Viral News: ‘మీ అమ్మకు మళ్ళీ పెళ్లి ఎందుకు చేయకూడదు’ అని మంచి కోరే మనిషి ఒకరు అనడంతో..
ABN, First Publish Date - 2023-03-20T14:36:33+05:30
ఆ సినిమాలో తండ్రికి పెళ్ళి చేస్తే.. ఇక్కడ తల్లికి ఎదిగిన కొడుకులు మళ్ళీ పెళ్ళి చేశారు.
అమ్మకు మళ్ళీ పెళ్ళి చేయాలనుకోవడం ఆ ఆలోచనే కాస్త విచిత్రంగా ఉన్నా కూడా ఆమధ్య కాలంలో వచ్చిన 'మానాన్నకు పెళ్ళి' సినిమాలో ఎదిగిన కొడుకు వెతికి వెతికి తన తండ్రికి మళ్ళీ పెళ్ళి చేస్తాడు. అచ్చం అలానే తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోతే.. ఆ సినిమాలో తండ్రికి పెళ్ళి చేస్తే.. ఇక్కడ తల్లికి ఎదిగిన కొడుకులు మళ్ళీ పెళ్ళి చేశారు. నిజ జీవితానికి ఇలాంటి విషయాలు అఫ్లయ్ కాకపోవచ్చు. కానీ మనిషి ఒక్కసారి ఈ అడ్డుగోడల్ని తీసి పక్కన పెట్టేస్తే.. ప్రతి ఒక్కరి జీవితం ఒక గొప్ప సినిమాను తలపిస్తుంది. ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ కథ కూడా అలాంటి ఓ సినిమానే.. కాకపోతే ఇదో తల్లి కథ.. తన తల్లికి కూడా ఓ తోడుండాలని ఇద్దరు బిడ్డలు తీసుకున్న సంచలనాత్మక కథ ఇది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడుకి చెందిన కల్లకురిచి జిల్లా వలయంపట్టు గ్రామం, ఆమె సెల్వి, తనకు ఇద్దరు కొడుకులు, భర్త చనిపోయాకా ఒంటరిగా ఉంటున్న సెల్వి కొడుకుల్ని చూసుకునే బ్రతుకుతుంది. ఎవరో అన్నమాట ఆ కొడుకుల్ని ఆలోచించేలా చేసింది. జీవితం అంతా ఒంటరిగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? మీ అమ్మకు మళ్ళీ పెళ్ళి ఎందుకు చేయకూడదు అనే మాటతో వాళ్ళు అదే ఆలోచించారు. ఆచరణలో పెట్టారు. పెద్దకొడుకు ఈ విషయాన్నే కాస్త సీరియస్‌గా తీసుకున్నాడు. నా తల్లికి ఎందుకు మళ్ళీ పెళ్ళి చేయకూడదు అనుకున్నాడు. ఎంత చదివినా, ఎంత గొప్పగా బ్రతికినా సమాజానికి ఎప్పుడూ మనిషి భయపడుతూనే ఉంటాడు. ఇలాంటి ఆలోచనలను సమాజం ఎలా తీసుకుంటుందోననే భయం కొడుకు భాస్కర్‌ని కూడా వదలలేదు. తన ఆలోచనని తమ్ముడు వివేక్‌తో కూడా చెప్పాడు. అతనికీ ఆ సంగతి నచ్చింది. కానీ తల్లిని ఒప్పించడం ఎలా? తల్లి కొడుకు పెళ్ళి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుంటేనే నేను పెళ్ళి పీటలెక్కుతానని వాదించేవాడు భాస్కర్.
ఈ మాట మొదటిసారి విన్నప్పుడు సెల్వి ఆశ్చర్యపోయింది. తరచుగా ఆ కొడుకులిద్దరూ అదే పనిగా పెళ్ళి సంగతి ప్రస్తావించడంతో ఆలోచించి చివరికి సరేనంది. అయితే సమాజం నుంచి వచ్చిన వ్యతిరేకత సెల్విలో మరింత బలంగా మారేలా చేసింది. "నాలా భర్తలను పోగొట్టుకున్న మరికొందరు నన్ను చూసి ధైర్యంగా అడుగువేయాలి. కొత్త జీవితాన్ని స్వాగతించాలని ఆలోచించింది" సెల్వి. సమాజం కట్టుబాట్లను వ్యతిరేకించింది. భర్త చనిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నవారు ఒక్కరూ లేరు. ఇప్పుడు మాత్రం సలహాలు ఇస్తున్నారు. అనుకుంది.
ఇది కూడా చదవండి: ఇంట్లోంచి వెళ్ళే ముందు ఈ శకునాలు చూస్తున్నారా? దారిలో ఇవి కనిపిస్తే అశుభం జరుగుతుందట..!
అయితే తల్లికి పెళ్ళి చేస్తామని, వరుడి కోసం పిల్లలు వెతుకుతుంటే వాళ్లను చూసి చాలామంది నవ్వుకునేవారు. అయినా సరే పట్టుదల వదలలేదు వివేక్, భాస్కర్.
మగాడైతే పెళ్ళాం చనిపోయిన రెండో నెలకే మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు, అదే ఆడదైతే పెళ్ళి ఊసే ఎత్తకూడదు. ఇదే సమయంలో వరుడు కావాలని తిరుగుతున్న వాళ్ళకు ఓ వరుడు దొరికాడు. వరుడు రైతుకూలీ ఏలుమలై, ఆ పెళ్ళికి సెల్వి బంధువులు ఎవరూ రాలేదు. అయినా సరే వాళ్ళు అనుకున్నది చేశారు. తల్లికి ఘనంగా మళ్ళీ పెళ్ళి చేశారు. తండ్రిని కోల్పోయి, పోషించేవాడు లేక సెల్వి కుటుంబంలో అంతా కుంగిపోయిన నాడు మేమున్నామని ఒక్కరూ రాలేదు. కానీ కొత్త జీవితంలోకి వెళుతుందని తెలిసి వెలేయాలని చూశారు. "అలాంటి వాళ్ళకన్నా నా కడుపున పుట్టిన బిడ్డలు నాకు దేవుళ్ళతో సమానం" అని సంతోషించింది సెల్వి.
Updated Date - 2023-03-20T14:59:03+05:30 IST