Andre Russell: మరోసారి చెలరేగిన రస్సెల్, రింకూ.. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌ను ఎలా గెలిపించారంటే..
ABN, First Publish Date - 2023-05-09T09:58:42+05:30
ఈ ఐపీఎల్‌లో కోల్‌కతా టీమ్ ఒక్కోసారి అనూహ్యంగా చెలరేగుతోంది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతా అదే ఫీట్‌ను రిపీట్ చేసింది.
ఈ ఐపీఎల్‌లో (IPL 2023) కోల్‌కతా టీమ్ (KKR) ఒక్కోసారి అనూహ్యంగా చెలరేగుతోంది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధిస్తోంది. సోమవారం పంజాబ్ కింగ్స్ (PBKSvsKKR)తో జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతా అదే ఫీట్‌ను రిపీట్ చేసింది. మరోసారి రింకూ సింగ్ (Rinku Singh) (10 బంతుల్లో 21 నాటౌట్), ఆండ్రూ రస్సెల్ (Andre Russell) (23 బంతుల్లో 42) చివర్లో చెలరేగడంతో కోల్‌కతా విజయం నమోదు చేసింది. కీలక విజయం అందుకుని మొత్తం 10 పాయింట్లతో ప్లే-ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. చివరి 4 మ్యాచ్‌ల్లో కోల్‌కతాకిది మూడో విజయం.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. కెప్టెన్ ధవన్ (Shikhar Dhawan) (47 బంతుల్లో 57)కు షారుక్ (8 బంతుల్లో 21 నాటౌట్) సహకారం అందించాడు. ఛేదనకు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్ రకరకాల మలుపులు తిరిగింది. ఆరంభంలో జేసన్ రాయ్ (38), నితీష్ రాణా (51) జోరు చూస్తే కోల్‌కతా సులభంగా నెగ్గుతుందనిపించింది. అయితే పంజాబ్ బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీయడంతో పాటు పరుగులను కట్టడి చేయడంతో ఉత్కంఠ పెరిగింది.
SRHvsRR: సందీప్ శర్మ ఎంత పని చేశాడు? చివరి బంతికి హై డ్రామా.. ఏం జరిగిందో చూడండి..
12 బంతుల్లో 26 పరుగులు కావాల్సిన సమయంలో రస్సెల్ బ్యాట్ ఝుళిపించాడు. 19వ ఓవర్‌లో రస్సెల్ 3 సిక్సర్లతో 20 రన్స్ అందించడంతో మ్యాచ్ కోల్‌కతా వైపు టర్న్ అయింది. చివరి ఓవర్‌లో విజయానికి ఆరు పరుగులే కావాల్సి వచ్చినా.. పేసర్ అర్ష్‌దీప్ (Arshdeep Singh) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. తొలి నాలుగు బంతుల్లో నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చి రస్సెల్‌ను రనౌట్ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. ఇక ఆఖరి బంతికి 2 పరుగులు అవసరమవగా.. అర్ష్‌దీప్ ఫుల్‌టాస్‌ను రింకూ సింగ్ ఫోర్‌గా పంపి కోల్‌కతాకు అద్భుత విజయాన్నందించాడు.
Updated Date - 2023-05-09T09:58:42+05:30 IST