ISRO: చంద్రయాన్-3 విజయం తరువాత ఇస్రో దూకుడు.. 2040 కల్లా..
ABN, First Publish Date - 2023-12-12T17:03:42+05:30
చంద్రయాన్-3 తరువాత దూకుడు పెంచిన ఇస్రో. చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడం, గగన్‌యాన్ మిషన్లలో బిజీబిజీ.
ఇంటర్నెట్ డెస్క్: చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయంతో దూకుడు మీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో- ISRO) చంద్రుడిపైకి వ్యోమగామిని పంపేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. 2040 కల్లా ఆస్ట్రొనాట్‌ను పంపే లక్ష్యం పెట్టుకున్న ఇస్రో ఇప్పటికే వాయుసేనకు చెందిన నలుగురు పైలట్లను (Airforce pilots) వ్యోమగాములుగా శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసింది. ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ ఇటీవలే ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ గగన్‌యాన్ ప్రయోగంతో ఇస్రో అంతరిక్ష రంగంలో తదుపరి అడుగులు వేస్తోంది. భూమికి సమీపంగా ఉండే లో ఎర్త్ ఆర్బిట్‌లో (కక్ష్య) ఇద్దరు లేదా ముగ్గురు వ్యోమగాములను పంపేందుకు సన్నద్ధమవుతోంది. అంతరిక్షంలో మూడు రోజులు గడిపాక వారు సురక్షితంగా భూమికి తిరిగొస్తారు’’ అని మనోరమా ఇయర్ బుక్‌లో ప్రచురితమైన కథనంలో ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. చంద్రుడిపైకి వ్యోమగామిని (Indian astronaut on moon) దింపే క్రమంలో గగన్‌యాన్ మిషన్‌ను (Gaganyaan) తొలి మజిలీగా ఇస్రో భావిస్తున్న విషయం తెలిసిందే.
Infosys: బతిమాలుతున్నా మొండికేస్తున్న ఉద్యోగులు.. షాకిచ్చేందుకు సిద్ధమైన ఇన్ఫోసిస్!
Australia Visa : భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా.. భారతీయులకు ఇక గడ్డుకాలమే..
ఇస్రో ఎంపిక చేసిన వాయుసేన పైలట్లు ప్రస్తుతం బెంగళూరులోని వ్యోమగామి శిక్షణ కేంద్రంలో ట్రెయినింగ్‌లో (Astronaut training) పాల్గొంటున్నారని ఎస్. సోమనాథ్ వెల్లడించారు. ఎస్. సోమనాథ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌కు సెక్రెటరీగా, స్పేస్ కమిషన్‌కు చైర్మన్‌గా ఉన్న విషయం తెలిసిందే.
గగన్‌యాన్ మిషన్ ద్వారా ఇస్రో.. వ్యోమగాముల భద్రతకు కీలకమైన హెచ్ఎల్‌వీఎమ్-3 వ్యోమనౌక, వ్యోమగాములు కూర్చునే ఆర్బిటాల్ మాడ్యూల్, ప్రాణాధార వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. అయితే, గగన్‌యాన్‌కు ముందు ఇస్రో అనేక సన్నాహక మిషన్లను చేపడుతోంది. వీటిలో ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, వ్యోమనౌకపై ప్రయోగాలతో పాటు చిట్టచివరిగా గగన్‌యాన్ మిషన్‌తో పోలిన రెండు మానవ రహిత ప్రయోగాలు (జీ1, జీ2) కూడా నిర్వహిస్తుంది. ఈ దిశగా ఇస్రో ఇప్పటికే టెస్ట్ వెహికిల్ ప్రయోగాన్ని నిర్వహించింది. అత్యవసర సమయాల్లో వ్యోమగాములు తప్పించుకునేందుకు అవసరమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను ఈ ప్రయోగంలో దిగ్విజయంగా పరీక్షించింది. 2025లో చేపట్టబోయే గగన్‌యాన్ మిషన్‌కు ఈ విజయాలు అత్యంత కీలకమని సోమనాథ్ వ్యాఖ్యానించారు.
సూర్యుడి అధ్యయనం కోసం ఇస్రో తొలిసారిగా చేట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం కూడా సంస్థకు కీలకమైదని చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. ఆదిత్య ఎల్1 ఐదేళ్ల పాటు తన కార్యక్రమాలు కొనసాగించనుంది.
Updated Date - 2023-12-12T17:12:53+05:30 IST