Glenn Maxwell: చరిత్ర సృష్టించిన మ్యాక్స్‌వెల్.. వన్డే వరల్డ్‌కప్‌లో ఇదే మొదటిసారి.. ఊచకోత కోశాడు
ABN, First Publish Date - 2023-10-25T19:08:32+05:30
విధ్వంసకర ఆటగాడిగా పేరొందిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తాజాగా వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊచకోత కోశాడు. అరుణ్ జైట్లీ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతగాడు..
విధ్వంసకర ఆటగాడిగా పేరొందిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తాజాగా వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊచకోత కోశాడు. అరుణ్ జైట్లీ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతగాడు.. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ (101 పరుగులు) చేశాడు. అది కూడా 252.20 స్ట్రైక్ రేట్‌తో! దీంతో.. వరల్డ్ కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా మ్యాక్స్‌వెల్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ సౌతాఫ్రికా వైస్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ పేరిట ఉండేది. ప్రస్తుత వరల్డ్‌కప్ మెగాటోర్నీలోనే అతగాడు 49 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డ్‌ని మ్యాక్స్‌వెల్ పటాపంచలు చేశాడు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో భాగంగా.. వార్నర్ ఔట్ అయిన తర్వాత మ్యాక్స్‌వెల్ మైదానంలోకి వచ్చాడు. తాను క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. దీంతో.. తొలి 27 బంతుల్లో అతడు అర్థశతకం పూర్తి చఏశాడు. ఆ తర్వాత అతడు మరింత జోరు పెంచేశాడు. ఎడాపెడా షాట్లతో డచ్ బౌలర్లతో ఓ ఆటాడుకున్నాడు. వాళ్లు ఎలాంటి బంతులు వేసినా సరే.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని, బౌండరీ లైన్ దాటించేశాడు. బాస్ డీ లీడే వేసిన 49వ ఓవర్‌లో అయితే మ్యాక్స్‌వెల్ విశ్వరూపం ప్రదర్శించాడు. తొలి ఐదు బంతుల్లో వరుసగా 4,4,6,6,6 బాదేశాడు. దాంతో.. అతడు 40 బంతుల్లోనే సెంచరీ మార్క్ (101)ని అందుకున్నాడు.
ఒకసారి టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీల జాబితా చూసుకుంటే..
* గ్లెన్ మ్యాక్స్‌వెల్ - 40 బంతుల్లో (2023)
* ఎయిడెన్ మార్కరమ్ - 49 బంతుల్లో (2023)
* కెవిన్ ఓబ్రెయిన్ - 50 బంతుల్లో (2011)
* గ్లెన్ మ్యాక్స్‌వెల్ - 51 బంతుల్లో (2015)
* ఏబీ డీవిలియర్స్ - 52 బంతుల్లో (2015)
Updated Date - 2023-10-25T19:08:32+05:30 IST