Speaker Om Birla: ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా వార్నింగ్.. ఆ పని చేస్తే కఠిన చర్యలు తప్పవు
ABN, First Publish Date - 2023-12-05T16:50:34+05:30
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు ఒక హెచ్చరిక జారీ చేశారు. లోక్‌సభలో ప్లకార్డులు తీసుకుని రావొద్దని.. సభలో గౌరవం, క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ప్లకార్డులు తీసుకొస్తే మాత్రం..
Om Birla Warns MPs Over Placard Issue: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు ఒక హెచ్చరిక జారీ చేశారు. లోక్‌సభలో ప్లకార్డులు తీసుకుని రావొద్దని.. సభలో గౌరవం, క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ప్లకార్డులు తీసుకొస్తే మాత్రం.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తనపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీ రమేశ్ బిధురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. బీఎస్పీ సభ్యుడు డానిష్ అలీ పార్లమెంట్ ఎదుట ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే.. స్పీకర్ ఓంబిర్లా ఎంపీలను ఈ మేరకు హెచ్చరించారు.
సోమవారం డానిష్ అలీ తన మెడకు ప్లకార్డు వేలాడదీసుకుని పార్లమెంట్ బయట నిరసన వ్యక్తం చేశారు. తనని బీజేపీ ఎంపీ రమేశ్ బిధురి కించపరిచే వ్యాఖ్యలు చేశారని.. అగౌరవ పరిచారని అందులో రాసి ఉంది. కాబట్టి.. ఆయనపై చర్యలు తీసుకొని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పీకర్ ఓంబిర్లా దృష్టికి తీసుకెళ్లాలి. ప్లకార్డును తొలగించాలని డానిష్ అలీని సూచించాలని ఆయన అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఓంబిర్లా స్పందిస్తూ.. ‘‘సోమవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్‌లో కొత్త పార్లమెంట్ హౌస్‌లో ప్లకార్డులు తీసుకురాబోమని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పార్లమెంట్‌లో గౌరవం, క్రమశిక్షణ పాటించాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ప్లకార్డులు తీసుకొస్తే.. ఆ ఎంపీలపై చర్యలు తీసుకుంటా’’ అని ఓంబిర్లా చెప్పుకొచ్చారు.
ప్లకార్డులతో సభకు రావడం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని, బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని వెంటనే సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. సభ నిబంధనలను ఉల్లంఘించవద్దని ప్రతి సభ్యునికీ విజ్ఞప్తి చేశారు. అందరూ డెకోరమ్‌ను కొనసాగించాలని, సానుకూల మనస్సుతో రావాలని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే.. స్పీకర్ మాటల్ని పట్టించుకోకుండా రమేష్ బిధూరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డానిష్ అలీ తన నిరసనలను కొనసాగించారు. దీంతో స్పీకర్ సహనం కోల్పోయారు. ప్లకార్డులతో సభకు రావడానికి ఎవరినీ అనుమతించనని తెగేసి చెప్పారు. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
Updated Date - 2023-12-05T16:50:36+05:30 IST