Plants: ప్రతీ మొక్కకూ ఓ లెక్కుంది!
ABN, First Publish Date - 2023-03-05T10:12:48+05:30
‘‘నా బాల్యమంతా గ్రామాల్లోనే గడిచింది. మాది మహబూబ్‌నగర్ జిల్లా తిరుమలగిరి గ్రామం. ప్రస్తుతం ఉద్యోగరిత్యా కొత్తగూడెంలో ఉంటున్నా....
‘‘నా బాల్యమంతా గ్రామాల్లోనే గడిచింది. మాది మహబూబ్‌నగర్ జిల్లా తిరుమలగిరి గ్రామం. ప్రస్తుతం ఉద్యోగరిత్యా కొత్తగూడెంలో ఉంటున్నా. చిన్నతనంలో చుట్టూ పచ్చని పొలాల మధ్య పెరగడం వల్ల తెలియకుండానే మొక్కలపై ఇష్టం ఏర్పడింది. స్కూల్ రోజుల్లోనే వర్షపు నీరు వృథాగా పోకుండా కట్టలు కట్టడం చేసేవాడిని. ఇప్పుడు వాటిని చెక్ డ్యాంలని పిలుస్తున్నాం. జడ్చర్లలో చదువుకునే సమయంలో నర్సరీల నుంచి మొక్కలు తీసుకొచ్చి నాటాను. మట్టితో ఉంటే బరువు ఎక్కువై మొక్కలు తీసుకురావడం కష్టమయ్యేది. అందుకే సగం మట్టి తీసేసి, వేర్లకు కాస్త మట్టి ఉండేలా చూసుకుని మొక్కలు మోసుకొచ్చే వాణ్ణి.
జియో ట్యాగింగ్...
ఉద్యోగంలో చేరిన తర్వాత మొక్కలు నాటడంపై మరింత శ్రద్ధ పెరిగింది. ఎంపీ జోగినిపల్లి సంతోష్ గారితో కలిసి హరితహారంలో చురుగ్గా పాల్గొన్నా. ఆయనతో కలిసి లక్షలాది మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్నా. దేశంలో ఏ ప్రాంతానికెళ్లినా మొక్కలు నాటుతుంటాను. ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు అక్కడ కూడా మొక్కలు నాటాను. నేను సింగరేణిలో అధికారిని. అందుకే సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లో మొక్కలు నాటేందుకు కృషి చేశా. అంతేకాకుండా మొక్కలు నాటిన ప్రతీ ప్రదేశాన్ని జియోట్యాగింగ్ చేయించా. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా 15,069 మొక్కలు నాటా. నేను నాటిన వాటిలో 95 శాతం మొక్కలు బతికాయి. కొన్ని ప్రాంతాల్లో మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవుల్లా మారాయి. మొక్కలు నాటే కార్యక్రమాల్లో సింగరేణి సిబ్బంది సైతం ఉత్సాహంగా పాల్గొంటారు. మొక్కల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటుంటారు. మొక్కలు నాటడం వల్ల ప్రస్తుతం సింగరేణి ఓపెన్‌కాస్ట్ డంపులన్నీ అడవుల్లా మారాయి. నేను వ్యక్తిగతంగా మొక్కలు నాటడంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగిగా అందరినీ మోటివేట్ చేస్తూ వాళ్లూ పాల్గొనేలా చేస్తుంటా. ఇప్పటికే సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమాల్లో కొన్ని లక్షల మొక్కలు నాటాం.
నాటితే సరిపోదు...
మొక్కలు నాటడం చాలామంది చేస్తారు. కానీ వాటి సంరక్షణ బాధ్యతలను కూడా తీసుకున్నప్పుడే తగిన ఫలితం దక్కుతుంది. మేం మొక్కలు నాటే సమయంలోనే నీళ్ల సదుపాయం ఉందా లేదా అన్న విషయాన్ని గుర్తించడం, చెరువులు, బోర్‌లు ఉన్న చోటే మొక్కలు నాటడం చేశాం. ఆ సదుపాయాలు ఏవీ లేని చోట మొక్కలు నాటితే ట్యాంకర్లతో నీళ్లు పోయించాం. ఆ జాగ్రత్తలు తీసుకోబట్టే 95 శాతం మొక్కలు బతికాయి.
అందరి బాధ్యత
ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం, వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. ఆ విషయాన్ని అందరూ గుర్తించాలి. మొక్కలను, కొండలను తొలిచేసి నిర్మాణాలు చేపడుతున్నారు. కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్న నగరాలను చూస్తుంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందనే భయం వేస్తుంటుంది. మనిషికి ప్రాణాధారమయిన ఆక్సిజన్‌ను అందించే మొక్కలను కాపాడుకోవడం మన బాధ్యత. ఈ విషయాన్ని అందరూ గుర్తించి, మొక్కలు నాటడం జీవన విధానంలో భాగంగా మార్చుకోవాలి. అప్పుడే మనకు ఎంతో మేలు చేస్తున్న ప్రకృతి రుణం కొంతయినా తీర్చుకున్నవారం అవుతాం.’’
మరో 261 మొక్కలు నాటితే...
ఇప్పుడు నా వయస్సు 42ఏళ్లు. ఏడాదికి 365 రోజులు. నా వయస్సు(42)ని 365తో గుణిస్తే 15,330 వస్తుంది. ఇప్పటి వరకు 15,069 మొక్కలు నాటా. ఇంకో 261 మొక్కలు నాటితే రోజుకు ఒక మొక్క నాటినట్టు అవుతుంది. ప్రస్తుతానికి నా లక్ష్యం అదే.
Updated Date - 2023-03-05T10:50:31+05:30 IST