నన్ను, నా మూడేళ్ల కొడుకును ఒకే చితిపై కాల్చండి.. ఇద్దరికీ ఒకే సమాధి కట్టండి.. ఇదీ ఓ తండ్రి రాసిన లేఖ.. చివరకు ఊహించని ట్విస్ట్..!
ABN, First Publish Date - 2023-04-10T19:04:27+05:30
నాకూ నా కొడుకుకూ ఓకే సమాధి కట్టిండి అంటూ తండ్రి లేఖ.. షాకింగ్ ఉదంతం..
ఇంటర్నెట్ డెస్క్: రక్తపుమడుగులో తండ్రి కొడుకులు పడి ఉన్నారంటూ పోలీసులకు ఫోన్ అందింది. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఓ మూడేళ్ల చిన్నారి నిర్జీవంగా కనిపించాడు. అతడి గొంతుపై కత్తిగాటు. ఆ పక్కనే తండ్రి కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడి మెడపైనా కత్తిగాయం కనిపించింది. వారిద్దరినీ పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే మరణించినట్టు వైద్యులు తేల్చారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ఘటనా స్థలంలో పోలీసులకు ఓ సూసైడో నోట్ కూడా కనిపించింది. ‘‘నన్ను, నా మూడేళ్ల కొడుకును ఒకే చితిపై కాల్చండి.. ఇద్దరికీ ఒకే సమాధి కట్టండి..’’ అని రాసిపెట్టింది ఉంది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా కేసులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన గణేశ్, కాజల్ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. మద్యానికి బానిసైన గణేశ్ తరచూ తాగి ఇంటికి వచ్చే వాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తాగుడు మానేయాలన్నందుకు భార్యపై గణేశ్ చేయి చేసుకుంటుండేవాడు. చివరకు హనుమాన్ జయంతి రోజున కుటుంబసభ్యులందరూ దైవరాధనలో ఉండగా గణేశ్ తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. భర్త తీరుతో విసిగిపోయిన ఆమె చివరకు ఇల్లు విడిచి వెళ్లిపోయింది.
నాటి నుంచి గణేశ్, తన కొడుకుతో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలోనే అతడు తీవ్రమైన డిప్రెషన్లో కూరుకుపోయాడు. చివరకు ఇటీవల ఓ రోజును కన్నకొడుకును నిర్దాక్షిణ్యంగా కడతేర్చి తాను ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. చేజేతులా తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటూ అన్నెంపున్నెం ఎరుగని తన కుమారుడిని కూడా బలితీసుకున్న గణేశ్ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Updated Date - 2023-04-10T19:04:27+05:30 IST