Balder Bandi : బొమ్మలకు క్యాప్షన్స్ రాస్తూ కవిగా మారాడు..!
ABN, First Publish Date - 2023-01-05T13:36:04+05:30
బంజారాల గురించిన సాహిత్యం రావాల్సిన అవసరం చాలా ఉంది.
'బల్దేర్ బండి' కవిత్వం ఓ పాతికేళ్ళ యువకుడు పుట్టి పెరిగిన వాతావరణం, సంస్కృతి సాంప్రదాయల మేలు కలయిక. కవిత్వాన్ని అనుభవంతో జోడించి, పరిశీలనలో పదాల అందాన్ని, తాత్విక సత్వాల్ని కలగలిపి రాసిన పుస్తకం. కవిత్వం తన అనుభవాలనుంచి పుట్టిందని చెబుతూనే.. చాలా నిశితపరిశీలనలో పుట్టిన వాక్యాలని చెప్పకనే చెపుతాయి. ఈ కవిత్వం నిండా శ్రమతెలిసిన శ్రామికుడు, పల్లె మాత్రమే ఎరిగిన అందాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఈ కవిత్వాన్ని ఆంధ్ర విశ్వ విద్యాలయంలో M.A తెలుగు రెండో సంవత్సరంలో పాఠ్యాంశంగా చేర్చడం మరో విశేషం. కవి రమేశ్ కార్తీక్ నాయక్ తో ఆంధ్రజ్యోతి వెబ్ పరిచయం.
బల్దేర్ బండి (కవిత్వం), ఢావ్లో (గోర్ బంజారా కతలు) కథలు, కేసులా : తొలి గోర్ బంజారా కథా సంకలనాలు రమేష్ కార్తీక్ నాయక్ రచనలు.
బల్దేర్ బండి (కవిత్వ సంపుటి) లోని ఓ కవిత 'జారేర్ బాటి' (జొన్న రొట్టెలు) SR & BGNR GOVT DEGREE ARTS AND SCIENCE COLLEGE, - ఖమ్మంలో పాఠ్యాంశంగా ఉంది. తాజాగా "బల్దేర్ బండి" పుస్తకాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు M.A. Telugu రెండో సంవత్సరంలోని నాలుగో సెమిస్టర్ లో పాఠ్యాంశంగా తీసుకున్నారు. ఈ కవిత్వం సిలబస్ లో ఉండడంతో విద్యార్థులు పూర్తి స్థాయిలో చదివి మిత్రులతో ఆరా తీస్తారు. అలా తన చరిత్ర గురించి, తన పూర్వీకుల గురించి ఒకరు ఇద్దరైనా తెలుసుకుంటారనేది కార్తీక్ ఆలోచన.
బల్దేర్ బండిలో
బల్దేర్ బండి 2018లో పుస్తకంగా వచ్చింది. ఈ పుస్తకంలో మొత్తం 53 కవితలు ఉన్నాయి. వీటిలో కొన్ని బంజారాల గురించి, కొన్ని సాధారణ కవితలు, ఇంకొన్ని జానపదా శైలిలో ఉంటాయి.
ఇంగ్లీషులో రచన..
Exchanges: Journal of Literary Translation - University of IOWA, Poetry at Sangam, Outlook India, Live Wire., Indian periodical లాంటి పత్రికల్లో కార్తీక్ కవితలు, ఓ కథ ప్రచురితమయ్యాయి.
బాల్యం నుండి బొమ్మలు వేయడం అలవాటుతో, అలా వేసిన బొమ్మలకు రెండు లైన్లు క్యాప్షన్స్ రాసేవాడు కార్తీక్, అదే అలవాటుగా మారి కవిత్వపు దారి పట్టాడు. సాహిత్యాన్ని చదవడం మొదలు పెట్టిన తొలిరోజులలో చాలా వరకూ అందరూ కవిత్వానికే ఎక్కువ ఆకర్షించబడతారు ఇదే కారణం తనను కూడా కవిత్వం వైపుకు ఆకర్షించిందని కార్తీక్ నమ్మకం.
మొదట్లో తన ఇంట్లో వాళ్లకి ఈ పుస్తకాలన్న, తను చేసే పనన్నా అసలు ఇష్టం ఉండేది కాదు. పుస్తకాల గురించి తరచుగా గొడవలు అవుతుండేవి. తర్వాతర్వాత కార్తీక్ పుస్తకాలు ప్రచురితం కావడం, రవీంద్ర భారతిలో తన పుస్తక ఆవిష్కరణకు ఇంట్లో వాళ్ళను తీసుకురావడం, అక్కడ వేదిక మీద తన గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరో వాళ్లకు తెలియకపోయినా వాళ్ళ బిడ్డ ఏదో మంచి పని చేశాడని, చేస్తున్నాడని వాళ్లు కూడా అనుకున్నారు. కొడుకు ఇష్టం పుస్తకాలమీద ఉన్నదని అర్థం చేసుకున్న కుటుంబం అప్పటినుంచి చదువుకోవడం, కవిత్వం రాసుకోవడం అనేది అతని ఇష్టానికే వదిలేసారు.
రాసినవన్నీ పుస్తకంగా వేయాలని..
మొదట తన రచనలను పుస్తకంగా వేయాలనే ఆలోచన కార్తీక్ కు లేదు. ఝాల్ అని కవిత ఒకటి సారంగలో ప్రచురితమైంది. అది చూసిన రచయిత అపర్ణ తోట ఈ కవితలన్నిటినీ పుస్తకంగా వేయాలని తన మిత్రురాలు చైతన్య పింగళి ఇతర సాహిత్య మిత్రులతో కలిసి ఈ కవితలకు పుస్తక రూపాన్ని ఇచ్చారు.
ఇప్పటి వరకూ చేసిన రచనలతో బంజారా రచయితగానే పరిమితం అవ్వాలని కార్తీక్ అనుకోవట్లేదు. బంజారాల గురించిన సాహిత్యం రావాల్సిన అవసరం చాలా ఉంది. తను పుట్టిన బంజారాల సాహిత్యమే కాదు ఇతర గిరిజన, ఆదివాసి సాహిత్యాన్ని కూడా రాయాల్సిన అవసరం ఉందని, బంజారా గురించి రాస్తూనే ఉంటానని అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 35 గిరిజన ఆదివాసి తెగలు ఉన్నాయని వాటి గురించి తెలుసుకుని వాటిని ప్రతిబింబించే విధంగా కవిత్వంగానో, కథగానో, నవలగానో, రాయాలనే ఆలోచనలో ఉన్నారు కార్తీక్.
ఇష్టమైన రచయితలు
టోనీ మొరీసన్, గాబ్రియల్ గార్శియా మార్క్వేజ్, అమృతా ప్రితం, మహా శ్వేతా దేవిల రచనలు కార్తీక్ ఇష్టంగా చదువుతారు. ఈ మధ్యకాలంలో నాటకాల వైపు మళ్ళి, Dr. Faustus నాటకాన్ని చదువుతున్నారు.
ప్రస్తుతం రాస్తున్న రచనలు..
జమ్మి (తెలంగాణ గోర్ బంజారా కథలు) కథల సంకలనం కోసం సూర్యాధనంజయ్ తో కలిసి పని చేస్తున్నారు కార్తీక్. అందులో తెలంగాణ కథలే తీసుకోవడానికి ముఖ్య కారణం, తెలంగాణలో ఎక్కడ, ఏ మూల చూసినా బంజారాలు కనిపిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల్లో వారు లేరు. బంజారా జీవితం, వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను, సాంస్కృతిక, రాజకీయ స్వేచ్ఛలను రికార్డు చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ పని సాగుతుంది. తన కవిత్వం, కథలు చదివి తెలుసుకోవడం ఇప్పటి పాఠకుల మానసిక దృష్టిపై ఆధారపడి ఉంటుంది. వాళ్ళు తన రచనను చదివి ఉండడంతో, తర్వాతర్వాత వారి జీవితాల్లో ఎక్కడైనా బంజారాలు తారసపడితే, వాళ్లను ఆపి మరీ వాళ్ళ జీవన విధానం ఏంటి, ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు? మీ గురించి మేము చదువుకున్నామని ఆరా తీస్తారని అంటారు కార్తీక్. ఇది ఒక రచయితకి చాలా తృప్తినిచ్చే విషయం.
-శ్రీశాంతి మెహెర్.
Updated Date - 2023-01-05T13:46:37+05:30 IST