Shocking: 25 ఏళ్ల ఈ కుర్రాడు.. ఎలా చనిపోయాడో తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం.. స్నేహితులతో సరదాగా కాసిన పందెమే..!
ABN, First Publish Date - 2023-07-17T20:11:01+05:30
స్నేహితులు విసిరిన సవాలును స్వీకరించిన ఓ బీహార్ యువకుడు అనూహ్య రీతిలో మరణించాడు. అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మోమోలు తినాలని అతడు ప్రయత్నించగా ఒకటి గొంతుకకు అడ్డం పడటంతో అతడు అనూహ్య రీతిలో మరణించాడు. అయితే, కుటుంబసభ్యులు మాత్రం యువకుడిని స్నేహితులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.
ఇంటర్నె్ట్ డెస్క్: యువతరం.. ఉడుకు రక్తం.. స్నేహితులు ఏదైనా ఛాలెంజ్ చేస్తే ధైర్యంగా స్వీకరించాల్సిందే. సవాలులో విజయం సాధించాల్సిందే. బీహార్‌లోని గోపాల్ గంజ్‌కు చెందిన బిపిన్ కుమార్ పాశ్వాన్(25)ది కూడా ఇదే శైలి. ఈ క్రమంలో స్నేహితులు అతడికి ఒక సవాల్ విసిరారు. తమలో అతి తక్కువ సమయంలో అత్యధిక మోమోలు తినేవారెవరో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
ఆ ఛాలెంజ్ స్వీకరించడమే అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. గబగబా మోమోలు తింటున్న అతడి గొంతులో ఓ మోమో అడ్డం పడటంతో అతడు అనూహ్య రీతిలో మృతిచెందాడు(Bihar youth died in momos eating challenging). కానీ యువకుడి కుటుంబసభ్యులు మాత్రం ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోమోలు గొంతుకకు అడ్డం పడి అతడు మరణించాడంటే తాము నమ్మమని వారు స్పష్టం చేశారు. స్నేహితులే ఏదో చేసుంటారని అనుమానం వ్యక్తం చేశారు.
బిపిన్ మృత దేహం రోడ్డు పక్కన పడి ఉండటాన్ని వారు ప్రస్తావించారు. ప్రమాదవశాత్తూ అతడు మరణించి ఉంటే స్నేహితులే ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదని వారు ప్రశ్నించారు. ఈ ఘటనలో పోలీసుల తీరు కూడా వివాదాస్పదంగా మారింది. బఢారి స్టేషన్ పోలీసులు తొలుత మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించేందుకు నిరాకరించారు. ఇది తమ పరిధిలోని అంశం కాదని అన్నారు. దీంతో, థావే స్టేషన్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక తరువాతే బిపిన్ మరణానికి గల కారణాలేంటో తెలుస్తాయని చెప్పారు.
Updated Date - 2023-07-17T20:22:01+05:30 IST