Karnataka Elections 2023: బొమ్మై పోటీ ఎక్కడినుంచో తేలిపోయింది..!
ABN, First Publish Date - 2023-04-03T20:07:35+05:30
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారో..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka polls) ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారో ఖరారైంది. హవేరీ జిల్లా షిగావ్ (Shiggon) సీటుకు తాను పోటీ చేయనున్నట్టు బొమ్మై సోమవారంనాడు ధ్రువీకరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది లేదని, హవేరీ జిల్లా షిగావ్ నుంచి తాను పోటీ చేయనున్నానని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పనితీరు ఆధారంగానే తాము ఎన్నికల్లో ప్రజల ఓట్లు అడుగుతామని, ఎన్నికలకు ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని బొమ్మై చెప్పారు. 2021 జూలై నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు.
ఏప్రిల్ 8న అభ్యర్థుల జాబితా..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈనెల 8వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగానే పార్టీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు అదే రోజు సమావేశం కానుందని బొమ్మై తెలిపారు. మంగళవారంనాడు రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో జిల్లా కమిటీలు సిఫారసు చేసిన పేర్లను చర్చించనున్నట్టు చెప్పారు. అనంతరం ఆ జాబితాను పార్లమెంటరీ బోర్డుకు పంపుతామని, ఈనెల 8న పార్లమెటరీ బోర్డు సమావేశం కావచ్చని తెలిపారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాను విడుదల చేసింది. తొలిసారిగా కర్ణాటకలో అడుగుపెడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ సైతం జాబితాను విడుదల చేసింది. మే 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మే 13న కౌటింగ్ జరిపి, ఫలితాలు ప్రకటిస్తారు.
Updated Date - 2023-04-03T20:07:35+05:30 IST