Tiruppavai: ఆ మువ్వకు సన్నని పగులు, ఆ పగులులోపల...
ABN, First Publish Date - 2023-01-05T22:00:00+05:30
చాలమంది రాజులు కృష్ణుడివల్ల తమ గౌరవాన్ని పోగొట్టుకుని కృష్ణుడికి లొంగిపోయి... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన: రోచిష్మాన్
ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం ఇరవైరెండోరోజు; తిరుప్‌పావై ఇరవైరెండో పాసురమ్ రోజు.
పాసురమ్ 22
కృష్ణుడితో మేం వచ్చాం కనుక కళ్లు తెఱిచి మమ్మల్ని చూడు అంటూ ఆణ్డాళ్ ఐరవైరెండో పాసురమ్‌తో కొనసాగుతోంది; ఇదిగో ఇలా...
మూలం-
అఙ్గణ్మా ఞాలత్తరసర్ అబిమాన
బఙ్గమాయ్ వన్దునిన్ పళ్ళిక్కట్టిఱ్ కీళ్షే
సఙ్గమ్ ఇరుప్పార్‌పోల్ వన్దు తలైప్‌పెయ్దోమ్;
కిఙ్గిణి వాయ్‌చ్ చెయ్ద తామరై పూప్పోల
సెఙ్‌కణ్ సిఱుచ్చిఱిదే ఎమ్మేల్ విళ్షియావో?
తిఙ్గళుమ్, ఆదిత్‌తియనుమ్ ఎళ్షున్దాఱ్‌పోల్
అఙ్‌కణ్ ఇరణ్డుఙ్గొణ్డెఙ్గళ్‌మేల్ నోక్కుదియేల్
ఎఙ్గళ్‌మేల్ సాబమ్ ఇళ్షిన్దేలోరెమ్‌పావాయ్!
తెలుగులో-
సుందర, సువిశాల రాజ్యాల రాజులు గౌరవం
భంగమైనాక వచ్చి నీ మంచం కింద
గుమిగూడినట్టుగా వచ్చి చేరాం;
తెఱుచుకున్న మువ్వనోరులాంటి, కమలాల్లాంటి నీ
ఎఱ్ఱని కళ్లతో కొంచెం కొంచెం మమ్మల్ని చూడవా?
జాబిల్లీ, సూర్యుడూ లేచినట్టుగా
సుందరమైన రెండు కళ్లతోనూ మమ్మల్ని చూస్తే
మాకు తగిలిన శాపాలు లేకుండాపోతాయి; ఓలాల నా చెలీ!
అవగాహన-
మేం నీ దగ్గఱికి రావడం, సుందర, సువిశాల రాజ్యాల రాజులు తమ గౌరవం భంగమైనాక నీ మంచం కింద గుమిగూడినట్టుగా వచ్చి చేరడం లాంటిదని ఆణ్డాళ్ కృష్ణుడితో చెబుతోంది. చాలమంది రాజులు కృష్ణుడివల్ల తమ గౌరవాన్ని పోగొట్టుకుని కృష్ణుడికి లొంగిపోయి ఆయన మంచం కింద గుమిగూడారట. గొప్ప గొప్ప రాజులు సైతం తాము అన్న భావం తొలగిపోయాక లేదా తమపై తమకు ఉన్న అభిమానం తొలగిపోయాక దైవం వద్దకు చేరుకున్నారు అన్నదాన్ని చెప్పకుండానే చెబుతోంది ఆణ్డాళ్. సార్వభౌములైనవాళ్ల చేత స్తుతించబడ్డ కృష్ణుడికి సార్వభౌమస్తుతః అనే నామం ఉంది.
మువ్వను గమనిస్తే ఆ మువ్వకు సన్నని పగులు, ఆ పగులులోపల ఒక పూస ఉండడం తెలుస్తుంది. ఆ పగులును తెఱుచుకున్న మువ్వనోరు అని సూచిస్తూ "తెఱుచుకున్న మువ్వనోరులాంటి..." అని అంటోంది ఆణ్డాళ్. కంటిని కొద్దిగా తెఱిస్తే ఆ తెఱవడం మువ్వనోరులా ఉంటుంది. అలా మువ్వనోరులా కన్ను తెఱిచి చూడమని చెప్పడం ఎంతో గొప్పగా ఉంది. కృష్ణుడు చూస్తే శాపాలు లేకుండా పోతాయని అంటోంది ఆణ్డాళ్. ఆ చూడడం "జాబిల్లీ, సూర్యుడూ లేచినట్టుగా" చూడాలట. ఎంతో గొప్పగా చెప్పింది ఆణ్డాళ్.
ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్
తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి
రోచిష్మాన్
9444012279
Updated Date - 2023-01-06T06:38:51+05:30 IST