High Court: నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. రద్దు చేయండంటూ హైకోర్టుకెళ్లిన కుర్రాడు.. చివరకు సంచలన తీర్పు..!
ABN, First Publish Date - 2023-11-23T21:03:32+05:30
యువతి నుదుటన బలవంతంగా కుంకుమ పెట్టిస్తే పెళ్లి జరిగినట్టు కాదని పట్నా హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: యువతి నుదుటిపై బలవంతంగా కుంకుమ పెట్టించి తనకు పెళ్లి చేశారంటూ కోర్టును ఆశ్రయించాడో వ్యక్తి. వివాహాన్ని రద్దు చేయాలని అభ్యర్థించాడు. పదేళ్ల క్రితం తన పెళ్లి తంతు జరిగిన తీరు గురించి సవివరంగా చెప్పుకొచ్చాడు. పిటిషనర్ భార్య కూడా తన వాదన వినిపించింది. ఇరు వర్గాల వాదనలూ విన్న న్యాయస్థానం అతడి పెళ్లి రద్దు చేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. హిందూ వివాహ చట్టం ప్రకారం స్త్రీపురుషుల పరస్పర అంగీకరాంతో, సప్తపది పూర్తి అయ్యాకే వారికి వివాహం జరిగినట్టు భావించాలని(saptapadi important for union to be recognised) స్పష్టం చేసింది. పట్నా హైకోర్టు (Patna High Court) ముందుకొచ్చిన ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..
పిటిషనర్ రవి కాంత్ తెలిపిన వివరాల ప్రకారం, 2013లో అతడికి లఖీసరాయ్ ప్రాంతంలో మరో యువతితో బలవంతంగా పెళ్లి జరిగింది. అప్పట్లో రవికాంత్ తన బంధువుతో కలిసి ఓ గుడికి వెళ్లగా యువతి తరపు వారు వచ్చి వారిద్దరి బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆ తరువాత అతడిని తుపాకీతో బెదిరిస్తూ యువతి నుదురుపై కుంకుమ పెట్టించి పెళ్లైపోయిందని తేల్చి చెప్పారు. దీంతో, బాధితుడు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు అతడి కంప్లెయింట్ తీసుకునేందుకు నిరాకరించారు. చివరకు అతడు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. చివరకు కేసు ఫ్యామిలీ కోర్టుకు చేరింది. అయితే, పెళ్లి రద్దు చేయాలన్న అతడి అభ్యర్థనను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది.
తాజాగా ఈ కేసు పట్నా హైకోర్టు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం హిందూ వివాహ చట్టానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో జరిగే వివాహానికే చట్టప్రకారం గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది. వివాహ క్రతువులో ముఖ్యభాగమైన సప్తపది పూర్తయ్యాకే పెళ్లి జరిగినట్టు భావించాలని పేర్కొంది. రవికాంత్ పెళ్లి జరిపించిన పురోహితుడు ఆ వివాహం ఎక్కడ జరిపించిందీ, సప్తపది పూర్తయ్యిందీ లేనిదీ గుర్తు తెచ్చుకోలేకపోయినట్టు పేర్కొంది. ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు పొరపాటు పడిందని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Viral: షాకింగ్ వీడియో! భర్త వద్ద బైక్ నేర్చుకుంటున్న మహిళ..అతడు వెనక నుంచి అరుస్తున్నా వినకుండా..
Trees on Dividers: రోడ్డుకు మధ్యలో చెట్లు ఎందుకు పెంచుతారో తెలిస్తే..
Updated Date - 2023-11-23T21:03:35+05:30 IST