తాళి కట్టే సమయానికి వరుడి పరిస్థితి చూసి నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళిన వధువు.. అతను ఏం చేశాడంటే..
ABN, First Publish Date - 2023-03-12T11:42:43+05:30
భర్తంటే బాద్యతకు మారుపేరుగా ఉండాలని, ప్రేమకు నిర్వచనంలా ఉండాలని అనుకుంటారు అందరూ.. కానీ ఓ అమ్మాయికి మాత్రం
ప్రతి ఆడపిల్ల పెళ్ళి గురించి ఎన్నో కలలు కంటుంది. మూడు ముళ్ళు వేసి చిటికెన వేలు పట్టుకుని తనను అత్తారింటికి తీసుకెళ్ళే వరుడు జీవితాంతం ఆ చేయిని వదలకూడదని కోరుకుంటుంది. భర్తంటే బాద్యతకు మారుపేరుగా ఉండాలని, ప్రేమకు నిర్వచనంలా ఉండాలని అనుకుంటారు అందరూ.. కానీ ఓ అమ్మాయికి మాత్రం తన పెళ్లిలో దారుణమైన అనుభవం ఎదురయ్యింది. మూడు ముళ్ళు వెయ్యాల్సిన వరుడు పెళ్ళిపీట పైనే గుర్రుపెట్టి నిద్రపోయాడు.. లేపడానికి ప్రయత్నం చేస్తే ఎంతకూ లేవకపోవడంతో పెళ్ళిమండపంలో అందరూ నివ్వెరపోయారు. అతను ఎందుకు నిద్రపోయాడో అర్థమయ్యాక.. అమ్మాయి పెళ్ళికూతురి గెటప్ లోనే నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళింది. వరుడిమీదనే కాకుండా అతని కుటుంబ సభ్యులు, అతని తరపు బంధువుల పైన కూడా పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
అస్సాం రాష్ట్రం నల్బరి జిల్లాకు చెందిన అమ్మాయికి, ప్రసేన్ అనే వ్యక్తితో పెళ్ళి నిశ్చయమైంది. వీరిద్దరి పెళ్ళి నల్బరిలో ఓ పెళ్ళిమండపంలో జరిపడానికి ఏర్పాట్లు చేశారు. పెళ్ళిరోజు వరుడు పెళ్ళిమండపం చేరుకున్నాడు. అయితే కారు దిగి రావడానికి కూడా అతని శరీరం సహకరించలేదు. అతను పీకలదాకా తాగి ఉండటంతో అతని శరీరం స్వాధీనం తప్పింది. ఆ కారణంతో ప్రసేన్ ను అతని తండ్రి కారులోంచి దింపి తన భుజాల మీద వేసుకుని వచ్చి పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టాడు. పెళ్ళి తంతు జరుగుతుండగా అమ్మాయిని తీసుకొచ్చి అతని పక్కన కూర్చోబెట్టారు. తలవంచుకుని పెళ్ళితంతు చేస్తున్న వధువు అబ్బాయిని గమనించలేకపోయింది. మూడుముళ్ళు వెయ్యాల్సిన సమయానికి ప్రసేన్ పెళ్ళికూతురు పక్కనే పెళ్ళిపీటల మీదనే నిద్రపోయాడు. దీంతో పెళ్ళికూతురు కోపం నషాళానికి ఎక్కింది. తప్పతాగిన ఇతనితో నేను తాళి కట్టించుకోను అని తెగేసి చెప్పింది.
అంతటితో ఆగకుండా ఆమె నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళి వరుడి మీద అతని కుటుంబ సభ్యుల మీద కంప్లైంట్ ఇచ్చింది. వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా తప్పతాగి వచ్చారని, అయినా వాళ్ళను తాము ఏమీ అనలేదని పెళ్ళికూతురు చెప్పింది. కానీ తాళి కట్టాల్సిన వరుడే అంతగా మద్యానికి బానిసై, కనీసం పెళ్ళి చేసుకోవాల్సిన సమయంలో కూడా బాధ్యతగా లేకుండా అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటాడంటూ అతని మీద ఫైర్ అయింది. పెళ్ళికోసం తాము చేసిన ఖర్చు మొత్తం పైసాతో సహా తమకు చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె మాటలను గౌరవించి ఆమె తల్లిదండ్రులు కూడా పోలీసుల ముందు అదే డిమాండ్ చేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు 'పెళ్ళి ఆగిపోతే ఆడపిల్ల జీవితం నాశమవుతుందని అనుకోవడం మూర్ఖత్వం. పరువు కోసం మనసు చంపుకుని పెళ్ళిచేసుకుని జీవితాంతం బాధపడటం కంటే ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం చాలా మంచిది' అని ఆమెను సమర్థించారు.
Updated Date - 2023-03-12T11:42:43+05:30 IST