USA: ఎయిర్‌పోర్టులో పోయిన సూట్‌కేస్ 4 ఏళ్ల తరువాత దొరికింది.. తెరిచి చూస్తే..
ABN, First Publish Date - 2023-01-14T20:05:05+05:30
విమానాశ్రయంలో నాలుగేళ్ల క్రితం పోయిన ఓ సూట్‌కెస్ ఇన్నాళ్లకు లభించడంతో ఓ అమెరికా మహిళ ఆశ్చర్యపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: విమానాశ్రయంలో నాలుగేళ్ల క్రితం పోయిన ఓ సూట్‌కెస్ ఇన్నాళ్లకు లభించడంతో ఓ అమెరికా మహిళ(USA woman) ఆశ్చర్యపోయారు. పెట్టె తెరిచినప్పుడు కనిపించిన దృశ్యంతో ఆమె అవాక్కయ్యారు. తనకు ఎదురైన అనుభవం గురించి వివరిస్తూ ఓరేగాన్ రాష్ట్రానికి(Oregon) చెందిన ఏప్రిల్ గెవిన్ ఇటీవల టిక్‌టాక్‌లో పలు వీడియోలు పెట్టారు. 2018లో ఏప్రిల్ గెవిన్ తన బిజినెస్ ట్రిప్ ముగించుకుని యూనైటెడ్ ఎయిర్‌లైన్స్(United Airlines) విమానంలో చికాగో(Chicago) నుంచి తిరిగొస్తుండగా సూట్‌కేసు పోయింది. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో కంపెనీ ఆమెకు పాక్షికంగా నష్ట పరిహారం చెల్లించింది. ఇటీవల ఎయిర్‌లైన్స్ వారు ఆమెకు ఫోన్ చేసి సూట్‌కేసు దొరికిందని చెప్పారు.
టెక్సాస్‌లోని హ్యూస్టన్ నగర ఎయిర్ పోర్టులో దాన్ని కనుగొన్నట్టు వివరించారు. అంతేకాకుండా.. మధ్య అమెరికా దేశమైన హాండురస్(Honduras) నుంచి హ్యూ్స్టన్‌కు చేరుకున్నట్టు తెలిపారు. ఏప్రిల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అసలు.. హాండురస్‌లో సూట్‌కేక్ ఎలా బయటపడిందో తెలీక ఒకింత అయోమయానికి గురయ్యారు. ‘‘హాండూరస్‌లో బయటపడిందట. అక్కడి నుంచి సూట్‌కేస్ టెక్సాస్ చేరుకున్నాక సిబ్బంది నాకు సమాచారం అందించారు. అసలు ఆ సూట్‌కేసు ఇంకా ఏయే దేశాల్లో చెక్కర్లు కొట్టిందో’’ అని ఆమె వీడియోలో కామెంట్ చేశారు. అయితే.. సూట్‌కేసు తెరిచి చూడగా వస్తువులన్నీ ఉండటంతో ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది.
Updated Date - 2023-01-14T20:05:06+05:30 IST