Chandrayaan-3: ఎన్నో తీపి గుర్తుల్ని మిగిల్చిన చంద్రయాన్-3!
ABN, Publish Date - Dec 21 , 2023 | 04:48 PM
2023 సంవత్సరం భారత్‌కు ఎన్నో తీపి గుర్తులు మిగిల్చింది. చంద్రయాన్-3 విజయం మాత్రం అపూర్వం
ఇంటర్నెట్ డెస్క్: మరి కొన్ని రోజుల్లో ఈ ఏడు కాలగర్భంలో కలిసిపోనుంది. కొందరికి మోదం మరికొందరికి ఖేదం కలిగించిన ఏడాది ఇది. అయితే, అంతరిక్ష రంగంలో భారత్‌కు ఈ ఏడాది తీపి గుర్తుగా మిగిలిపోతుంది. చంద్రయాన్-3తో (Chandrayaan -3) ఇస్రో (ISRO) అద్భుత విజయాన్ని అందుకున్న సంవత్సరంగా చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. ఇస్రో విజయం భారతీయులనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. యూట్యూబ్ సీఈఓ నుంచి స్పేస్ ఎక్స్ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ వరకూ ఇస్రో విజయానికి ఎందరో ప్రముఖులు అబ్బుర పడ్డారు. ఈ ప్రయోగం అసాధారణమంటూ కీర్తించారు. 2023 ముగింపునకు వచ్చిన తరుణంలో ఇస్రోపై ప్రశంసలను మరోమారు నెట్టింట వైరల్‌గా మారాయి.
వైరల్‌గా మారిన ఎలాన్ మస్క్ ప్రశంస..
చంద్రయాన్-3 విజయంపై తొలుత మాజీ జర్నలిస్టు సిండీ పామ్ (Cindy pom) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇంటర్‌స్టెల్లార్ సినిమా బడ్జెట్ (165 మిలియన్ డాలర్లు) కంటే తక్కువ ఖర్చుతో (75 మిలియన్‌లు) ఇస్రో ఈ ప్రయోగం చేపట్టిందని తెలిసి మతిపోయింది’’ అని సిండీ కామెంట్ చేశారు. దీనికి మస్క్ వెంటనే సమాధానం ఇచ్చారు. భారత్‌కు ఇది లాభిస్తుందని కామెంట్ చేశారు. స్పెస్ ఎక్స్ సంస్థ అధినేతగా ప్రైవేటు అంతరిక్ష రంగంలో అసాధారణ విజయాలు అందుకున్న ఎలాన్ మస్క్ (Elon Musk) ఇస్రోను ప్రశంసించడం నెట్టింట బాగా వైరల్ అయ్యింది.
యూట్యూబ్ సీఈఓ (Youtube CEO) కూడా చంద్రయాన్‌పై పొగడ్తలు కురిపించారు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ వేదికగా 8 మిలియన్ల మంది వీక్షించిన అంతరిక్ష ప్రయోగంగా చంద్రయాన్-3 అరుదైన ఘనత దక్కించుకుందని పేర్కొన్నారు.
జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని షేర్ చేస్తూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపింది. దక్షిణ ధ్రువానికి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్ దిగిందని పేర్కొంది. జాబిల్లిపై కాలిడిన తరువాత 14 రోజుల పాటు ప్రజ్ఞాన్ రోవర్ రకరకాల ప్రయోగాలు నిర్వహించింది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన విలువైన సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది.
Updated Date - Dec 22 , 2023 | 07:49 PM