Woman: ఆమె పిల్లల్ని కనలేదు.. గర్భం దాల్చలేదు.. కోర్టుకు తేల్చిచెప్పిన మెడికల్ టీమ్.. భర్త బెయిల్ కేసులో..!
ABN, First Publish Date - 2023-11-24T17:57:35+05:30
తల్లికావాలనుకుంటున్న ఓ మహిళ.. జైల్లో ఉన్న తన భర్తకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి ఏర్పాటైన ఓ మెడికల్ కమిటీ..మహిళకు పిలల్ని కనే వయసు దాటిపోయిందని పేర్కొంది. అయితే, తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 18కి వాయిదా వేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వయసు పైబడ్డ మహిళ..జైల్లో ఆమె భర్త! కానీ తల్లికావాలనుకున్న ఆమె, భర్తకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం మాత్రం మహిళ భర్తకు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది. మహిళకు పిల్లల్ని కనే వయసు దాటిపోయిందని పేర్కొంది. అయితే, పిటిషనర్ ఆరోగ్య స్థితిని తేల్చేందుకు కోర్టు చివరకు ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు (MP High Court) ముందుకొచ్చిన ఈ ఆసక్తికర కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..
సంతానభాగ్యం పొందాలనుకున్న ఓ మహిళ తన భర్తకు బెయిల్ కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఆమె భర్త క్రిమినల్ కేసులో జైలు పాలయ్యాడు. కాగా, సంతానం కోసం ప్రయత్నించడం ప్రాథమిక హక్కుల్లో ఒకటి అని మహిళ తరపు లాయర్ వాదించారు. ఈ దిశగా సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావించారు. మహిళకు తల్లయ్యే అవకాశాన్ని ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు(Women seeks bail for husband for procreation).
మరోవైపు, మహిళ పిటిషన్‌పై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మెనోపాస్ కారణంగా ఆమె సహజసిద్ధంగా లేదా కృత్రిమ గర్భదారణ పద్ధతుల్లో పిల్లల్ని కనే వయసు దాటిపోయిందని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. కానీ, ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతూ మహిళ అఫిడవిట్ దాఖలు చేసింది. తనకు పిల్లల్ని కనే సామర్థ్యం ఉందని గట్టిగా వాదించింది.
ఇరు వర్గాల వాదనలూ విన్న న్యాయస్థానం..మహిళ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ వైద్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ముగ్గురు గైనకాలజిస్టులు, ఒక సైకియాట్రిస్ట్, ఓ ఎండోక్రైనాలజిస్టు ఉన్న ఈ కమిటీ ఇటీవలే కోర్టుకు నివేదిక సమర్పించింది. పిటిషనర్‌కు పిల్లల్ని కనే వయసు దాటిపోయిందని వెల్లడించింది. అయితే, కమిటీ రిపోర్టును పరిశీలించేందుకు కొంత సమయం ఇవ్వాలని మహిళ తరపు న్యాయవాది కోరడంతో న్యాయస్థానం కేసును డిసెంబర్ 18 వరకూ వాయిదా వేసింది.
Updated Date - 2023-11-24T17:57:38+05:30 IST