిలి ఎన్నికలు ఆలస్యమైతే తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే సమస్య ఉత్పన్నమవుతుంది. అప్పుడు రాష్ట్రపతి పాలనకు ఆ రాష్ట్రాలు అంగీకరిస్తాయా!? అనేది ప్రశ్న. అంగీకరించకపోతే ఆ రాష్ట్రాల్లో షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరపాలి. అప్పుడు పాక్షిక జమిలి ప్రయోగం విఫలమవుతుంది. ఇక్కడే మరో సమస్య తెరపైకి వస్తోంది. ఒకవేళ, సెప్టెంబరు చివర్లో లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలకు వెళితే.. కేంద్ర మంత్రి మండలి ఉండదు కనక.. జనవరిలో వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో, లోక్‌సభతోపాటు పది, 12 రాష్ట్రాల అసెంబ్లీలకు డిసెంబరు- జనవరిల్లోనే ఎన్నికలు జరిపేలా కేంద్రం పావులు కదుపుతోందని చెబుతున్నారు. కానీ, సెప్టెంబరు 18న లోక్‌సభను రద్దు చేసినా పాక్షిక జమిలి ఎన్నికలు పూర్తి చేయడానికి అప్పటికి వంద నుంచి 110 రోజుల గడువు ఉంటుంది. అంత తక్కువ సమయంలో ఇంత భారీ కసరత్తును పూర్తి చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలూ ఎదురవుతున్నాయి.
ప్రత్యేక సమావేశాల్లో పలు బిల్లులు..
త్వరలో జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో జస్టిస్ రోహిణి కమిషన్ సమర్పించిన ఓబీసీ వర్గీకరణ, మహిళా రిజర్వేషన్ తదితర కీలక బిల్లులను ప్రవేశపెట్టి అవకాశం ఉంది. అలాగే జమిలి ఎన్నికలపై చర్చ ఉండవచ్చని, 10-12 రాష్ట్రాల్లో పాక్షిక ఎన్నికలు జరపాలని మోదీ భావిస్తే పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగకపోవచ్చని అంటున్నారు.
రామ మందిరం ప్రారంభమూ ముందుగానే!
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరపకుండా మోదీ సార్వత్రిక ఎన్నికలకు వెళ్లే అవకాశాలు లేవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జనవరి రెండో వారం లేదా మూడో వారంలో రామమందిరం ప్రారంభమవుతుందని అయోధ్య రామమందిరం ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. రామ మందిరం ప్రారంభం సందర్భంగా పూజలో ప్రధాని మోదీ పాల్గొన్నా బీజేపీకి రాజకీయ ప్రయోజనం దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా. కానీ, పాక్షిక జమిలి ఎన్నికల నేపథ్యంలో ఈ ముహూర్తాన్ని కాస్త ముందుకు జరిపే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవాన్ని డిసెంబరులోనే నిర్వహించి, ఆ తర్వాతే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించే విధంగా కేంద్రం పావులు కదుపుతోందని అంచనాలు ఉన్నాయి.
Updated Date - 2023-09-03T03:15:18+05:30 IST