INDIA Name Change Now Bharat : ఇండియా.. ఇక భారత్!
ABN, First Publish Date - 2023-09-06T04:36:22+05:30
మోదీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతోందా? ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ అని తీసుకురానుందా..? విపక్షాల ‘ఇండియా’ కూటమికి భయపడే ఇలా పేరు మార్చుతోందా..? తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు
పేరు మార్చాలని మోదీ సర్కారు నిర్ణయం?
జీ20 ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతిని
‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా ప్రస్తావన
ప్రధాని ఇండొనేసియా పర్యటన
నోట్‌లోనూ ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’
పేరు మార్పుపై పార్లమెంటులో బిల్లు!
సాధారణ మెజారిటీతో సవరిస్తే చాలు
రాజ్యాంగంలో ఇప్పటికే ఈ రెండు పేర్లూ
1వ అధికరణలో ‘ఇండియా, దటీజ్ భారత్’
రాజ్యాంగ సభలోనూ దీనిపై విస్తృత చర్చ
దేశం నుంచి విడిపోయే హక్కు లేకుండా
‘రాష్ట్రాల యూనియన్’గా పేర్కొన్న వైనం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మోదీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతోందా? ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ అని తీసుకురానుందా..? విపక్షాల ‘ఇండియా’ కూటమికి భయపడే ఇలా పేరు మార్చుతోందా..? తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొనడం సంచలనం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర హేమాహేమీలు హాజరవుతున్న అంతర్జాతీయ సదస్సులో రాష్ట్రపతిని సంభోదించే తీరును మార్చడం అత్యంత గణనీయమైన మార్పుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒక అధికారిక కార్యక్రమంలో ఇండియా పేరును భారత్ అని మార్చడం ఇదే తొలిసారి అని అధికార వర్గాలు అంటున్నాయి. అంతేగాక విదేశీ ప్రతినిధులకు పంపిణీ చేసిన జీ-20 బుక్‌లెట్‌లో కూడా ‘భారత్’ అనే పేర్కొన్నారు. జీ-20 కూటమి అధ్యక్ష స్థానంలో ఉన్న భారతదేశం గురించి అందులో వివరిస్తూ.. ‘భారత్, ప్రజాస్వామ్యానికి తల్లి (ద మదర్ ఆఫ్ డెమోక్రసీ)’ అనే శీర్షిక పెట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రధాని మోదీ ఇండొనేసియా పర్యటనకు సంబంధించి అధికారిక నోట్‌లోనూ ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’గా పేర్కొనడం విశేషం. ఆయన మంగళ, బుధవారాల్లో జకార్తాలో పర్యటించనున్నారు. ఏషియన్-ఇండియా, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొననున్నారు. పార్లమెంటు ఆమోదించకముందే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌గా ప్రస్తావించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే అధికార వర్గాలు మాత్రం దేశానికి భారత్ అని అధికార నామం ఇప్పటికే ఉందని అంటున్నాయి. రాజ్యాంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారని, 1946-48 మధ్య రాజ్యాంగ అసెంబ్లీలో ఈ విషయంపై లోతుగా చర్చ కూడా జరిగిందని తెలిపాయి. రాజ్యాంగంలోని మొదటి అధికరణలో.. ఇండియా అంటే భారత్, ‘ రాష్ట్రాల సంఘం’గా ఉంటుందన్న వాక్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో ఇక నుంచి ఇండియా అని ఉన్న చోటల్లా భారత్ అని మారుస్తూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మొదటి అధికరణను సవరించే బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతవరకు ఎజెండా బహిర్గతం కాకపోయినా.. భారత్‌గా మార్చే బిల్లు ఉండొచ్చని రాజకీయ వర్గాల అంచనా.
సంఘ్ అధినేత సూచన
ఇండియా పేరును భారత్‌గా మార్చాలని ఆర్‌ఎ్‌సఎస్ ఏనాటి నుంచో కోరుతోంది. ఇటీవల సంఘ్ సర్‌సం్‌ఘచాలక్ మోహన్ భాగవత్ ఇదే సూచన చేశారు. కొన్ని శతాబ్దాలుగా దేశాన్ని భారత్‌గా పిలుస్తున్నారని గుర్తుచేశారు. ఇండియా పేరును భారత్‌గా మారుస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బీజేపీ రాజ్యసభ సభ్యులు నరేశ్ బన్సల్, హర్‌నాథ్‌సింగ్ యాదవ్ డిమాండ్ చేశారు కూడా. ఇవన్నీ పక్కనపెడితే.. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో 28కిపైగా రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి రావడం.. సీట్ల సర్దుబాటుకు నిర్ణయం తీసుకోవడం కమలనాథులను కలవరపరుస్తున్నట్లు స్పష్టమవుతోంది. విపక్షాల ప్రయత్నాలు, ప్రజాసమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇండియా పేరును భారత్‌గా మార్చాలన్న అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.
సుప్రీంకోర్టు ఏమన్నది..?
ఇండియా పేరును భారత్‌గా మార్చాలని గతంలో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. అలా దాఖలైన పిల్‌పై 2016 మార్చిలో నాటి సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. పిల్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ‘భారత్ అని పిలుస్తారా..? అలాగే పిలుచుకోండి. అలాగే కొందరు ఇండియా అని పిలుచుకుంటారు.. పిలుచుకోనివ్వండి’ అని జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల తర్వాత 2020లో కూడా ఇలాంటి వ్యాజ్యమే దాఖలైంది. అప్పుడు కూడా కోర్టు విచారణకు స్వీకరించేందుకు అంగీకరించలేదు. ఈ వ్యాజ్యాన్ని వినతి రూపంలో మార్చి.. సముచిత నిర్ణయం తీసుకునేందుకు కేంద్రప్రభుత్వానికి పంపాలని సూచించింది.
రాజ్యాంగ రచన సమయంలోనే చర్చ
రాజ్యాంగంలోని ఒకటో ఆర్టికల్‌లో ‘ఇండియా.. దటీజ్ భారత్’ అని పేర్కొన్నారు. రాజ్యాంగ సభ ఏర్పడకముందు దేశాన్ని భారత్, ఇండియా, హిందూస్థాన్ అని పిలిచేవారు. దరిమిలా స్వతంత్ర భారతాన్ని ఏమని పిలవాలన్నదానిపై రాజ్యాంగ సభలో విస్తృత చర్చలు సాగాయి. భారత ఉపఖండాన్ని ఇండియా అని పిలుద్దామా.. భారత్ అని పిలుద్దామా అని రాజ్యాంగ ముసాయిదా రచనాసంఘం చర్చించింది. పలువురు ‘భారత్’వైపు మొగ్గుచూపగా.. ఎక్కువ మంది ‘ఇండియా’కు సుముఖత చూపారు. దాంతో ‘ఇండియా, దటీజ్, భారత్, రాష్ట్రాల సంఘం’ అని ఒకటో అధికరణను రాజ్యాంగ సభ 1949 సెప్టెంబరు 1న ఆమోదించింది. ఈ అధికరణ భారత సమైక్యతను నొక్కిచెప్పింది. అలాగే భారత్ ఏకీకృత రాజ్యం కాదని.. ‘రాష్ట్రాల సంఘం’గా పేర్కొంది. దేశం నుంచి విడిపోయే హక్కు రాష్ట్రాలకు లేదని స్పష్టత ఇచ్చేందుకే ‘రాష్ట్రాల సంఘం’గా పేర్కొన్నామని అంబేడ్కర్ ఈ ఆర్టికల్‌పై వివరణ ఇచ్చారు. కాగా, ‘రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ పేరును భారత్‌గా మార్చాలంటే రాజ్యాంగానికి ఎన్నో సవరణలు చేయాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారి తెలిపారు. ‘‘ఐరాసలో మన దేశం పేరు ‘రిపబ్లిక్ ఆప్ ఇండియా’ అని ఉంది. రేపు రిపబ్లిక్ ఆఫ్ భారత్‌గా మార్చాల్సి ఉంటుంది. అన్ని దేశాలకు సంబంధిత సమాచారం పంపాల్సి ఉంటుంది’ అని వివరించారు.
‘భారత్’ సవరణ ఎలా..?
ఇండియా పేరును అధికారికంగా ‘భారత్’ అని మాత్రమే ఉంచాలని కేంద్రం నిర్ణయించుకుంటే.. రాజ్యాంగంలోని ఒకటో అధికరణను సవరిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టాల్సి ఉంటుంది. సాధారణ మెజారిటీతో గానీ.. ప్రత్యేక మెజారిటీతో గానీ సవరణ చేపట్టేందుకు 368 అధికరణ అనుమతిస్తోంది. కొత్త రాష్ట్రం ఏర్పాటు, లేదంటే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజ్యసభలో సీట్ల కేటాయింపు వంటి కొన్ని అధికరణలను.. సాధారణ మెజారిటీతో అంటే.. సభకు హాజరైన ఎంపీల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది మద్దతుతో ఆమోదించవచ్చు. ఒకటో అధికరణతో పాటు రాజ్యాంగంలో ఇంకేవైనా మార్పులు చేయాలనుకుంటే.. ప్రత్యేక మెజారిటీతో.. అంటే సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతులకు తక్కువ కాకుండా ఓటేయాల్సి ఉంటుంది.
పేరు మారితే డాట్ ఇన్ వెబ్‌సైట్ల పరిస్థితి..?
ఇండియా పేరుని భారత్‌గా మారిస్తే డాట్ ఇన్ (.ఇన్) పేరిట ఉన్న వెబ్‌సైట్ల పరిస్థితి ఏమిటనే అంశం కూడా తెరపైకి వచ్చింది. వెబ్‌సైట్ అడ్ర్‌సల విషయానికొస్తే కంట్రీ కోడ్ టాప్ లేయర్ డొమైన్ (సీసీటీఎల్‌డీ) ప్రకారం ఇండియాలోని వెబ్‌సైట్లను డాట్ ఇన్ రిజిస్ట్రీతో గుర్తిస్తారు. వీటిని ఎన్‌ఐఎక్స్‌ఐ అనే సంస్థ రూపొందిస్తుంది. దీనికితోడు డాట్ ఇన్‌ను నిర్దిష్ట ప్రయోజనం కోసం కొన్ని వెబ్‌సైట్లకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఉదాహరణకు జీవోవీ.ఇన్ అనేది భారత ప్రభుత్వం ఉపయోగిస్తుండగా.. ఎంఐఎల్.ఇన్‌ను మిలిటరీ వినియోగిస్తుంది. టీఎల్‌డీలు అన్ని దేశాల వెబ్‌సైట్లకు ఒక గుర్తింపునిస్తాయి. డాట్ ఇన్ ఉంటే అది ఇండియన్ వెబ్‌సైట్ అని సులువుగా గుర్తించవచ్చన్నమాట. భవిష్యత్‌లో ఇండియాను ప్రపంచమంతా భారత్ అని పిలవాల్సి వస్తే... మన దేశ వెబ్‌సైట్లకు కూడా కొత్త టీఎల్‌డీ ఉండడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. డాట్ బీహెచ్ లేదంటే డాట్ బీఆర్, డాట్ బీటీలను పరిశీలించవచ్చు. అయితే ఇప్పటికే బ్రెజిల్ డాట్ బీఆర్, బహ్రయిన్ డాట్ బీహెచ్, భూటాన్ డాట్ బీటీలను వాడుతున్నాయి. అయితే.. ఇండియా పేరు భారత్‌గా మారినంత మాత్రాన ప్రస్తుతం వాడుతున్న డాట్ ఇన్ డొమైన్ ఉన్న వెబ్‌సైట్లకు ఎటువంటి ఆపరేషన్ సమస్యా ఉండదన్న విషయాన్ని గమనించాలి.
Updated Date - 2023-09-06T04:36:22+05:30 IST