ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NTR : యుగపురుషుడు

ABN, First Publish Date - 2023-05-28T04:25:28+05:30

ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ వెళ్లలేని ప్రాంతాలకు సైతం ఆయన పాటలు, మాటలు వెళ్లేలా చేసి, ఆయన విజయానికి ఇతోధికంగా దోహదం చేసిన సినీ డైరెక్టర్‌ కె.బాపయ్య. చిన్నప్పటి నుంచి

ఎన్టీఆర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ వెళ్లలేని ప్రాంతాలకు సైతం ఆయన పాటలు, మాటలు వెళ్లేలా చేసి, ఆయన విజయానికి ఇతోధికంగా దోహదం చేసిన సినీ డైరెక్టర్‌ కె.బాపయ్య. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌ను చూస్తూ ఎదిగిన బాపయ్య... ఆ తరువాత ఆయనతో 6 సూపర్‌ హిట్లు తీశారు. ఎన్టీఆర్‌ ఎన్నికల విజయంలో తన వంతు పాత్ర పోషించారు. ఎన్టీఆర్‌తో తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘ఎన్టీఆర్‌ హీరోగా సక్సెస్‌ సాధించిన ‘పాతాళ భైరవి’ సినిమా విడుదలయ్యే సమయానికి నేను కాలేజీ స్టూడెంట్‌గా ఉన్నాను. అప్పటి నుంచే నేను ఆయనకు అభిమానిని. దానికి తోడు రాయలసీమకు కరువు వచ్చినప్పుడు ఆయన జోలె పట్టి ఆంధ్ర ప్రాంతమంతటా తిరిగి విరాళాలు సేకరించారు. ఆ మొత్తాన్ని మద్రాస్‌లోని వాణిమహల్‌లో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాజమన్నార్‌ చేతుల మీదుగా పేదలకు పంచిపెట్టారు. అప్పటి నుంచి ఆ అభిమానం మరింత పెరిగింది. నా చదువు అయిపోయి, సినీ రంగంలోకి వచ్చాక... ఎన్టీఆర్‌తో సినిమా తీద్దామంటూ నా దగ్గరకు ఒక నిర్మాత వచ్చారు. ‘సరే, మాట్లాడమన్నా’ను. ఆ నిర్మాత ఎన్టీఆర్‌ను కలిసిన రోజు రామారావుగారు తన సొంతచిత్రం ‘తాతమ్మ కల’ తీస్తున్నారు. వేకువజామున మూడు గంటల వరకూ షూటింగ్‌ జరిగిందట. అందువల్ల మరుసటి రోజు ఉదయం 9 గంటలకు రమ్మంటే వెళ్లాను. ‘‘ఓకే బ్రదర్‌, చేద్దాం’’ అన్నారు. అయితే ‘‘మనం విజయా ఫిలింస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా కాదండి, మరో ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా చేద్దాం’’ అన్నాను. ‘‘వారితో మనం చేయడం లేదు కదా’’ అన్నారాయన. దాంతో నేను ‘‘మీరు ప్రజా మనిషి. ఫలానా వారితో చేయకూడదు, ఫలానా వారితోనే చేయాలని నియంత్రించుకోకూడదు. మీరు అందరికీ కావాల్సిన వారు. డిస్ట్రిబ్యూటర్‌ శివరామకృష్ణయ్య గారు వస్తారు. మీకెలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు’’ అని సర్ది చెప్పాను. అందుకాయన ‘‘ఓకే బ్రదర్‌’’ అన్నారు. నాకు చిన్నప్పటి నుంచే మా పెదనాన్న కె.ఎస్‌.ప్రకాశరావుగారి ద్వారా ఎన్టీఆర్‌తో పరిచయం ఉంది. ‘రాముడు భీముడు’ తదితర సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా చేశాను కాబట్టి పరిచయంతో పాటు కొద్దిపాటి చనువూ ఉంది. అందువల్లే ఆయనకు నచ్చచెప్పగలిగాను.

ఆయనకు భయం... నాకు పూర్తి విశ్వాసం

ఆ తరువాత ‘లైఫ్‌ మ్యాగజైన్‌’లో ఓ సంఘటన గురించి కథనం వచ్చింది. దాన్ని రామారావుగారికి చెప్పాను. అది విని ‘‘బావుంది బ్రదర్‌. మేక్‌ ఇట్‌ ఎ స్టోరీ’’ అన్నారు. దాంతో భమిడిపాటి రాధాకృష్ణ గారి ద్వారా మంచి కథ సిద్ధం చేసుకున్నాం. అదే ‘ఎదురులేని మనిషి’. నిర్మాత సి.అశ్వనీదత్‌ గారు. ‘వైజయంతి మూవీస్‌’పై తీశాం. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే ఇండస్ట్రీలో విమర్శలు మొదలయ్యాయి. ‘‘ఎన్టీఆర్‌కు ఆ డ్రెస్సులేంటి? ఆ డ్యాన్సులేంటి?’’ అంటూ కామెంట్లు వచ్చాయి. అప్పటికి కొన్నాళ్ళుగా రామారావు గారు ‘బడి పంతులు’, ‘తాతమ్మ కథ’ లాంటి చిత్రాలలో పెద్దరికం వేషాలు, ముసలి వేషాలు వేస్తున్నారు. అలాంటి వ్యక్తితో స్టెప్పులు, టీషర్టులు వేయించడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. టీషర్టు టక్‌చేసి ఇంటికెళ్తే రామారావు గారి సతీమణే ‘‘ఈ వయసులో ఈ డ్రెస్సేంటి? ఏమన్నా బావుంటుందా?’’ అని అడిగారట. అందుకు రామారావు గారు ‘‘ఈ సినిమా యంగ్‌స్టర్స్‌ చేస్తున్నారు. లెట్‌ దెం డూ యిట్‌’’ అని సమాధానం ఇచ్చారట. ఆ పిక్చర్‌ను ప్రేక్షకులు బాగా రిసీవ్‌ చేసుకుంటే 60 ఏళ్ల వరకూ ముసలి వేషాలు వేయనని కూడా చెప్పేశారట. ఆ సమయంలో డ్యాన్సులంటే ఒక్క అక్కినేని నాగేశ్వరరావు గారే. అందువల్ల రామారావు గారికి కూడా ఆ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనన్న భయం కొద్దిగా ఉండేది. నాకు మాత్రం ఆ సినిమాపై పూర్తి విశ్వాసం ఉంది. ఆ పిక్చర్‌ ప్రివ్యూ చూసిన వారు కూడా ‘’ఇది ఒక్క రోజైనా ఆడుతుందా? రామారావుగారి అభిమానులు స్క్రీన్‌ చించేయడం ఖాయం’’ అని విమర్శలు కురిపించారు. అదంతా చూసి కె.ఎస్‌.ప్రకాశరావు గారు ‘’ఒరేయ్‌... పిక్చర్‌ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రొజెక్షన్స్‌ ఆపెయ్‌’’ అన్నారు. ప్రొడ్యూసర్‌ రామానాయుడు గారు కూడా ఇక ముందైనా ఇలాంటి రిస్క్‌ తీసుకోవద్దు’ అని సలహా ఇచ్చారు. దాంతో నాకూ భయం మొదలైంది. వాటన్నిటినీ దాటుకొని 1975 డిసెంబరు 12వ తేదీన ఆ సినిమాను విడుదల చేశాం. అశ్వనీదత్‌ గారు మౌనంగా విజయవాడలో కూర్చుండిపోయారు. ఆ సినిమా రష్‌ చూద్దామని నా అసిస్టెంట్లు ముందురోజే నెల్లూరు వెళ్లారు. ఉదయం 5 గంటలకే షో మొదలైంది. పూర్తి కావచ్చేసరికి సినిమా బావుందని టాక్‌. తరువాతి ఆటకి జనాలు యఽథావిధిగా వచ్చారు. అప్పుడు మొదలైంది అసలైన టాక్‌. పిక్చర్‌ సూపర్‌ హిట్‌. కలెక్షన్లు బాగా వచ్చాయి. ఆ విషయాన్ని నా అసిస్టెంట్లు ఫోన్‌ చేసి చెప్పేవరకు నా మనసు మనసులో లేదు. ఈ విషయాన్ని రామారావుగారే స్వయంగా సినిమా 100వ రోజు చెప్పారు. ఆ తరువాత ఆయన ట్రెండే మారిపోయింది. కుర్రహీరోలను మించిన పాత్రలు చేశారు. ఎవ్వరికీ రానన్ని కలెక్షన్లు ఆయన పిక్చర్స్‌కు వచ్చిపడ్డాయి.

నేపాల్‌లో తొలి తెలుగు సినిమా..

రామారావు గారితో నా తొలిచిత్రం విడుదలైన కొన్నాళ్లకే ఆయనతో ‘యుగ పురుషుడు’ తీశాను. అదీ హిట్టే. ఆయనతో తీసిన నా మూడో చిత్రం ‘సాహసవంతుడు’. దాని కోసం నేపాల్‌ వెళ్లాం. అక్కడ తీసిన తొలి తెలుగు సినిమా అదే. మంచు కొండల్లో షూటింగ్‌. అక్కడ ‘మౌంటెన్‌ ఫ్లయిట్స్‌’ అని ఉన్నాయి. అందులో ఒక ఫ్లయిట్‌లో రామారావు గారిని కూర్చోబెట్టుకుని వెళ్లాం. హిమాలయాల్లో ‘కాంచన గంగ’ వరకు తీసుకెళ్లాం. లోపల కెమెరా పెట్టుకుని షూట్‌ చేస్తూనే వెళ్లాం. కాంచన గంగ వద్దకు వెళ్లే సరికి రామారావుగారు సీన్‌ వదిలేసి, రెండు చేతులెత్తి నమస్కరించారు. మేమందరం అలా చూస్తుండిపోయాం. ఇలాంటి అనుభవాలెన్నో రామారావుగారితో ఉన్నాయి. ‘యుగ పురుషుడు’, ‘సాహసవంతుడు’ వెంటవెంటనే రిలీజయ్యాయి. ఆ తరువాత ఒకరోజు రామారావుగారు పిలిపిస్తే వెళ్లాను. ‘‘బ్రదర్‌... మనకు ఒక పిక్చర్‌ చేయాలి’’ అన్నారు. కానీ అప్పటికి నేను హిందీలో బాగా బిజీగా ఉండడంతో ‘’సార్‌! డేట్స్‌ ఖాళీగా లేవు. ఇబ్బంది అవుతుంది’’ అని చెప్పాను. అందుకాయన ‘’మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే చేద్దాం బ్రదర్‌’’ అన్నారు. అలా వారి బ్యానర్‌పై తీసిన పిక్చర్‌ ‘అగ్గి రవ్వ’. ఆ తరువాత ఆయనతోనే ‘కలియుగ రాముడు’కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేనూ బాంబేలో బిజీ అయిపోయాను. ఒక పిక్చర్‌ షూటింగ్‌లో రామారావు గారు మోటార్‌బైక్‌పై నుంచి పడిపోవడంతో కుడి చేతికి బాగా దెబ్బతగిలిందని తెలిసింది. పరామర్శించేందుకు మద్రాస్‌లోని ఆయన ఇంటికి వెళ్లాను. నన్ను చూడగానే ‘’రండి బాపయ్యగారూ’’ అని పలుకరించారు. అప్పుడు మాటల మధ్యలో హఠాత్తుగా ‘‘జనం ఇంతకాలం మనల్ని పోషించారు, అభిమానించారు, ఆదరించారు. ఇకపై వారి కోసం ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అంతకు మించిన సేవ ఏముంది సర్‌! తప్పనిసరిగా చేయండి’’ అన్నాను. అప్పటికే ఆయన సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు.

ఎన్టీఆర్‌ వెళ్లలేని చోట్లకి ‘నా దేశం’..

తరువాత కాలంలో ముగ్గురు ప్రొడ్యూసర్స్‌కు పిక్చర్‌ తీసిపెడతానని రామారావుగారు మాటిచ్చారు. ఆయన మాట ఇస్తే దానిని నెరవేర్చాల్సిందే. అయితే ఈలోపే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడం, రాజకీయాల్లో బిజీ అయిపోవడం జరిగిపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఊపిరి సలపని పని ఒత్తిడి. అయినా ‘20 రోజులు డేట్స్‌ ఇస్తాను. ఈ లోపే పిక్చర్‌ పూర్తి చేసుకోండి’ అన్నారట. దాంతో ఆ ముగ్గురు ప్రొడ్యూసర్స్‌ వేరే డైరెక్టర్స్‌ వద్దకు వెళ్లారు. 20 రోజుల్లో ఎన్టీఆర్‌తో పిక్చర్‌ తీయాలనడంతో వారు కుదరదన్నారు. దాంతో నా దగ్గరకు వచ్చారు. ‘ఇదేదో ఛాలెంజింగ్‌గా ఉందే’ అనుకుంటూ నేను ‘‘ఓకే’’ అన్నాను. వెంటనే పని మొదలుపెట్టాను. అమితాబ్‌ బచ్చన్‌ తీసిన ఓ పిక్చర్‌ క్యాసెట్‌ ఇచ్చి చూడమన్నాను. ఆ ప్రొడ్యూసర్స్‌ చూసి బావుందన్నారు. వెంటనే బాంబే వెళ్లి రైట్స్‌కు సంబంధించిన లావాదేవీలు పూర్తి చేయించాను. అప్పట్లో పరుచూరి బ్రదర్స్‌ చాలా స్పీడ్‌గా, ఎలాంటి సబ్జెక్ట్‌ అయినా అవలీలగా రాయగలిగిన గొప్ప ప్రతిభావంతులు. వారు ఒకవైపు స్టోరీ రెడీ చేస్తుండగా, మరోవైపు వేటూరి సుందరరామమూర్తిగారితో పాటలు రాయించి, మ్యూజిక్‌ కంపోజింగ్‌ కూడా పూర్తి చేయించాను. ఆ పాటలు రామారావుగారికి వినిపించాం. ‘‘సబ్జెక్ట్‌ ఏంటి?’’ అని అడిగారు. అప్పుడు పిక్చర్‌ చూపించాం. అది చూసి ఆయన కూడా ఓకే చెప్పారు. అదే ‘నా దేశం’ సినిమా. మరుసటి రోజే షూటింగ్‌ మొదలుపెట్టాం. కేవలం 19 రోజుల్లోనే డబ్బింగ్‌తో సహా ఆయన పోర్షన్‌ పూర్తి చేశాం. మొత్తం షూటింగ్‌ హైదరాబాద్‌, ఊటీల్లో చేశాం. రామారావుగారి డబ్బింగ్‌ ఆయన స్టూడియోలోనే చెప్పించాం. ఆయన చిన్నపిల్లాడిలా ఉన్నప్పటి సీన్‌ మద్రాస్‌లో తీశాం. మొత్తం పిక్చర్‌ 22 రోజుల్లో చేసేశాం. అప్పట్లో అది పెద్ద సంచలనం. అంత తక్కువ వ్యవధిలో సినిమా తీయడమంటే మొత్తం యూనిట్‌ థ్రిల్‌గా ఫీలైంది. ఆ ముగ్గురు ప్రొడ్యూసర్స్‌లో ఒకరు కొత్త. అందుకే ఆయనకు ముందుగానే రూ.5 లక్షలు ప్రాఫిట్‌ ఇచ్చి మిగిలిన ఇద్దరే పిక్చర్‌ తీశారు. ఆ ఇద్దరు ప్రొడ్యూసర్లు కె.దేవీ వరప్రసాద్‌, ఎస్‌.వెంకటరత్నం. ఆ సినిమా రిలీజ్‌ నాటికి ఎన్నికల తేదీ ప్రకటన వచ్చేసింది. దాంతో ఆయన రేయింబవళ్లు ప్రచారానికి పరుగులు పెట్టారు. కానీ తక్కువ వ్యవధిలో అన్ని ప్రాంతాలకు వెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. దాంతో ‘నా దేశం’లోని డైలాగులు, పాటలు క్యాసెట్లలోకి ఎక్కించి ఊరూవాడా ప్రచారం చేశారు. ఆ డైలాగులు బాగా పేలాయి. జనాలకు బాగా ఎక్కాయి. ఆయన పార్టీ పెట్టి, ఎన్నికలకు వెళ్లడం ఖాయమనుకున్న తరువాతే ఈ పిక్చర్‌ తీశాం. అందుకే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పాటలు, డైలాగులు కూడా పెట్టాం. అది బాగా పని చేసింది. ఎన్నికలయ్యాక ఒకరోజు రామారావుగారు స్వయంగా బాంబేలోని మా ఇంటికి ఫోన్‌ చేశారు. నా సతీమణి భారతి ఫోన్‌ తీసింది. ఆ సమయంలో నేను ఎక్కడో షూటింగ్‌లో ఉన్నాను. ‘‘అమ్మా! ఈ పిక్చర్‌ వల్ల నేను కొన్ని ఊళ్లకు వెళ్లకుండానే పబ్లిసిటీ జరిగింది. మేం చాలా సంతోషంగా ఉన్నాం. బ్రదర్‌కి చెప్పండి’’ అన్నారట. ఎన్నికల ఫలితాల రోజు సాయంత్రం నేను బాంబే నుంచి మద్రాస్‌ వచ్చి, రామానాయుడు గారి ఆఫీసుకు వెళ్లాను. అప్పుడే ఆయన రామారావుగారితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. నన్ను చూడగానే ఫోన్‌ నా చేతికిచ్చారు. నేనూ కంగ్రాట్స్‌ చెప్పాను. ‘నా దేశం’ సినిమా వల్ల కలిగిన ప్రయోజనాన్ని ఆయన ప్రస్తావించారు. చాలా సంతోషం కలిగింది. చరిత్ర సృష్టించిన వ్యక్తి రామారావుగారు. ఆ చరిత్రలో మన పాత్ర కూడా ఉండడం కన్నా మనకు కావాల్సింది ఏముంది?

ఆలింగనం చేసుకున్న వేళ!

ఒకసారి త్రివిక్రమరావు గారి హిందీ చిత్రం ‘వక్త్‌ కి ఆవాజ్‌’ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వెళ్లాను. షెడ్యూల్‌ పూర్తి కాగానే ఉదయాన్నే రామారావుగారి ఆఫీసుకు వెళ్లాను. చాలామంది పొలిటీషియన్స్‌ హాల్లో కూర్చునివున్నారు. నేను నేరుగా రామారావుగారి గదిలోకి వెళ్లాను. నన్ను చూడగానే రామారావు గారు పైకి లేచి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఒక్కసారి నా కళ్లలోకి సూటిగా చూస్తూ నవ్వారు. నాకేమీ అర్థం కాలేదు. ‘అంత పెద్ద మనిషి నన్ను ఆలింగనం చేసుకుని నవ్వుతున్నారేంటా?’ అని అయోమయంలో పడిపోయా. అది అర్థం చేసుకున్నారేమో... ‘‘ఇది హిందీ పాతాళభైరవి కోసం..’’ అంటూ తనదైన తరహాలో నవ్వేశారు. అప్పటికి హిందీ ‘పాతాళభైరవి’ రిలీజై 31 వారాలు అయింది. దేశవ్యాప్తంగా బాగా ఆడుతోంది. అందులో హీరోహీరోయిన్లు జితేంద్ర, జయప్రద. హీరో కృష్ణ నిర్మాత. హిందీ ‘పాతాళభైరవి’ హిట్టయితే రామారావుగారు ఎందుకు నన్ను ప్రత్యేకంగా అభినందించారన్న విషయం ఇక్కడ చెప్పక తప్పదు. ‘ఎదురులేని మనిషి’ పిక్చర్‌ షూటింగ్‌ ఖాళీ సమయంలో... ‘పాతాళభైరవి’ సినిమా కోసం తను పడిన కష్టాలను రామారావుగారు చెప్పేవారు. ఆ పిక్చర్‌ తనకు రావడానికి గల కారణాలు, షూటింగ్‌ సమయంలో తను చేసిన సాహసాలు కూడా వివరించేవారు. గోడపై నుంచి దూకడం భయంగా ఉన్నా, సీన్‌ బాగా రావాలని కళ్లు మూసుకుని దూకేసేవాణ్ణని చెప్పారు. ఆ సినిమాకు అంతగా కష్టపడడం వల్లనే తాను హీరోగా నిలదొక్కుకోగలిగానని, లేకుంటే ద్వితీయశ్రేణి నటుడిగానే ఉండాల్సి వచ్చేదని వివరించారు. ’‘అంతగా కష్టపడడం వల్లనే పైకి వచ్చాం బ్రదర్‌. మీరు యంగస్టర్స్‌ కాబట్టి బాగా కష్టపడి వృద్ధిలోకి రండి’’ అని చెప్పేవారు. అలాంటి ‘పాతాళభైరవి’ని నేను హిందీలో తీసి హిట్‌ కొట్టానన్న అభిమానంతో ఆయన నన్ను కౌగిలించుకుని అభినందించారు. తనను నిలబెట్టిన ఆ పిక్చర్‌ అంటే ఆయనకు అంత అభిమానం.

‘‘రామారావుగారు వేకువజామున 3 గంటలకే నిద్ర లేచేవారు. కసరత్తులు చేసి, స్నానపానాదాలు, పూజ కానిచ్చేసి సూర్యోదయానికి ముందే ఆహారం తీసుకునేవారు. తరువాత 5 గంటలకల్లా మేకప్‌ కోసం కూర్చొనేవారు. అది అయిపోగానే తన ఆఫీసు రూపంలో ప్రొడ్యూసర్స్‌తో మాట్లాడేవారు. స్టూడియో నుంచి ఫోన్‌ రాగానే బయలుదేరేవారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బ్రేక్‌ ఇవ్వగానే లంచ్‌ కోసం ఇంటికెళ్లేవారు. మళ్లీ రెండు గంటలకు తిరిగొచ్చేవారు. మధ్యాహ్నం జీడిపప్పు లాంటివి తీసుకునేవారనుకుంటా. మళ్లీ రాత్రి 8 గంటల్లోపే భోజనం కానిచ్చేసేవారు. నేను ఉదయం 5 గంటలకు ఆయన ఇంటికి వెళ్తే అప్పటికే ఆయన మేకప్‌ వేయించుకుంటూ ఉండేవారు. నన్ను చూడగానే ‘’రండి బాపయ్య గారూ, ఏంటి బ్రదర్‌ కబుర్లు?’’ అనేవారు. రామారావుగారు చాలా స్నేహశీలి. నిర్మాతలు, దర్శకులను ఎంతో గౌరవించేవారు. ఎంత చిన్నవారైనా సరే, గౌరవంగా సంబోధించేవారు. నిజంగానే ఆయన ‘యుగపురుషుడు’.’’

డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై

నవ్య ‘దృశ్యం పేజీ’లో ఆసక్తికర కథనాల కోసం.. ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. లేదా ఈ కింది యూఆర్‌ఎల్‌

https://qr.page/g/4J60eMeRbQg లో చదవండి.

Updated Date - 2023-05-28T04:26:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising