Tiruppavai: శ్రీకృష్ణుడు ఎంత సంపన్నుడో తెలుసా...
ABN, First Publish Date - 2023-01-04T23:06:21+05:30
విరోధులు నీ ముందు బలహీనులై నీ వాకిట్లోకి గత్యంతరం లేక వచ్చి నీ పాదాలపై పడ్డట్లుగా... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్
ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం ఇరవయొకటోరోజు; తిరుప్‌పావై ఇరవయొకటో పాసురమ్ రోజు.
పాసురమ్ 21
ఆణ్డాళ్, కృష్ణుణ్ణి తమతో స్నానానికి పంపమని నప్పిన్నైను కోరుకున్నాక ఇరవైయొకటో పాసురమ్‌లో కృష్ణుణ్ణి మేలుకొలుపుతోంది; ఇలా...
మూలం-
ఏఱ్ట్ర కలఙ్గళ్ ఎదిర్‌పొంగి మీదళిప్ప
మాఱ్ట్రాదే పాల్ సొరియుమ్ వళ్ళఱ్ పెరుమ్ పసుక్కళ్
ఆఱ్ట్రప్ పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్;
ఊఱ్ట్రముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోఱ్ట్రమాయ్ నిన్ఱ సుడరే! తుయిలెళ్షాయ్;
మాఱ్ట్రార్ ఉనక్కు వలితొలైన్దున్ వాసర్కణ్
ఆఱ్ట్రాదు వన్దున్ అడిపణియుమాపోలే
పోఱ్ట్రియామ్ వన్దోమ్ పుగళ్ష్‌న్దేలోరెమ్‌పావాయ్!
తెలుగులో-
కడవల్లోంచి ఎదురు పొంగిపొర్లేట్లుగా
ధారగా పాలు ఇచ్చే మంచి పాడి ఆవులు
సమృద్ధిగా ఉన్నవాడి తనయుడా! మెలకువలోకి రా;
స్థిరమైనవాడా! ఉన్నతమైనవాడా! లోకంలో
వ్యక్తమై నెలకొన్న తేజమా! నిద్రలే;
విరోధులు నీ ముందు బలహీనులై నీ వాకిట్లోకి
గత్యంతరంలేక వచ్చి నీ పాదాలపై పడ్డట్లుగా
స్తుతిస్తూ, కీర్తిస్తూ వచ్చాం; ఓలాల నా చెలీ!
అవగాహన-
"కడవల్లోంచి ఎదురు పొంగిపొర్లేట్లుగా" అనడం బావుంది. కడవలు నిండి బయటకు పొంగి వచ్చేంతగా పాలు ఇచ్చే ఆవులట, అలాంటి ఆవులు సమృద్ధిగా ఉన్నాయట. కృష్ణుడు సంపన్నుడని ఇలా ప్రశస్తంగా చెబుతోంది ఆణ్డాళ్.
విష్ణువును 'వ్యక్తరూపుడు' అని అంటారు. ఆ భావంతోనే కృష్ణుణ్ణి "వ్యక్తమై నెలకొన్న తేజమా" అని అంటూ గొప్ప వ్యక్తీకరణ చేసింది ఆణ్డాళ్. క్రితం పాసురమ్‌లో "విరోధులకు వేడి పుట్టించే వాడా" అని అన్న తరువాత ఇక్కడ "విరోధులు నీ ముందు బలహీనులై నీ వాకిట్లోకి గత్యంతరం లేక వచ్చి నీ పాదాలపై పడ్డట్లుగా" అని అంటోంది ఆణ్డాళ్. గత్యంతరం లేక పాదాలపై పడడం "తిరువడిగళే సరణం" అంటే 'ఉన్నతమైన పాదాలే శరణం' అన్న భావన. 'అన్యథా శరణం నాస్తి' అన్నది అవగతం అయ్యాక భక్తులు స్తుతిస్తూ, కీర్తిస్తూ దైవం దగ్గఱికి వెళతారు. ఆ స్థితినే "స్తుతిస్తూ, కీర్తిస్తూ వచ్చాం" అని ఆణ్డాళ్ అంటోంది.
ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్
తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి
రోచిష్మాన్
9444012279
Updated Date - 2023-01-05T06:55:26+05:30 IST