Year Ender 2023: ఈ ఏడాది వార్తల్లో నిలిచిన టాప్ 10 వ్యక్తులు వీరే...
ABN, Publish Date - Dec 23 , 2023 | 01:32 PM
దేశ ప్రజలు 2023కు ముగింపు పలుకుతూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఎలాన్ మస్క్ నుంచి రాహుల్ గాంధీ వరకు ఎందరో ఈ ఇయర్ న్యూస్ మేకర్స్ అయ్యారు. అయితే ఈ ఏడాది వార్తలో నిలిచిన టాప్ 10 వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ: దేశ ప్రజలు 2023కు ముగింపు పలుకుతూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఎలాన్ మస్క్ నుంచి రాహుల్ గాంధీ వరకు ఎందరో ఈ ఇయర్ న్యూస్ మేకర్స్ అయ్యారు. అయితే ఈ ఏడాది వార్తలో నిలిచిన టాప్ 10 వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలాన్ మస్క్
స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ 2022లో ట్విటర్(ఎక్స్) ని కొనుగోలు చేశారు. ఆయన 2023లో దాన్ని పూర్తి స్వభావమే మార్చేశారు. ట్విటర్ లోగోగా ఉన్న బ్లూ బర్డ్ ని తొలగించి దాని స్థానంలో నలుపు రంగులో ఉన్న ఎక్స్(X) అనే సింబల్‌తో భర్తీ చేశారు. దీనిని ఈ ఏడాది మార్చిలో రీబ్రాండ్ చేశారు. 231 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా మస్క్ నిలిచారు.
సామ్ ఆల్ట్ మాన్
చాట్ జీపీటీని ప్రారంభించిన సామ్ ఆల్ట్ మాన్ ను సంస్థ ఈ ఏడాది తొలగించింది. తరువాత మళ్లీ ఆయన్ని నియమించింది. చాట్ జీపీటీతో ఆల్ట్ మాన్ పేరు మార్మోగింది. ఏఐలో నూతన శకానికి ఆయన నాందిపలికారు. ఏఐ రంగంలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పుట్టుకొచ్చాయి. 2023 ఏడాదికిగానూ కాయిన్ డెస్క్ అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల జాబితాలో ఈయన ఉన్నారు.
రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ ఏడాది పార్లమెంటరీ హోదా కోల్పోయారు. 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఇంటి పేరుకు సంబంధించి పరువు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదైంది. దీనిపై గుజరాత్ లోని సూరత్ కోర్టు విచారించి.. రాహుల్‌కి రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ కి అక్కడ ఊరట లభించింది. ఆయనకు సూరత్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేసి.. ఎంపీ హోదాను పునరుద్ధరించింది.
మహువా మొయిత్రా
'క్యాష్ ఫర్ క్వెరీ'పై ఎథిక్స్ కమిటీ నివేదికను అనుసరించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాను లోక్ సభ నుండి బహిష్కరించారు. దీనికి వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వార్త 2023లో ట్రెండింగ్ లో నిలిచింది.
బైజూస్
కరోనా టైంలో పాపులారిటీ సంపాదించుకున్న బైజూస్ ఆర్థిక పరిస్థితి ఈ ఏడాది మరీ దారుణంగా మారింది. 1.2 బిలియన్ డాలర్ల అప్పు తిరిగి చెల్లించలేక వివాదంలో చిక్కుకుంది. బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ ఈ అంశంపై దృష్టి సారించినా ఇప్పటికీ కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్నారు.
ఆర్ నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశ పని ఉత్పాదకతను పెంచడానికి యువత వారానికి 70 గంటలు పని చేయాలని సూచించడం భారీ చర్చకు దారితీసింది. రాబోయే 10, 15 సంవత్సరాలలో దేశ విజన్ గురించి అడిగినప్పుడు ఉత్పాదకత పెంపుదలకుగల ప్రాముఖ్యతను ఆయన గుర్తు చేశారు.
డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూడటంతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు 2021లో అమెరికా క్యాపిటల్ హిల్ పై దాడి చేశారు. దీనిపై కేసు నమోదవడంతో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల బరిలో పోటీలో నిలబడకుండా నిషేధిస్తున్నట్లు కొలరాడో కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు ట్రంప్ నకు షాక్‌కి గురి చేసింది.
లిండా యక్కరినో
ఎన్‌బీసీ యూనివర్సల్‌లో మాజీ అడ్వర్టైజింగ్ సేల్స్ లీడర్ అయిన లిండా యాకారినో ఈ సంవత్సరం ఎక్స్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ట్విటర్ లోగో మార్చడం నుంచి అందులో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకురావడం వరకు ఆమె కీలకంగా వ్యవహరించారు.
కింగ్ చార్లెస్ III
కింగ్ చార్లెస్ III, క్వీన్ కెమిల్లా పట్టాభిషేకం మే 6, 2023న వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరిగింది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగిన మొదటి పట్టాభిషేకం ఇదే.
కిమ్ జు ఏ
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు ఏ ఇటీవల తన తండ్రితో కలిసి బహిరంగంగా కనిపించారు. దీంతో ఉత్తర కొరియా రాజకీయాల్లో త్వరలో ఆమె కీలక పాత్ర పోషిస్తారనే చర్చలు పెరిగాయి.
Updated Date - Dec 23 , 2023 | 01:36 PM