Viral పదేళ్ల లోపు పిల్లలపై నిషేధం.. ఓ రెస్టారెంట్ యాజమాన్యం సంచలన ప్రకటన.. కారణమేంటని అడిగితే..
ABN, First Publish Date - 2023-02-13T20:00:40+05:30
మా రెస్టారెంట్‌లోకి పిల్లల్ని అనుమతించబోమంటూ అమెరికాకు చెందని ఓ ఇటాలియన్ రెస్టారెంట్ సంచలన ప్రకటన చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘మాకు పిల్లలంటే చాలా చాలా ఇష్టం.. నిజం నమ్మండి.. కానీ ఇటీవల కాలంలో రెస్టారెంట్‌కు వస్తున్న పిల్లలు మాకు తలకు మించిన భారంగా మారారు. పిల్లల అల్లరి, వారు కూర్చుకునేందుకు అనువైన ఎత్తు కుర్చీలు లేకపోవడం, వారు వెళ్లిపోయాక రెస్టారెంట్‌ను శుభ్రం చేయాల్సి రావడం.. పిల్లలు అటూ ఇటూ పరిగెడుతుంటే ఎక్కడ ఏ ప్రమాదంలో పడతారోనన్న టెన్షన్..ఇలాంటి వన్నీ చూశాక మా రెస్టారెంట్‌లోకి పిల్లల్ని అనుమతించొద్దనుకున్నాం. పరిస్థితిని మళ్లీ మా కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు సిద్ధమయ్యాం...’’ అంటూ అమెరికాలోని(USA) ఓ రెస్టారెంట్ ఇచ్చిన ప్రకటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మార్చి 8 నుంచి పదేళ్లలోపు పిల్లల్ని అనుమతించబోమంటూ(Ban on Entry of Children) న్యూజెర్సీలోని(New Jersey) నెట్టీస్ హౌస్(Nettie's House) అనే ఇటాలియన్ రెస్టారెంట్ తాజాగా తేల్చి చెప్పింది. ఈ మేరకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాల్లో ఓ సవివరమైన ప్రకటన విడుదల చేసింది. దీంతో.. క్షణాల్లో ఈ ప్రకటన వైరల్ అయిపోయింది. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అధికసంఖ్యాకులు ఆ రెస్టారెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పిల్లలున్న కుటుంబాలకు ఈ నిషేధం చెప్ప పెట్టులాంటిదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే.. పిల్లల అల్లరి భరించలేని కొంతమంది మాత్రం రెస్టారెంట్ యాజమాన్యానికి మద్దతుగా నిలిచారు. ‘‘నేనెప్పుడూ ఆ రెస్టారెంట్‌కు వెళ్లలేదు. కానీ.. అక్కడ ఇకపై పిల్లల రణగొణధ్వని ఉండదని తెలిశాక..కచ్చితంగా అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్నా’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇప్పుడు నాకు నెట్టీస్ రెస్టారెంట్‌పై అభిమానం మరింత పెరిగిపోయింది అంటూ మరో నెటిజన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరి మీరేమంటారు..? ఆ రెస్టారెంట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా..?
Updated Date - 2023-02-13T20:00:41+05:30 IST