Rahul Dravid: బీసీసీఐతో ముగిసిన కాంట్రాక్ట్.. రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-11-20T17:12:54+05:30
2011 తర్వాత టీమిండియా వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌లోకి వెళ్లడం, లీగ్ దశలో అఖండ విజయాలు నమోదు చేయడం చూసి.. ఈసారి భారత జట్టు తప్పకుండా వరల్డ్ కప్ గెలుస్తుందని క్రీడాభిమానులు బలంగా నమ్మారు. తీరా చూస్తే.. ఆ నమ్మకాల్ని భారత జట్టు వమ్ము చేసింది.
2011 తర్వాత టీమిండియా వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌లోకి వెళ్లడం, లీగ్ దశలో అఖండ విజయాలు నమోదు చేయడం చూసి.. ఈసారి భారత జట్టు తప్పకుండా వరల్డ్ కప్ గెలుస్తుందని క్రీడాభిమానులు బలంగా నమ్మారు. తీరా చూస్తే.. ఆ నమ్మకాల్ని భారత జట్టు వమ్ము చేసింది. ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓటమిపాలవ్వడంతో.. ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే కల మళ్లీ కలగానే మిగిలిపోయింది. ఇదే సమయంలో.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగిసింది. దీంతో.. ద్రవిడ్‌నే కోచ్‌గా కొనసాగిస్తారా? లేక మరొకరిని రంగంలోకి దింపుతారా? అనేది సస్పెన్స్‌గా మారింది.
బీసీసీఐ కాంట్రాక్ట్ ప్రకారం.. టీమిండియా హెడ్ కోచ్‌గా రెండేళ్ల పాటు రాహుల్ ద్రవిడ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. టీ20 వరల్డ్ కప్, ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ వంటి మూడు ప్రధాన పోటీలకు జట్టును సిద్ధం చేయడానికి బీసీసీఐ అతనికి రెండేళ్ల సమయం ఇచ్చింది. తన రెండేళ్ల కాలంలో ద్రవిడ్ ఐసీసీ టోర్నీలకు సంబంధించి రెండుసార్లు ఫైనల్స్‌కు, ఒకసారి సెమీస్‌కు జట్టును తీసుకెళ్లాడు. ఇక ఆసియా కప్‌లో అయితే జట్టు ఘనవిజయం సాధించింది. ఇప్పుడు వరల్డ్ కప్ ఓటమితో అతని కాంట్రాక్ట్ ముగియడంతో.. అతడే కొనసాగుతాడా? లేదా? అని క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన కాంట్రాక్ట్‌పై స్వయంగా ద్రవిడ్ స్పందించాడు.
‘‘నేను ఆ కాంట్రాక్ట్ గురించి అస్సలు ఆలోచించలేదు. అసలు అంత తీరికే లేదు. కేవలం వరల్డ్ కప్ టోర్నీపైనే ఎక్కువ దృష్టి సారించాను. ఇప్పుడే ఈ టోర్నీ ముగిసింది. ఒకవేళ సమయం ఉండుంటే ఆలోచించేవాడినేమో. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే దానిపై కూడా ఆలోచనల్లేవు. ఇక నా రెండేళ్ల పనితీరుపై ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా నేను పట్టించుకోను. నా బాధ్యతలను ఎలా నిర్వర్తించానన్నది నేనే స్వయంగా విశ్లేషించుకుంటాను. ఇలాంటి జట్టుతో పని చేసినందుకు చాలా గర్వపడుతున్నా. అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లతో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేనెంతో గౌరవంగా భావిస్తున్నా. ఈ జర్నీ మరిచిపోలేని అనుభూతి’’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చారు.
ఇక రోహిత్ శర్మ ఓ అద్భుతమైన నాయకుడని, ఈ వన్డే వరల్డ్ కప్‌లో అతడు భారత్‌ను అద్భుతంగా నడిపించాడని రాహుల్ ద్రవిడ్ కొనియాడాడు. మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ ఆటగాళ్లలో ఉత్తేజం నింపాడని.. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తక్షణమే అందుబాటులో ఉంటాని.. ప్రతి మ్యాచ్ కోసం ముందుగానే పక్కా ప్లానింగ్ వేసేవాడని చెప్పాడు. కానీ.. వరల్డ్ కప్ మెగా టోర్నీ ఫైనల్‌లో ఓడిపోవడంతో టీమిండియా ప్లేయర్లు నిరుత్సాహానికి గురయ్యారని.. ఒక కోచ్‌గా వారిని అలా చూడలేకపోయానంటూ ద్రవిడ్ భావోద్వేగానికి లోనయ్యారు.
Updated Date - 2023-11-20T17:12:56+05:30 IST