ISRO: ఇస్రో చీఫ్ సోమనాథ్ శాలరీ ఎంతో చెప్పిన పారిశ్రామికవేత్త.. ఇది సబబేనా అంటూ ప్రశ్న!
ABN, First Publish Date - 2023-09-12T16:22:45+05:30
ఇస్రో చీఫ్ సోమనాథ్ జీతం గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అలాంటి వాళ్లను డబ్బుకు మించిన ఉన్నతమైన అంశాలు ముందుకు నడిపిస్తాయని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖపారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గోయంకా(Harsh Goenka) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. పలు స్ఫూర్తివంతమైన విషయాలు పంచుకోవడంతో పాటూ కొన్ని సరదా అంశాల్నీ షేర్ చేస్తుంటారు. భారత అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్. సోమనాథ్ జీతంపై(ISRO chief S. Somath Salary) ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా(Viral) మారాయి. అనేక మంది నెటిజన్లు ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు.
‘‘ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాలరీ నెలకు రూ.2.5 లక్షలు. ఇది సబబేనా, న్యాయమేనా? మనం ఓ విషయం అర్థం చేసుకోవాలి! సోమనాథ్ లాంటి వాళ్లకు డబ్బుకు మించిన అంశాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. తన అభిరుచి, శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధన, మక్కువతో వారు పనిచేస్తారు. దేశానికి పేరుప్రతిష్ఠలు తీసుకురావాలని కోరుకుంటారు. సోమనాథ్ లాంటి వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని ఆయన ట్వీట్ చేశారు. .
హర్ష్ గోయెంకా కామెంట్‌ను నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ‘‘వృత్తిపై మక్కువ, నిబద్ధతే వారిని ముందుకు నడిపిస్తోంది. డబ్బుతో వాటిని కొలవలేము. ఆర్థిక ప్రోత్సాహకాలు కాకుండా సైన్స్, పరిశోధన, దేశ అభ్యున్నతి వంటి లక్ష్యాల కోసం వారు పనిచేస్తుంటారు’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘‘ఆయనకు నెలకు రూ.25 లక్షలు అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. ఆయన సామర్థ్యానికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం దక్కాలి’’ అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. ‘‘మీరన్నది కరెక్టే..ఆయనకు డబ్బు కోసం కాకుండా దేశం కోసం విజయం కోసం పనిచేస్తున్నారు’’ అని మరో వ్యక్తి హర్ష్ గోయెంకాకు రిప్లై ఇచ్చారు.
అయితే, హర్ష్ గోయెంకా పేర్కొన్న శాలరీ బేసిక్ పే అయి ఉండొచ్చని ఓ వ్యక్తి సందేహం వెలిబుచ్చారు. ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉండి ఉంటాయని చెప్పుకొచ్చారు. శాస్త్రవేత్తల విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉంటుందని, అది సబబేనని అన్నారు. ఇలాంటి వారు ప్రైవేటు రంగంలో ఉండి ఉంటే ఇంతకు ఎన్నో రెట్లు సంపాదించేవారని చెప్పారు. ఇలా జస్ట్ ఒక్క పోస్ట్‌తో హర్ష్ గోయెంకా పెద్ద చర్చకే తెరలేపారు.
Updated Date - 2023-09-12T16:26:54+05:30 IST