దాగుడుమూతలాట ఎంత పని చేసింది.. దాక్కున్న కుర్రాడు కళ్ళు తెరిచేసరికి వేరే దేశంలో..
ABN, First Publish Date - 2023-01-30T11:53:56+05:30
దాగుడుమూతలు ఆట కాస్తా సీరియస్ పరిణామానికి దారితీసింది.
'దాగుడు మూతలు దండాకోర్! పిల్లి వచ్చే ఎలుకా భద్రం ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్' అని వినగానే చిన్నతనం, చిన్నతనంలో ఆడుకున్న దాగుడుమూతలు గుర్తొస్తాయి. పిల్లలు ఆడుకునే దాగుడుమూతల ఆటకు ప్రాంతీయ బేధాల్లేవు. బాంగ్లాదేశ్ లో పిల్లలు ఆడుకుంటున్న ఈ దాగుడుమూతలు ఆట కాస్తా సీరియస్ పరిణామానికి దారితీసింది. ఇంతకూ జరిగిందేమిటంటే..
బాంగ్లాదేశ్ లో చిట్టగాంగ్ రేవు ప్రాంతంలో కొంతమంది పిల్లలు దాగుడుమూతలు ఆడుకుంటున్నారు. వారిలో ఓ 15ఏళ్ళ కుర్రాడు దాక్కోవడానికి పరిగెత్తుకెళ్ళి రేవు దగ్గర ఉన్న ఓ కంటైనర్ లో దాక్కుని లోపల లాక్ చేసుకున్నాడు. వెంటనే నిద్రరావడంతో నిద్రలోకి జారుకున్నాడు. ఆ పిల్లాడి దురదృష్టం కొద్ది ఆ కంటైనర్ ను మలేషియాకు వెళుతున్న షిప్ లో ఎక్కించారు. ఆరు రోజుల తరువాత ఆ పిల్లాడిని కొంత మంది అధికారులు కనుగొన్నారు. ఆహారం, నీరు లేక బాడీ డీహైడ్రేషన్ కు గురయ్యింది. విపరీతమైన జ్వరం వచ్చేసింది. ఈ పరిస్థితిలో ఉన్న కుర్రాడిని అధికారులు హాస్పిటల్ కు తరలించారు. మొదట కంటైనర్ లో కుర్రాడు కనిపించినప్పుడు ఇదేదో పిల్లల్ని అక్రమరవాణా చేస్తున్నట్టుందే అనుకున్నారు కానీ.. ఆ తరువాత పిల్లల ఆట ఇంతపనికి దారితీసిందని తెలిశాక అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన విన్నవాళ్ళు పిల్లల సరదా ఎంతపని చేసింది అంటున్నారు.
Updated Date - 2023-01-30T11:55:06+05:30 IST