Mohamed Muizzu: భారత సైన్యాన్ని మాల్దీవుల నుంచి బహిష్కరించడమే ప్రధాన లక్ష్యం.. అధ్యక్షుడు మూయిజ్జూ కుండబద్దలు
ABN, First Publish Date - 2023-10-18T19:29:26+05:30
మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా నియమితులైన మహ్మద్ ముయిజ్జూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని బహిష్కరిస్తానని...
మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా నియమితులైన మహ్మద్ ముయిజ్జూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని బహిష్కరిస్తానని చెప్పారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే మాల్దీవుల నుంచి వైదొలగాలని భారత సైనికులను అభ్యర్థిస్తానని ఆయన తెలిపారు. భారత సైన్యాన్ని మాల్దీవుల నుంచి బహిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. అయితే.. ఈ అంశం వివాదాస్పదం అవ్వకుండా, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరిస్తానని అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో మూయిజ్జూ మాట్లాడుతూ.. ‘‘కొన్ని రోజుల క్రితమే నేను భారత హైకమిషనర్‌ను కలిశాను. భారత సైన్యాన్ని తిరిగి భారత్‌కు పంపే విషయాన్ని ఆయనతో ప్రస్తావించాను. ఇదే మా అత్యంత ప్రాధాన్యమైన అంశమని తెలిపాను. అందుకు వాళ్లు సానుకూలంగానే సమాధానం ఇచ్చారు. దీనిపై కలిసి పని చేద్దామని, ఈ అంశంపై ముందుకెళ్లే మార్గాన్ని కనుగొందామని చెప్పారు’’ అని పేర్కొన్నారు. అయితే.. మాల్దీవుల్లో ఎంతమంది భారత సైనికులు ఉన్నారన్న కచ్ఛితమైన సంఖ్య మాత్రం తనకు తెలియదని ముయిజ్జూ ఆశ్చర్యపరిచారు. కొన్ని శతాబ్దాల నుంచి తమది శాంతియుత దేశంగా ఉందని, తమ గడ్డపై విదేశీ దళాలు ఎప్పుడూ లేవని చెప్పారు. ఒకవేళ విదేశీ దళాలు తమ గడ్డపై ఉంటే.. తాము సురక్షితంగా లేమన్న భావన కలుగుతుందని ఆయన వివరించారు.
ఇదే సమయంలో మాల్దీవుల విదేశాంగ విధానం చైనా వైపు మొగ్గు చూపుతుందా? అని ప్రశ్నించినప్పుడు.. తాను మాల్దీవుల అనుకూల విధానాన్ని అనుసరిస్తానని జవాబిచ్చారు. ఇతర దేశాల్ని ప్రసన్నం చేసుకునేందుకు తాము ఏ దేశానికీ పక్షం వహించమని తేల్చి చెప్పారు. తమ దేశ ప్రయోజనాల్ని కాపాడుకోవడమే తమ మొదటి లక్ష్యంగా పేర్కొన్నారు. దానిని గౌరవించే ఏ దేశమైనా తమకు మిత్రదేశంగా ఉంటుందని ముయిజ్జూ చెప్పుకొచ్చారు. కాగా.. మొహమ్మద్ మొయిజ్జును చైనాకు మద్దతుదారుగా పరిగణిస్తారు. గత నెలలో ఆయన ఇబ్రహీం సోలిహ్‌ను ఓడించారు. ముయిజ్జూ ఎన్నికల వాగ్ధానాల్లో భారత సైన్యాన్ని మాల్దీవుల నుంచి తిరిగి వెనక్కు పంపడం ఉంది. ఈ అంశంపై అతడు మొండిగా ఉన్నాడు.
Updated Date - 2023-10-18T19:29:26+05:30 IST