NRI: ఖతర్ తెలుగు ఇంజినీర్స్ ఫోరం...ఎడారిలో తెలుగు ఇంజినీర్లకు ఒక ఆశాదీపం
ABN, First Publish Date - 2023-10-16T15:00:28+05:30
ఎడారి నాట తెలుగు ఇంజినీర్లకు మరింత గుర్తింపు రావాలనే లక్ష్యంతో ఖతర్ తెలుగు ఇంజినీర్స్ ఫోరం అవిర్భవించింది. భారతీయ ఎంబసీ అధ్వర్యంలోని ఐ.బి.పి.సి మార్గదర్శకన తెలుగు ఇంజినీర్స్ ఫోరం పని చేస్తుంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఒక ప్రాంతం లేదా దేశం పురోగమనం చెందడానికి ఇంజినీర్ల పాత్ర కీలకం. ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టే అభివృద్ధి పనులు నాణ్యతతో సుదీర్ఘ కాలం మనుగడ సాధించడంలో ఇంజినీర్ల పాత్ర అమోఘం.
1950లో దోహాలో కేవలం మూడు మట్టి భవనాలు ఉండగా దుఖాన్‌లో పూరి గుడిసెలు కల్గిన ఖతర్ దేశం నేడు 300 మీటర్ల ఎత్తయిన టార్చ్ హోటల్ ఆకాశహర్మ్యంతో చూడముచ్చటగా ఉందంటే పాలకుల ధృడసంకల్పానికి తోడుగా అంకితభావం కల్గిన ఇంజినీర్లు కారణమని చెప్పకతప్పదు.
దుఖాన్ ప్రాంతంలో పూరి గుడిసెలలలో స్థానిక ఖతరీలు నివసిస్తున్న కాలంలో ఖతర్ పెట్రోలియం కంపెనీ క్యాంపులోని విలాసవంతమైన గదులలో పాశ్చత్య దేశస్థులతో పాటు భారతీయ ఇంజినీర్లు కూడ నివసించే వారు. ఆ రకంగా మొదట అమెరికన్ల వెంట వచ్చిన ఇంజినీర్లు 1970 దశకంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. నూనె దీపాలు కూడా సరిగ్గా లేని కాలంలో విద్యుత్ సరఫరా చేసిన వీధికి అల్ కార్బా అని పేరు పెట్టగా అల్ కార్బా పురోగతిలో కూడా భారతీయ ఇంజినీర్లది ఒక విశిష్ఠ స్థానం. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయ ఇంజినీర్లు అనతికాలంలో రాణించారు. 1980 దశకంలో దోహా నగరంలో జనరల్ పోస్టాఫీసు, షెరాటన్ హోటల్ మొదలగు బహుళ అంతస్తు భవనాల నిర్మాణం మొదలయ్యే నాటికి దోహా మున్సిపాల్టీలో కీలక వ్యవహారాలు చూసింది ఒక తెలుగు ఇంజినీరే! అదే విధంగా అటు రెండు దశాబ్దాల నిరంతర శ్రమ అనంతరం ఉత్పత్తి ప్రారంభించిన సహాజ గ్యాస్ పరిశ్రమలో కూడా అనేక మంది తెలుగు ఇంజినీర్లు కృషి చేసారు. ఆ తర్వాత మొదలయిన డిజిటల్ కాలంలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు పెట్టింది పేరు. ఖతర్ మెట్రో గానీ వరల్డ్ కప్ స్టేడియంల నిర్మాణంలో మన తెలుగువారు తమ ప్రతిభను కనబర్చారు.
ఈ రకమైన ఘనమైన నేపథ్యం కల్గిన ఖతర్‌లోని భారతీయ ఇంజినీర్లలో తెలుగు ఇంజినీర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఎడారి నాట తెలుగు ఇంజినీర్లకు మరింత గుర్తింపు రావాలనే లక్ష్యంతో ఖతర్ తెలుగు ఇంజినీర్స్ ఫోరం అవిర్భవించింది. భారతీయ ఎంబసీ అధ్వర్యంలోని ఐ.బి.పి.సి మార్గదర్శకన తెలుగు ఇంజినీర్స్ ఫోరం పని చేస్తుంది.
ప్రాంతీయ లేదా కుల,మతాలకు అతీతలకు తెలుగు ఏకైక వారధిగా ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ ఇంజినీర్లందర్నీ ఏకతాటిపై తీసుకోరావడానికి పని చేస్తున్న ఈ సంఘానికి అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన నవాజ్ అలీ ఖాన్, ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జి.కె. దొర వ్యవహారిస్తున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, సి.యస్ ప్రధాన విభాగాలుగా ఇంజినీరింగ్‌లోని అన్ని రంగాలకు చెందిన తెలుగు ప్రవాసీయులు తమ సంఘంలో ఉన్నారని నవాజ్ అలీ ఖాన్, దొర వెల్లడించారు.
వివిధ రంగాలలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మారుతున్న అధునిక కాలానికి అనుగుణంగా ఇంజినీర్లలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఆయా రంగాల ప్రముఖులతో చర్చ గోష్ఠులు, సమావేశాలను నిర్వహిస్తున్నట్లుగా వారు తెలిపారు. దీని ద్వారా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడం సులభమవుతుందని వారన్నారు.
స్వదేశంలో ఇంజినీరింగ్ లైసెన్సుల రిజిస్ట్రేషన్, రెన్యువల్, ఇతరత్రా ఆంశాలకు సంబంధించి కూడా తెలుగు ఇంజినీర్స్ ఫోరం సభ్యులకు తగు సూచనలను ఇస్తూ సహాకరిస్తుందని నవాజ్ అలీ ఖాన్, దొర అన్నారు.
ఖతర్‌లోని ఇంజినీరింగ్ పట్టభద్రులతో సహా ఇంజనీర్లందరు తెలుగు ఇంజినీర్స్ ఫోరంను 974-33510351 లేదా 97466964420 నెంబర్లపై సంప్రదించవచ్చు.
Updated Date - 2023-10-16T15:02:07+05:30 IST