IPL 2023: పాపం ఢిల్లీ.. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమి
ABN, First Publish Date - 2023-04-15T19:39:22+05:30
సొంత మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు చెలరేగింది. ఢిల్లీ
బెంగళూరు: సొంత మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు చెలరేగింది. ఢిల్లీ కేపిటల్స్(DC)ను చిత్తుగా ఓడించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ రాణించిన బెంగళూరు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక, ఢిల్లీ కేపిటల్స్‌కు ఇది వరుసగా ఐదో పరాజయం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించిన ఢిల్లీ ప్రత్యర్థిని 174 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం 175 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వార్నర్ సేనకి తొలి ఓవర్ నుంచే వరుస షాకులు మొదలయ్యాయి. బెంగళూరు బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు క్రీజులో నిలవలేకపోయిన ఢిల్లీ బ్యాటర్లు వికెట్లు అప్పనంగా సమర్పించేసి వెళ్లిపోయారు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
ఢిల్లీ జట్టులో మనీష్ పాండే మాత్రం కాసేపు బెంగళూరు బౌలర్లను ఎదురొడ్డాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 19, అక్షర్ పటేల్ 21, అమన్ హకీం ఖాన్ 18, అన్రిక్ నోకియా 23 (నాటౌట్) పరుగులు చేశారు. జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ మూడు వికెట్లు తీసుకోగా, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ మరోమారు అర్ధ సెంచరీ (50)తో విరుచుకుపడగా, కెప్టెన్ డుప్లెసిస్ 22, లోమ్రోర్ 26, మ్యాక్స్‌వెల్ 24, షాబాజ్ అహ్మద్ 20 (నాటౌట్), అనూజ్ రావత్ 15(నాటౌట్) పరుగులు చేశారు. కాగా, ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరుకు ఇది రెండో విజయం కాగా, ఢిల్లీ ఆడిన ఐదు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది.
Updated Date - 2023-04-15T19:39:28+05:30 IST