ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Varasudu Film Review: ఇదో కలగూర గంప

ABN, First Publish Date - 2023-01-14T14:17:41+05:30

సంక్రాంతి పండగ బరిలో రెండు పెద్ద తెలుగు సినిమాలతో పాటు ఒక డబ్బింగ్ సినిమా కూడా ఉంది.

Vaarasudu
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా: వారసుడు

నటీనటులు : విజయ్, రష్మిక మందన్న, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సంగీత, ప్రభు, సుమన్, జయసుధ, ఎస్‌జే సూర్య, సంయుక్త తదితరులు

ఛాయాగ్రహణం : కార్తీక్ పళణి

సంగీతం : ఎస్.ఎస్.థమన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వంశీ పైడిపల్లి

నిర్మాత : దిల్ రాజు

--- సురేష్ కవిరాయని

సంక్రాంతి పండగ బరిలో రెండు పెద్ద తెలుగు సినిమాలతో పాటు ఒక డబ్బింగ్ సినిమా కూడా ఉంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘వారిసు’ అనే సినిమాని ‘వారసుడు’ గా తెలుగులో విడుదల అయ్యింది. అయితే ఈ డబ్బింగ్ సినిమాకి ఒక ప్రత్యేకత వుంది. అదేంటి అంటే, దీనికి నిర్మాత, దర్శకుడు, కొందరు నటులు తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనపడేవాళ్లే ఉండటం. దిల్ రాజు నిర్మాత, వంశీ పైడిపల్లి దర్శకుడు అయితే, ఇంకా జయసుధ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, కిక్ శ్యామ్, సంగీత, రష్మిక మందన్న, శరత్ కుమార్ లాంటి నటులు ఇందులో నటించారు. తమిళ సినిమా జనవరి 11వ తేదీనే విడుదల అయిపొయింది. కానీ తెలుగులో డబ్బింగ్ సినిమాలు పండగకు విడుదల చేయొద్దు అనే విషయం మీద పెద్ద రచ్చ అవటం వల్ల, నిర్మాత దిల్ రాజు ఈరోజు అంటే జనవరి 14న విడుదల చేశారు. ఇక సినిమా ఎలా ఉంది, తెలుగులో నడుస్తుందా లేదా చూద్దాం...

Varasudu Story కథ:

రాజేంద్ర (శరత్ కుమార్) తన వ్యాపారంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. అతనికి ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (కిక్ శ్యామ్), విజయ్ (విజయ్). మూడో కొడుకు అయిన విజయ్ తండ్రి విస్తరిస్తున్న వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా ఉండలేను అని తండ్రితో తగాదా పడి ఇంటి నుంచి వెళ్లిపోతాడు. ఏడు సంవత్సరాల తరువాత, రాజేంద్రకి ఒక భయంకర కాన్సర్ వ్యాధి వచ్చి ఎన్నాళ్లు బతుకుతాడో తెలియని పరిస్థితి వస్తుంది. అదే సమయంలో అతని భార్య (జయసుధ) షష్టిపూర్తి వేడుక చేద్దామని చెబితే, దానికి రాజేంద్ర సరే అని చెబుతాడు. ఆ వేడుకకి ఏడేళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయిన విజయ్ కూడా వస్తాడు అమ్మ కోరిక మేరకు. ఆ వేడుకలోనే రాజేంద్రకి తన ఇద్దరు కొడుకులు జై, అజయ్ అసలు సంగతి తెలుస్తుంది. వాళ్లు చేస్తున్న తప్పులు బయటపడతాయి. రాజేంద్రకి ఒక పక్క భయంకర వ్యాధి, ఇంకో పక్క తన విరోధులు తాను విస్తరించిన సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటే, చిన్న కొడుకు అయిన విజయ్‌ని అక్కడే ఉండి వ్యాపారం, కుటుంబం చూసుకోమని అడుగుతాడు. తండ్రి మాట మన్నించి విజయ్ అక్కడే ఉండి వ్యాపారం, కుటుంబం చూసుకుంటాడా? లేక వదిలేసి వెళ్లిపోయి తాను అనుకున్న స్టార్ట్ అప్ వ్యాపారం చేసుకుంటాడా? ఇంతకీ ఆ అన్నదమ్ములు ఇద్దరూ ఏమి తప్పులు చేశారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు వంశీ పైడిపల్లి మొదటి సారిగా తమిళంలో సినిమా చేసినప్పుడు, అదీ కాకుండా విజయ్ లాంటి ఒక పెద్ద స్టార్‌తో జత కలిపినప్పుడు ఒక మంచి కథని ఎంచుకొని పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీస్తే బాగుండేది. కానీ వంశీ ఇక్కడ తెలుగులో వచ్చిన సినిమా కథలు అన్నీ ఒక మిక్సీలో వేసి ఆడించేసి అదే 'వారసుడు' అని తీశాడు. ఒక ధనవంతుల కుటుంబం, తండ్రి, ముగ్గురు కొడుకులు, చిన్న కొడుకు తండ్రి ఆశయాలు నచ్చక ఇంటి నుండి వెళ్లిపోతాడు. తల్లికి అందరూ కావాలి, ఇంట్లోంచి వెళ్లిపోయిన చిన్న కొడుకుతో సహా. ఒక విరోధి ఈ కుటుంబాన్ని చెల్లా చెదురు చేసి ఆ వ్యాపారంలో తండ్రిని దెబ్బ తీయాలని చూస్తాడు, అందుకు ఇద్దరు కొడుకులకి ఎర వేస్తాడు. ఈలోపు ఇంట్లోంచి వెళ్లిపోయిన కొడుకు తిరిగి వచ్చి ఆ కుటుంబాన్ని కలపటమే కాకుండా, విరోధులను ఎలా దెబ్బ తీశాడు అన్నది టూకీగా కథ.

ఇప్పుడు ఈ కథ మీరు చదవగానే ఎక్కడో చూసినట్టు ఉంది కదా. అందరికీ అలానే అనిపిస్తుంది. తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి ఇలాంటివి. అంతెందుకు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు తీసిన 'శతమానం భవతి' నుండి మొన్నటి వరకు వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాలు అన్నీ కూడా ఇలాంటివే. ఇవే కాదు, తెలుగులో ఇలాంటివి పాత సినిమాలు కూడా ఎక్కువ ఉన్నాయి. పొలాల అమావాస్యకి ఏడూ ఎనిమిది కూరలతో పులుసు చేసినట్టుగా, దర్శకుడు వంశీ తెలుగులో వచ్చిన కథలు అన్నింటితో ఈ ‘వారసుడు’ అదీ విజయ్‌లాంటి స్టార్‌తో చేశాడు. తమిళ ప్రేక్షకులకి ఇవన్నీ నచ్చుతాయో, లేదో తెలీదు కానీ, తెలుగు ప్రేక్షకులు ఇవన్నీ ఎప్పుడో చూసేశారు. చెప్పా కదా, పైన చెప్పినట్టు అన్ని కూరగాయలు వేసి చేసిన పులుసు బాగుండాలి, లేకపోతే ఇంత చేసి రుచిగా లేకపోతే బాగోలేదు అంటారు. ఈ ‘వారసుడు’ కూడా అంతే. అక్కడక్కడా కొన్ని కొన్ని సన్నివేశాలు తప్పితే, సినిమాలో దమ్ము లేదు, కథ లేదు, కథనం కూడా ఆసక్తికరంగా లేదు.

ఇక నటీనటుల విషయానికి వస్తే, విజయ్ అనే నటుడుకి చాలా పెద్దగా అభిమానులు ప్రపంచం అంతా ఉన్నారు. కాబట్టి అతని హావభావాలు వాళ్లకి నచ్చి ఉండొచ్చు. అలాగే అతని సినిమాలు తెలుగులో పెద్దగా విడుదల కాలేదు, అలాగే అతనికి రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, విశాల్ లాంటి నటులతో పోలిస్తే తెలుగులో ఇంకా మార్కెట్ అంతగా లేదు. ఈ సినిమాలో విజయ్ బాగానే చేశాడు, కానీ అందులో ప్రత్యేకం ఏమి లేదు. రష్మిక మందన్న కథానాయికగా నటించింది, ఆమె పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది, కానీ పెద్ద పాత్ర అయితే కాదు. ఇంక విజయ్ తరువాత మంచి పేరు వచ్చేది మాత్రం జయసుధకి. ఆమె తల్లి పాత్రలో ఒదిగిపోయింది. అలాగే ఆమెతో విజయ్ చేసిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కిక్ శ్యామ్ వీళ్లందరూ ఇలాంటివి చాలాసార్లు చేశారు. అలాగే హాస్య నటుడు యోగి డబ్బింగ్ బాగోలేదు.

సినిమాటోగ్రఫీ బాగుంది. థమన్ సంగీతం కూడా సినిమాకి చాలా సహాయం అవుతుంది. పాటలు బాగున్నాయి, అందులో రంజితమే పాట సినిమా విడుదలకి ముందే బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా థమన్ బాగా ఇచ్చాడు. మాటలు కూడా మామూలుగా ఉన్నాయి. ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసి, నిర్మాతగా కూడా చేసిన దిల్ రాజు ఇలాంటి సినిమా ఎలా ఒకే చేశాడు అన్నదే ప్రశ్న. పెద్ద స్టార్ దొరికాడని సినిమా తీయటం కాదు, స్టార్‌కి తగ్గ కథని కూడా తయారు చేసుకోవాలి. అందులో దిల్ రాజు, దర్శకుడు వంశీ ఇద్దరూ తప్పే చేశారు.

చివరగా, ‘వారసుడు’ సినిమా ఒక మామూలు సినిమా. చాలా తెలుగు సినిమాలలోంచి ఒక్కో సీన్ తీసి పెడితే ఎలా ఉంటుందో ఆలా ఉంటుంది ఈ సినిమా. ఒక కలగూర గంపలా తయారుచేశారు ఈ సినిమాని. కుటుంబ ప్రేక్షకుల కోసం అదీ కాకుండా పండగ సమయంలో విడుదల చేస్తే అందరూ చూస్తారు అనుకోని ఎదో ఈ సినిమా తీసేసినట్టుగా అనిపిస్తుంది. ఇంత చెప్పాక, చూడాలా వద్దా అనే విషయం మీరే నిర్ణయించుకోండి.

Updated Date - 2023-01-14T14:55:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising