IPL2023: ఐపీఎల్‌లో ఆడుతున్న ఈ ఐదుగురూ టీమిండియా స్టార్లుగా మారినా ఆశ్చర్యం లేదు!.. ఎవరెవరంటే..
ABN, First Publish Date - 2023-05-02T19:03:08+05:30
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన, అత్యంత
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన, అత్యంత ఘనమైన టీ20 లీగ్‌గా ప్రసిద్ధికెక్కింది. ఈ రిచ్చెస్ట్ లీగ్ ద్వారా ఎంతోమంది స్థానిక ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. ప్రతి ఏడాది కొత్తకొత్త ఆటగాళ్లు మెరుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను కట్టిపడేస్తున్నారు. అంతేకాదు, తమ గురించి ప్రతీ క్రికెట్ అభిమాని చర్చించుకునేలా చేస్తున్నారు.
అవకాశాలకు అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌గా మారిన ఐపీఎల్‌లో అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా తళుక్కున మెరుస్తున్నారు. అలాగే, వివిధ దేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లతో ఆడుతున్న యువ ఆటగాళ్లు వారి నుంచి మెలకువలు నేర్చుకుని మరింత రాటుదేలుతున్నారు. ఐపీఎల్‌లో ప్రతిభ చూపుతున్న ఎంతోమంది స్థానిక ఆటగాళ్లు ఆ తర్వాత బీసీసీఐ దృష్టిలో పడి భారత జట్టులో చోటు సంపాదించుకున్నారు.
రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, పాండ్యా సోదరుల నుంచి అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ వరకు ఎంతోమంది నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను ఐపీఎల్ అందించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ సీజన్‌లో సత్తా చాటుతున్న ఐదుగురు ఆటగాళ్లు త్వరలోనే టీమిండియా క్రికెటర్లుగా కనిపిస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్)
ముంబై వీధుల్లో పానీపూరీ అమ్ముకుని ఆజాద్ మైదానంలోని టెంట్లలో ఖాళీ కడుపుతో పడుకునే యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఐపీఎల్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. ఇటీవలే ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల జైస్వాల్ తన బ్యాటింగ్‌తో బౌలర్లపై నిప్పులు చెరుగుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడి 428 పరుగులు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ ఫా డుప్లెసిస్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు జస్వాలే. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. సీజన్ ముగిసే సరికి మరిన్ని అద్భుతాలు చేసేలా కనిపిస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే బీసీసీఐ నుంచి పిలుపు ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది. కనీసం పొట్టి ఫార్మాట్‌లో అయినా అతడికి చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
తిలక్ వర్మ (ముంబై ఇండియన్స్)
ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ వర్మ (Tilak Varma)లో టాలెంట్ పుష్కలంగా ఉంది. హైదరాబాద్‌కు చెందిన ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండర్ ఈ సీజన్‌లో 8 మ్యాచుల్లో 152 స్ట్రైక్ రేట్‌తో 248 పరుగులు చేశాడు. బ్యాటింగులో అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు. చాలా సందర్భాల్లో జట్టుకు వెన్నెముకలా నిలిచి పరాజయాల నుంచి కాపాడాడు. కావాల్సినంత టాలెంట్ ఉన్న తిలక్ వర్మకి కూడా బీసీసీఐ పిలుపు ఖాయంగానే కనిపిస్తోంది.
సుయాశ్ శర్మ (కోల్‌కతా నైట్ రైడర్స్)
నిజానికి ఈ సీజన్ ప్రారంభానికి ముందు సుయాశ్ శర్మ (Suyash Sharma0 పెద్దగా పరిచయం లేని పేరు. ఇప్పుడీ స్పిన్నర్ పేరు తరచూ వినిపిస్తోంది. పోటీ క్రికెట్‌లో ఎలాంటి అనుభవం లేని సుయాశ్ ఈ సీజన్‌లో చక్కగా రాణిస్తున్నాడు. స్మార్ట్ బౌలింగుతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. 19 ఏళ్ల సుయాశ్ 8 మ్యాచుల్లో 9 వికెట్లు పడగొట్టి క్రికెటింగ్ సర్క్యూట్‌లో ప్రకంపనలు రేపాడు. ప్రస్తుతం కెరియర్ మొదటి దశలోనే ఉన్న సుయాశ్ ఇదే ప్రతిభను కొనసాగిస్తే ప్రపంచం అతడి గురించి మాట్లాడుకోవడం పక్కా.
రింకు సింగ్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
రింకు సింగ్.. ఇప్పుడీ పేరో సంచలనం. ఐపీఎల్‌లో ఓవర్ నైట్ సెన్షేషన్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్‌లో చివరి ఐదు బంతులను వరుసగా స్టాండ్స్‌లోకి తరలించి జట్టుకు చారిత్రక విజయాన్ని అందించిపెట్టాడు. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో రింకూ సింగ్ (Rinku Singh) పేరు ఓ సంచలనం. 25 ఏళ్ల రింకూ సింగ్ 9 మ్యాచుల్లో 270 పరుగులు చేశాడు. రింకు కూడా ఇప్పుడు బీసీసీఐ రాడార్‌లో ఉన్నాడు.
మయాంక్ మార్కండే (సన్ రైజర్స్ హైదరాబాద్)
ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన సమయంలో అవకాశాల కోసం ఎదురు చూసిన మయాంక్ మార్కండే (Mayank Markande) ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో సెటిలయ్యాడు. ఆరు మ్యాచుల్లో 6.41 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్‌కు చెందిన మయాంక్ ఈ సీజన్‌లో విజయవంతమైన బౌలర్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. భారత్ తరపున ఒకే ఒక్క టీ20 ఆడిన మయాంక్ ఇప్పుడు హైదరాబాద్‌కు ఆడుతూ తనలోని సత్తాను బయటపెడుతున్నాడు. ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ ఈ సీజన్‌లో పలువురు పలువురు స్టార్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. మయాంక్ కూడా సెలక్టర్ల దృష్టిలో పడినట్టే.
Updated Date - 2023-05-02T19:03:08+05:30 IST