Justin Trudeau: ఎట్టకేలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి మోక్షం.. రెండు రోజుల తర్వాత ఇంటికి పయనం
ABN, First Publish Date - 2023-09-12T16:00:45+05:30
ఎట్టకేలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి మోక్షం లభించింది. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కి వచ్చిన ఆయన.. నిర్దేశించిన షెడ్యూల్ కంటే 48 గంటల తర్వాత తన ఇంటికి బయలుదేరాడు. నిజానికి..
ఎట్టకేలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి మోక్షం లభించింది. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కి వచ్చిన ఆయన.. నిర్దేశించిన షెడ్యూల్ కంటే 48 గంటల తర్వాత తన ఇంటికి బయలుదేరాడు. నిజానికి.. ఆదివారం జీ20 సదస్సు ముగిసిన వెంటనే ఇతర అతిథులతో పాటు ట్రూడో సైతం వెళ్లిపోవాల్సింది. కానీ.. ఆయన అధికారిక విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అనంతరం ఇటలీ మీదుగా మరో విమానాన్ని ట్రూడో కోసం కెనడా ఎయిర్‌ఫోర్స్ పంపింది కానీ.. అది తన రూట్ మార్చుకొని లండన్‌కు వెళ్లింది. అయితే.. ఇందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. అదృష్టవశాత్తూ.. మొదటి విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం పరిష్కరించబడటంతో.. ఆయన స్వదేశానికి బయలుదేరాడు.
‘‘ట్రూడో అధికారిక విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం పరిష్కరించబడింది. ఇప్పుడు ఇది ఎగరడానికి సిద్ధంగా ఉంది’’ అంటూ కెనడా ప్రధాని కార్యాలయం మంగళవారం ట్వీట్ చేసింది. ప్రధాని మోదీ తరఫున ట్రూడోకు వీడ్కోలు పలికేందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వంలోని నా సహచరుల తరఫున.. జీ20 సమ్మిట్‌కు హాజరైనందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి ధన్యవాదాలు తెలిపేందుకు నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాను. ఆయన కుటుంబం స్వదేశానికి సురక్షితంగా తిరిగి వెళ్లాలని విష్ చేశాను’’ అంటూ రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. అసలు ట్రూడో విమానానికి ఏమైందన్న విషయంపై ఇంతవరకూ స్పష్టత రాలేదు. కెనడా ప్రధాని కార్యాలయం మాత్రం.. రాత్రికి రాత్రే సమస్యలు పరిష్కరించబడవని, పరిస్థితి యథాతథంగా ఉందని సోమవారం తెలిపింది.
ఇదిలావుండగా.. జీ20 సమ్మిట్‌లో ట్రూడో వ్యవహారశైలి అంటీముట్టనట్టుగా ఉంది. ఆయన విందుకు హాజరు కాలేదు. ఇతర నేతలతోనూ పెద్దగా కలవలేదు. మోదీ, ట్రూడో మధ్య అధికారిక ద్వైపాక్షిక చర్చలు సైతం జరగలేదు. రాజ్‌ఘాట్‌లో దేశాధినేతలు నివాళులు అర్పించే సమయంలో.. ట్రూడో చెయ్యి పట్టుకొని మోదీ అక్కడి విశేషాలు వివరించే ప్రయత్నం చేశారు. కానీ.. ట్రూడో సున్నితంగా చెయ్యి వెనక్కు తీసుకున్నారు. ఈ ఘటనపై మీడియా ప్రశ్నించినప్పుడు.. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అనుకోవచ్చుని ఘాటుగా బదులిచ్చారు. మరోవైపు.. ట్రూడో ఢిల్లీలో ఉండగానే, కెనడాలోని భారత దౌత్యకార్యాలయానికి బెదిరింపులు కూడా వచ్చాయి. తమ ప్రధానిని మిగిలిన దేశాధినేతలు సదస్సులో ఏమాత్రం పట్టించుకోలేదని.. కెనడాలోనూ విమర్శలు వస్తుండటం గమనార్హం.
Updated Date - 2023-09-12T16:00:45+05:30 IST