Lake of Skeletons: ఆ నదిలో వందల కొద్దీ అస్తిపంజరాలు.. చనిపోయిందెవరు..? అసలేం జరిగిందంటే..!
ABN, First Publish Date - 2023-02-12T14:18:00+05:30
ఈ సరస్సు దగ్గరకు వెళ్ళిన వాళ్ళకు మరణమే ముగింపు అయ్యిందా? అవునని అనిపిస్తుంది ఈ సరస్సు గురించి తెలిస్తే..
మహాభారతంలో తిరిగి తిరిగి అలసిపోయిన పాండవులకు దాహమేసినపుడు నీళ్ళు తెద్దామని ఒక్కొక్కరు సరస్సు దగ్గరకు వెళతారు కానీ మళ్ళీ వెనక్కు రారు. ధర్మరాజు వల్ల వాళ్ళు ప్రాణాలతో బయటపడతారు. కానీ ఈ సరస్సు దగ్గరకు వెళ్ళిన వాళ్ళకు మరణమే ముగింపు అయ్యిందా? అవునని అనిపిస్తుంది ఈ అస్థిపంజరాల నది గురించి తెలిస్తే.. గుట్టలుగుట్టలుగా అస్థిపంజరాలు, వారంతా ఎవరు ఎలా మరణించారని అన్ని కోణాలలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలే సరైన విషయం ఏదీ చెప్పలేకున్నారు. ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ అస్థిపంజరాల నది ఎక్కడుంది? ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 600 నుండి 800 వందల మంది అస్థిపంజరాలతో నిండిపోయి ప్రపంచ శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతున్న ఈ లేక్ గురించి పూర్తిగా తెలుసుకుంటే..
భారతదేశంలోని ఎత్తైన పర్వతాలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని త్రిసూల్ పర్వతం ఒకటి. దీన్నే నందా పర్వతం అంటారు. ఇది సముద్రమట్టానికి 5,029మీటర్ల ఎత్తులో ఉంది. దీనికి దిగువన లోయలో రూప్ కుండ్ సరస్సు ఉంది. ఈ సరస్సు మానవ అస్థిపంజరాలతో నిండిపోయి ఉండటం శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
ఎప్పుడు బయటపడిందంటే..
1942సంవత్సరంలో బ్రిటీష్ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు పెట్రోలింగ్ కు వెళ్ళినప్పుడు ఈ అస్థిపంజరాల నది బయటపడింది. సంవత్సరంలో కేవలం జులై, సెప్టెంబర్ నెలలలో మాత్రమే ఈ సరస్సు కరుగుతుంది. ఆ సమయంలో వందలకొద్ది అస్థిపంజరాలు, కుళ్ళిపోయిన మానవ శరీరాల మాంసంతో ఈ సరస్సు ఎంతో భయంకరంగా ఉంటుంది.
ఎవరివి ఈ అస్థిపంజరాలు..
ఈ అస్థిపంజరాలు ఎవరివి ఏంటి అనే విషయం చాలా మిస్టరీగా ఉంది ఇప్పటికీ. అస్థిపంజరాల మీద పరిశోధనలు చేసినప్పుడు వారు ఏ కారణంతో చనిపోయారు అనే విషయం స్పష్టంగా తెలీలేదు. మరణించిన వారందరూ కేవలం కుటుంబానికో ప్రాంతానికో చెందినవారు కాదని తెలిసింది. యుద్దకారణంగా మరణం సంభవించి ఉంటే అక్కడ ఏవైనా ఆయుధాలు దొరికేవి, కానీ అక్కడ ఎలాంటి ఆయుధాలు దొరకలేదు. జబ్బు చేసి మరణించిన ఆనవాళ్ళు ఎక్కడా లేవు. మరొక విషయం ఏమిటంటే అందరూ పెద్దవాళ్ళే.. వాళ్ళలో 35 నుండి 40 సంవత్సరాల వారు అధికశాతం మంది ఉన్నారు. చిన్నపిల్లలు ఒక్కరు కూడా లేరు. వయసైన మహిళలు కొందరు ఉన్నట్టు తెలిసింది. అయితే అక్కడ మరణించినవారు చాలా పొడవు ఉన్నవారని పరిశోధనల్లో తెలిసింది. ఈ మరణాలు అన్నీ సుమారు 1200 సంవత్సరాల కిందట సంభవించినట్టు ఆధారాలు చెబుతున్నాయి.
ఇంతకీ వీళ్ళు ఎవరు??
దీని మీద విభిన్న అభిప్రాయాలు చెబుతున్నవాళ్ళు ఉన్నారు. కొందరేమో భారతదేశానికి చెందిన ఒకరాజు తన భార్య, పరివారంతో కలసి ప్రయాణం చేస్తుండగా మంచుతుఫాను సంభవించిందని, దానివల్ల వాళ్ళందరూ మరణించారని చెబుతున్నారు. మరికొందరు ఏమో 1841సంవత్సరంలో టిబెట్ పై దండయాత్రకు ప్రయత్నించిన భారతదేశ సైనికుల అస్థిపంజరాలని అంటున్నారు. అంటువ్యాధి ప్రబలి చనిపోయినవారిని తెచ్చి ఇక్కడ సమాధి చేశారని మరికొందరు అంటున్నారు. కానీ వీటి గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదు.
కథ నిజమేనా..
ఇక్కడి నివాస ప్రాంతాలలో ఒక కథ ప్రచారంలో ఉంది. నందాదేవిని ఇక్కడ దేవతగా కొలుస్తారు. భారతదేశంలో ఎత్తైన పర్వతాల్లో ఇది రెండవది. ప్రకృతిలో భాగమైన దేవతాస్వరూపానికి కోపం తెప్పించడం వల్ల వైపరీత్యాలు సంభవించాయని, అక్కడ నమోదు అయిన మరణాలకు కారణం అదేనని అంటున్నారు కొందరు. అయితే ఈ కథనాలు అన్నీ ప్రజలు కల్పించినవని కొట్టిపడేస్తున్నారు. లభ్యమైన అస్థిపంజరాలకు డి.యన్.ఏ టెస్ట్ చెయ్యగా వారందరూ దక్షిణాసియా ప్రాంతానికి చెందినవారని తేలింది. అంతేకాకుండా వీరందరూ ఒకేసారి మరణించినవారు కాదని అక్కడ సంభవించిన మరణాలు 7వ శతాబ్దంలో ఒకసారి, 10వశతాబ్దంలో మరొకసారి చోటుచేసుకున్నాయని పరిశోధనల్లో తెలిసింది.
మరొక ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే 17, 20 శతాబ్దాల మధ్య ఆ సరస్సులో రెండు సమూహాలకు చెందిన అస్థిపంజరాలు కనిపించాయి. వీరు తూర్పు ఆసియాకు సంబంధించినవారు ఒకరు కాగా.. తూర్పు మధ్యధరా ప్రాంతానికి చెందినవారు 14మంది ఉన్నారు. వీళ్ళు ఏ కారణంతో మరణించారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.
నిజమేంటో..
ఈ మరణాల వెనుక నిజమేంటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎక్కువశాతం మంది మాత్రం తీర్థయాత్ర కారణంగానే వీరి మరణాలు సంభవించి ఉంటాయని భావిస్తున్నారు. కానీ అక్కడ 19వ శతాబ్దం వరకు ఎలాంటి తీర్థయాత్రలకు సంబంధించిన విషయాలు బయటపడలేదని అంటున్నారు. ఈ ప్రాంతంకు దగ్గరలో ఉన్న దేవాలయాలలో మాత్రం 8,10శతాబ్దాలకు చెందిన శాసనాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎన్ని చెబుతున్నా అవన్నీ అభిప్రాయాలు అవుతున్నాయి కానీ నిజాలేంటనేది తెలియడం లేదు. దీంతో ఈ అస్థిపంజరాల సరస్సు మిస్టరీ సరస్సుగా మారిపోయింది. టూరిస్ట్ లు దీన్ని అలాగే పిలుస్తున్నారు.
Updated Date - 2023-02-12T22:36:14+05:30 IST