Tiruppavai: కృష్ణుడికి ఆ పేరు అలా వచ్చింది...
ABN, First Publish Date - 2023-01-02T18:48:15+05:30
ఆణ్డాళ్ చెప్పినదాన్ని తీసుకుని పరాశరభట్టార్యులు గోదాదేవికి నమస్కరిస్తూ ఇలా అన్నారు... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్
ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం పందొమ్మిదోరోజు; తిరుప్‌పావై పందొమ్మిదో పాసురమ్ రోజు.
పాసురమ్ 19
ఆణ్డాళ్, నప్పిన్నైను తలుపు తియ్యమని అడిగాక కృష్ణుడితో మాటగా ఈ పందొమ్మిదో పాసురాన్ని ప్రయోగించింది; అందుకుందాం రండి...
మూలం-
కుత్తువిళక్కెరియక్ కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
మెత్తెన్ఱ పఞ్‌జసయనత్తిన్ మేలేఱిక్
కొత్తలర్ పూఙ్‌కుళ్షల్ నప్పిన్నై కొఙ్‌గైమేల్
వైత్తుక్ కిడన్ద మలర్‌మార్బా! వాయ్ తిఱవాయ్;
మైత్తడఙ్ కణ్ణినాయ్! నీయున్ మణాళనై
ఎత్తనై పోదుమ్ తుయిలెళ్ష వొట్టాయ్ కాణ్;
ఎత్తనైయేలుమ్ పిరివాఱ్ట్ర కిల్లాయాల్
తత్తువమన్ఱు తగవేలోరెమ్‌పావాయ్!
తెలుగులో-
దీపాలు వెలుగుతూండగా దంతపు కోళ్ల మంచంలో
మెత్తటి దూదిపరుపుపైన చేరి,
విరులగుత్తుల జడతో ఉన్న నప్పిన్నై చనుకట్టుపై
నిద్రిస్తూ ఉన్న పద్మహారా! నోరు తెఱువు;
కాటుక కళ్లదానా! నువ్వు నీ మొగుణ్ణి
ఏ జామైనా నిద్రలేవనివ్వవు;
కాసేపైనా వియోగాన్ని తట్టుకోలేవా?
ఇదేం బాలేదు, నీకిది తగదు; ఓలాల నా చెలీ!
అవగాహన-
మేం వచ్చాం మాతో మాట్లాడు అని కృష్ణుణ్ణి అడుగుతూ, అక్కడి సన్నివేశాన్ని చిత్రణ చేస్తూ "దీపాలు వెలుగుతూండగా దంతపు కోళ్ల మంచంలో మెత్తటి దూదిపరుపుపైన చేరి విరులగుత్తుల జడతో ఉన్న నప్పిన్నై చనుకట్టుపై నిద్రిస్తూ ఉన్న పద్మహారా నోరు తెఱువు" అని అంటోంది ఆణ్డాళ్. ఇక్కడి నప్పిన్నై చనుకట్టుపై నిద్రిస్తున్న కష్ణుడు అని ఆణ్డాళ్ చెప్పినదాన్ని తీసుకుని పరాశరభట్టార్యులు గోదాదేవిని నమస్కరిస్తూ ఇలా అన్నారు:
"నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిరస్సిద్ధ మధ్యాపయన్తీ
స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుఙ్క్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః"
పరాశరభట్టార్యులు నప్పిన్నై ను నీళాదేవి అని పరిగణించారు.
కృష్ణుడు ఱొమ్ముపై ఉండెట్లు పద్మాలమాలను ధరించిన వాడని "మలర్‌మార్బా" (పుష్పవక్షం వాడా) అని అంది ఆణ్డాళ్. అదే ఇక్కడ పద్మహారా అయింది. పద్మహారః అని కృష్ణుడికి ఒక నామం ఉంది.
"కాటుక కళ్లదానా నువ్వు నీ మొగుణ్ణి
ఏ జామైనా నిద్రలేవనివ్వవు;
కాసేపైనా వియోగాన్ని తట్టుకోలేవా?
ఇదేం బాలేదు, నీకిది తగదు" అంటూ నప్పిన్నైను భక్తివల్ల వచ్చే చనువుతో అంటోంది ఆణ్డాళ్.
ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్
తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి
రోచిష్మాన్
9444012279
Updated Date - 2023-01-03T23:15:33+05:30 IST