Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్‌ని డిజైన్ చేశానన్నాడు.. పెద్ద చిక్కుల్లో చిక్కుకున్నాడు.. చివరికి ఏమైందంటే?
ABN, First Publish Date - 2023-08-26T16:20:03+05:30
ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎవరైనా వింతగా ప్రవర్తిస్తూ మాట్లాడినా, వీడియోలు పెడుతున్నా.. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే సెన్సేషన్ అవుతున్నారు. ఓవర్‌నైట్ స్టార్‌గా...
ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎవరైనా వింతగా ప్రవర్తిస్తూ మాట్లాడినా, వీడియోలు పెడుతున్నా.. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే సెన్సేషన్ అవుతున్నారు. ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదుగుతున్నారు. దీన్నే అదునుగా తీసుకొని కొందరు అపర మేధావులు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారు. తాము చేసిందేమీ లేకపోయినప్పటికీ.. ఏదో గొప్పదే సాధించామని గొప్పలకు పోతుంటారు. కేవలం వార్తల్లోకి రావడం కోసమే అసత్య ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు కూడా ఇలాగే పాపులారిటీ గడించడం కోసం ఏకంగా చంద్రయాన్-3 మిషన్‌నే వాడుకున్నాడు. విక్రమ్ ల్యాండర్‌ని తానే డిజైన్ చేశానని గొప్పలకు పోయాడు. చివరికి ఇదంతా బోగస్ అని తేలడంతో అతడు ఓ జోకర్‌లా మిగిలిపోయాడు.
ఆ వ్యక్తి పేరు మితుల్ త్రివేది. సూరత్‌కు చెందిన ఈ వ్యక్తి.. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టడమే ఆలస్యం, వెంటనే సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు. తాను ఇస్రోలో పని చేస్తున్నానని ఒక ఫేక్ స్టోరీని అల్లేశాడు. తాను చంద్రయాన్-3 ప్రాజెక్టులో పాలు పంచుకున్నానని, విక్రమ్ ల్యాండర్‌ని తానే డిజైన్ చేశానని చెప్పుకున్నాడు. అతడిలా తప్పుడు ప్రచారం చేయడమే ఆలస్యం.. స్థానిక మీడియా అతని ముందు వాలిపోయింది. అతని ఇంటర్వ్యూలు తీసుకుంది. దాంతో అతడు ఇంకా ఉప్పొంగిపోయి.. తన అబద్ధాలకు మరింత మసాలా జోడించేశాడు. దీంతో.. అతడు చెప్తున్న మాటలు నిజమేనా? కాదా? అనేది ధృవీకరించడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తులో.. అతడు చెప్పిందంతా అబద్ధమని తేటతెల్లమైంది.
పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా.. తాను ఇస్రోలో పని చేసినట్టుగా మితుల్ త్రివేది వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తేలింది. కేవలం చంద్రయాన్-3 సక్సెస్ క్రెడిట్ కొట్టేయడం కోసమే అతడు ఈ అబద్ధపు ప్రచారానికి తెరలేపాడని వెల్లడైంది. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఇస్రో శాస్త్రవేత్తగా పేరు పెట్టుకున్నప్పటికీ.. అందుకు సంబంధించి ఆధారాలేమీ లేవని సూరత్ పోలీస్ కమిషనర్ అజయ్ తోమర్ తెలిపారు. తనకు పీహెచ్‌డీ ఉందని మితుల్ చెప్పుకోవడం కూడా అబద్ధమేనని, అతనికి కేవలం బీకాం డిగ్రీ మాత్రమే ఉందని చెప్పారు. నాసాకు ఫ్రీలాన్సర్‌గా పని చేసినట్లు చెప్పుకోవడం కూడా క్రెడిట్ సంపాదించుకునే ప్లాన్‌లో భాగమేనని వెల్లడించారు. తమ దర్యాప్తులో మితుల్ ఇస్రో సైంటిస్ట్ కాదని తేలిందని, అతడ్ని మరోమారు ప్రశ్నించబోతున్నామని కమీషనర్ వెల్లడించారు.
Updated Date - 2023-08-26T16:20:03+05:30 IST