Sania Mirza : అదే ఆఖరాట
ABN, First Publish Date - 2023-01-14T03:13:04+05:30
నా తల్లిదండ్రులు, సోదరి, కోచ్‌లు, ఫిజియో, ట్రైనర్లు, అభిమానులు, మద్దతుదారులు, నా సహచర ప్లేయర్స్ తోడ్పాటు లేకుండా ఈ విజయాలు లేవు. నా ఆనందంలో, దుఃఖంలో వీరంతా పాలుపంచుకున్నందుకు కృతజ్ఞతలు.
దుబాయ్ ఓపెన్‌తో టెన్నిస్‌కు వీడ్కోలు
సానియా మీర్జా భావోద్వేగ ప్రకటన
సానియా మీర్జా.. భారత క్రీడాభిమానులకు పరిచయం అక్కరలేని పేరు. దేశంలో టెన్నిస్‌కు గ్లామర్ అద్దిన క్రీడాకారిణి. లియాండర్ పేస్ తర్వాత ఆ స్థాయికి ఎదిగిన ఏకైక ప్లేయర్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు దశాబ్దాల పాటు దేశ మహిళల టెన్నిస్‌కు ముఖచిత్రంగా నిలిచిన విజేత. విమర్శలను లెక్కచేయకుండా తాను అనుకున్నది అమలు చేసే ధీశాలి. అంతేనా.. డబుల్స్‌లో వరల్డ్ నెంబర్‌వన్ స్థాయికి చేరిన చాంపియన్. భారత ఆటగాళ్లు గ్రాండ్‌స్లామ్‌కు అర్హత సాధించడమే గొప్ప అనుకునే అభిమానుల ఆలోచనలను పటాపంచలు చేస్తూ ఏకంగా ఆరు స్లామ్స్‌ను ఖాతాలో వేసుకుని ఔరా అనిపించింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారత మహిళల టెన్నిస్ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసి స్ఫూర్తిప్రదాతగా నిలిచిన సానియా.. వచ్చేనెలతో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించింది.
నా తల్లిదండ్రులు, సోదరి, కోచ్‌లు, ఫిజియో, ట్రైనర్లు, అభిమానులు, మద్దతుదారులు, నా సహచర ప్లేయర్స్ తోడ్పాటు లేకుండా ఈ విజయాలు లేవు. నా ఆనందంలో, దుఃఖంలో వీరంతా పాలుపంచుకున్నందుకు కృతజ్ఞతలు. 30 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌లో 20 ఏళ్ల పాటు ప్రొఫెషనల్ ప్లేయర్‌గా ఉన్నాను. ఇక 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా నా గ్రాండ్‌స్లామ్ ప్రయాణం ఆరంభమైంది. 18 ఏళ్ల తర్వాత అదే టోర్నీ ద్వారా చివరి స్లామ్ ఆడబోతున్నాను. ఇక్కడితోనే ఆగిపోకుండా కొత్త లక్ష్యాల కోసం ముందుకు సాగాలని భావిస్తున్నాను. ముఖ్యంగా నా కుమారుడికి గతంలో కన్నా ఇప్పుడే నా అవసరం ఎక్కువగా ఉంది. అతడితో ప్రశాంతమైన జీవితం గడిపేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’
- సానియా మీర్జా
న్యూఢిల్లీ: భారత వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకనుంది. ప్రస్తుతం ఈనెల 16 నుంచి జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ తన చివరి గ్రాండ్‌స్లామ్ కానుంది. వచ్చే నెలలో జరిగే దుబాయ్ ఓపెన్ తర్వాత టెన్నిస్ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు ధ్రువీకరించింది. గతేడాది ముగింపు సీజన్‌తోనే తన కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని సానియా భావించింది. కానీ మోచేతి గాయం కారణంగా యూఎస్ ఓపెన్‌కు దూరమైంది. దీంతో అప్పట్లో నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. 36 ఏళ్ల సానియా వచ్చే వారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కజకిస్థాన్‌కు చెందిన అనా డానిలినాతో కలిసి ఆడనుంది. ఇక అంతర్జాతీయ కెరీర్‌లో తన ఎదుగుదల, అడ్డంకులపై ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన భావోద్వేగ లేఖను విడుదల చేసింది.
30 ఏళ్ల క్రితం ఓ ఆరేళ్ల చిన్నారి హైదరాబాద్‌లోని నాసర్ స్కూల్ నుంచి టెన్నిస్ శిక్షణ కోసం నిజాం క్లబ్‌కు వెళ్లింది. కానీ అక్కడి కోచ్ మాత్రం వయస్సు సరిపోదని ఖరాఖండీగా చెప్పేశాడు. కానీ మా అమ్మ మాత్రం అప్పుడే కోచ్‌తో గట్టిగా పోరాడింది. ఓ విధంగా నా కలలను నెరవేర్చుకునేందుకు ఆరేళ్ల వయస్సు నుంచే రాటుదేలాల్సి వచ్చింది. ఈ క్రమంలో అడ్డంకులెన్ని ఎదురైనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడాలనే స్వప్నాన్ని సాకారం చేసుకున్నాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే గ్రాండ్‌స్లామ్స్‌లో మెరుగ్గా ఆడడమే కాకుండా వాటిని సాధించి చూపాను. అలాగే పోడియంపై నిలుస్తూ మువ్వన్నెల పతాకం రెపరెపలాడేలా చేసినందుకు నా జన్మ ధన్యమైంది. దేశానికి పతకాలు అందించడమే నాకు దక్కిన అతిగొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
మాతృమూర్తిగానూ విజయాలు
2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సానియా 2018లో కుమారుడికి జన్మనిచ్చింది. అనంతరం రెండేళ్ల పాటు కెరీర్‌కు విశ్రాంతినిచ్చాక బరిలోకి దిగిన తొలి టోర్నీ (హోబర్ట్ ఇంటర్నేషనల్)లోనే డబుల్స్ విజేతగా నిలిచింది. గతేడాది ఖతార్ ఓపెన్ సెమీస్ వరకు చేరింది. అయితే సింగిల్స్ కెరీర్‌లో మాత్రం సానియా కేవలం ఒకే టైటిల్‌ను సాధించింది.
Updated Date - 2023-01-14T07:29:47+05:30 IST