AI Technology: యమ క్రేజ్‌గా మారిన ఏఐ ట్రెండ్.. నెట్టింట సందడి చేస్తున్న వినూత్న ఫొటోలు..
ABN , First Publish Date - 2023-12-06T19:10:37+05:30
టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పటికి, ఇప్పటికి పోల్చుకుంటే అన్ని రంగాల్లోనూ విపరీతమైన మార్పులొచ్చాయి. ఇక ఫొటోలు, వీడియోల విషయంలో అయితే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పటికి, ఇప్పటికి పోల్చుకుంటే అన్ని రంగాల్లోనూ విపరీతమైన మార్పులొచ్చాయి. ఇక ఫొటోలు, వీడియోల విషయంలో అయితే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో మొదలైన ఈ టెక్నాలజీ రాను రాను కలర్ ఫొటోలు, గ్రాఫిక్స్ ఫొటోలు వీడియోలు.. ఇలా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ రంగంలో ఇటీవల వచ్చిన ఏఐ టెక్నాలజీ పెను మార్పులను తీసుకొచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మనసులో ఊహించుకున్న ప్రపంచాన్ని కళ్ల ముందుకు తీసుకొస్తోంది. ఇక మనుషుల మొఖాలను నమ్మలేని విధంగా మార్ఫింగ్ చేసేస్తోంది. ఇటీవల పలువురు సెలబ్రిటీల మొఖాలను మార్చి ఫొటోలు, వీడియోలు రూపొందించడం చూస్తూనే ఉన్నాం. అలాగే పలువురు చిన్న పిల్లల ఫొటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.
నిజంగా ఇలాంటి ప్రదేశాలు, వ్యక్తులు ఉన్నారేమో అన్నంత భ్రమ కలిగిస్తుంటాయి. ఇక చిన్నపిల్లలు, మహిళలు, యువతుల ఫొటోలకైతే లెక్కేలేదు. చేపల మార్కెట్‌కు వెళ్లిన బుడ్డోడు.. వస్తూ వస్తూ రెండు చేతులతో ఎండు చేపలు పట్టుకొస్తే ఎలా ఉంటుంది. అలాగే టీమిండియా క్రికెటర్లు చిన్నపిల్లల్లా మారితే ఇంకెలా ఉంటుంది, అలాగే చిన్న పిల్లలు వ్యోమగాములుగా మారి చంద్రుడిపై దిగితే.. ఇలా ఎన్నెన్నో ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
కొందరు ఈ ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేసి నేరాలకు పాల్పడుతుంటే.. మరికొందరు వారి ప్రతిభకు పదును పెట్టి సరికొత్త ఆవిష్కరణలను రూపొందిస్తున్నారు. తాజాగా, శివుడి రూపంలో ఉన్న ప్రభాస్ ఏఐ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అనేక వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. సినిమా నటులు, రాజకీయ నాయకుల ఫొటోలను మార్చి సరికొత్తగా తయారు చేస్తున్నారు. నిజంగా వారే ఇలా మారిపోయారేమో అన్నంతలా భ్రమ కలిగిస్తుంటాయి ఈ ఏఐ ఫొటోలు, వీడియోలు. ఏఐ జనరేటెడ్ పిక్స్ ఈ మధ్య ట్రెండ్‌గా మారాయి.
చాలా మంది ఏఐ ఫొటోలను తమ వాట్సప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ డీపీలుగా కూడా పెట్టుకుంటున్నారు. ఏఐ టెక్నాలజీపై కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ ఇలాంటి సరదా ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా చూపించే ఈ ఫొటోల్లో కొన్నింటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది.
Updated Date - 2023-12-06T19:18:47+05:30 IST