IPL SRH vs RCB : కోహ్లీ కేక
ABN, First Publish Date - 2023-05-19T01:36:37+05:30
ప్లేఆఫ్స్ రేసులో చోటు దక్కించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు అత్యంత అవసరం. దీనికి తగ్గట్టుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విరుచుకుపడింది. ఇందుకు విరాట్ కోహ్లీ (63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 100) తన వంతు పాత్రను అద్భుతంగా నిర్వర్తించాడు. తొలిబంతి నుంచే బాదుడు ఆరంభించిన
ఐపీఎల్‌లో రికార్డు శతకం
డుప్లెసి అర్ధసెంచరీ
బెంగళూరు అద్భుత గెలుపు
సన్‌రైజర్స్‌కు నిరాశ
క్లాసెన్ సెంచరీ వృధా
హైదరాబాద్: ప్లేఆఫ్స్ రేసులో చోటు దక్కించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు అత్యంత అవసరం. దీనికి తగ్గట్టుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విరుచుకుపడింది. ఇందుకు విరాట్ కోహ్లీ (63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 100) తన వంతు పాత్రను అద్భుతంగా నిర్వర్తించాడు. తొలిబంతి నుంచే బాదుడు ఆరంభించిన అతను చాలా రోజుల తర్వాత సెంచరీ సాధించేవరకు ఆగలేదు. అటు కెప్టెన్ డుప్లెసి (47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 71) మెరుపు ఆట కూడా తోడవడంతో ఆర్‌సీబీ 8 వికెట్లతో హైదరాబాద్‌ను ఓడించింది. 14 పాయింట్లతో టాప్–4లో నిలిచిన ఆర్‌సీబీ చివరి మ్యాచ్‌ను కూడా తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. క్లాసెన్ (51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 104) ఒక్కడే ఆకట్టుకున్నాడు. బ్రేస్‌వెల్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లకు 187 రన్స్ చేసి నెగ్గింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కోహ్లీ నిలిచాడు.
విరాట్ విజృంభణ: 172 పరుగులు.. తొలి వికెట్‌కు ఆర్‌సీబీ సాధించిన భాగస్వామ్యమిది. భారీ ఛేదనలో ఈ జట్టు ఎలా కదం తొక్కిందో అర్థమవుతుంది. ఓపెనర్లు విరాట్, డుప్లెసిల ధాటికి రైజర్స్ బౌలర్లు పరుగులు సమర్పించుకోవడం మినహా చేసేదేమీ లేకపోయింది. ఓ దశలో ఇద్దరే మ్యాచ్‌ను ముగిస్తారనపించింది. తొలి రెండు బంతులనే ఫోర్లుగా మలిచిన విరాట్ లీగ్‌లో నాలుగేళ్ల తర్వాత తన సెంచరీ కరవు తీర్చేసుకోగా, అటు డుప్లెసి అర్ధసెంచరీతో అండగా నిలిచాడు. ఆరంభంలో డుప్లెసి వేగం కనబరుస్తూ మూడో ఓవర్‌లో 3 ఫోర్లు, ఐదో ఓవర్‌లో 6,4 బాదగా పవర్‌ప్లేలో జట్టు 64 రన్స్ సాధించింది. 12వ ఓవర్‌లో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేశారు. మధ్య ఓవర్లలో పరుగుల వేగం కాస్త తగ్గినా 15వ ఓవర్‌లో కోహ్లీ నాలుగు ఫోర్లతో జోరందుకుంది. భారీ సిక్సర్‌తో కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకుని తర్వాతి బంతికే వెనుదిరిగాడు. డుప్లెసి కూడా ఆ వెంటనే అవుటైనా అప్పటికి ఆర్‌సీబీ గెలుపునకు మరో పది పరుగుల దూరంలోనే ఉంది. దీంతో ఇబ్బంది లేకుండా మరో 4 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది.
ఒక్కడి పోరాటం: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ ఇన్నింగ్స్‌ను క్లాసెన్ ముందుండి నడిపించాడు. రెగ్యులర్‌గా లోయర్ మిడిలార్డర్‌లో వచ్చే అతడిని ఈసారి వన్‌డౌన్‌లో దింపడం లాభించింది. మార్‌క్రమ్ (18), బ్రూక్ (27 నాటౌట్)లతో కీలక భాగస్వామ్యాలు అందించాడు. అయితే చివరి మూడు ఓవర్లలో 26 పరుగులే ఇచ్చిన ఆర్‌సీబీ బౌలర్లు స్కోరును 200లోపే పరిమితం చేశారు. తొలి బంతినే ఫోర్‌గా మలిచిన క్లాసెన్ మధ్య ఓవర్లలో స్పిన్‌ను ధాటిగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. ఓపెనర్లు అభిషేక్ (11), రాహుల్ త్రిపాఠి (15)లను బ్రేస్‌వెల్ ఐదో ఓవర్‌లోనే అవుట్ చేశాడు. అనంతరం బరిలోకి దిగిన క్లాసెన్ ఆరో ఓవర్‌లో 3 ఫోర్లతో పవర్‌ప్లేలో జట్టు 49 పరుగులు సాధించింది. ఇదే ఊపులో 24 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేయగా.. కెప్టెన్ మార్‌క్రమ్ సహకారంతో మూడో వికెట్‌కు 76 పరుగులు జత చేశాడు. కర్ణ్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో బ్రూక్ 4,6.. క్లాసెన్ సిక్సర్‌తో 21 పరుగులు రాగా, స్పిన్నర్ షాబాజ్ ఓవర్‌లో క్లాసెన్ 6,6.. బ్రూక్ 4 బాది మరో 19 రన్స్ రాబట్టడంతో స్కోరుబోర్డు ఉరకలెత్తింది. ఇక 97 పరుగుల వద్ద భారీ సిక్సర్ బాదిన క్లాసెన్ 49 బంతుల్లోనే శతకం పూర్తి చేసి అదే ఓవర్ (19వ)లో వెనుదిరిగాడు. అప్పటికి నాలుగో వికెట్‌కు 36 బంతుల్లోనే 74 పరుగులు జత చేరాయి. కానీ చివరి ఓవర్‌లో సిరాజ్ 4 పరుగులే ఇవ్వడంతో స్కోరు 190లోపే ముగిసింది.
క్లాసెన్ (51 బంతుల్లో 104)
విరాట్ కోహ్లీకిది ఆరోశతకం. దీంతో ఐపీఎల్‌లో ఎక్కువ శతకాలు (6) సాధించిన బ్యాటర్‌గా గేల్‌తో విరాట్ సమంగా నిలిచాడు.
ఇరు జట్ల బ్యాటర్ల నుంచి సెంచరీలు నమోదు కావడం ఐపీఎల్‌లో ఇదే తొలిసారి.
బెంగళూరుకు ఆవల ఆర్‌సీబీకిదే అత్యధిక ఛేదన
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్: అభిషేక్ (సి) లోమ్రోర్ (బి) బ్రేస్‌వెల్ 11, రాహుల్ త్రిపాఠి (సి) హర్షల్ (బి) బ్రేస్‌వెల్ 15, మార్‌క్రమ్ (బి) షాబాజ్ 18, క్లాసెన్ (బి) హర్షల్ 104, బ్రూక్ (నాటౌట్) 27, ఫిలిప్స్ (సి) పార్నెల్ (బి) సిరాజ్ 5, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 186/5; వికెట్ల పతనం: 1–27, 2–28, 3–104, 4–178, 5–186; బౌలింగ్: సిరాజ్ 4–0–17–1, పార్నెల్ 4–0–35–0, బ్రేస్‌వెల్ 2–0–13–2, షాబాజ్ 3–0–38–1, హర్షల్ పటేల్ 4–0–37–1, కర్ణ్ శర్మ 3–0–45–0.
బెంగళూరు: కోహ్లీ (సి) ఫిలిప్స్ (బి) భువనేశ్వర్ 100, డుప్లెసి (సి) త్రిపాఠి (బి) నటరాజన్ 71, మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 5, బ్రేస్‌వెల్ (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 19.2 ఓవర్లలో 187/2; వికెట్ల పతనం: 1–172, 2–177; బౌలింగ్: భువనేశ్వర్ 4–0–48–1, అభిషేక్ 3–0–28–0, నటరాజన్ 4–0–34–1, కార్తీక్ త్యాగి 1.2–0–21–0, నితీశ్ కుమార్ 2–0–19–0, మాయాంక్ దాగర్ 4–0–25–0, ఫిలిప్స్ 1–0–10–0.
Updated Date - 2023-05-19T01:36:37+05:30 IST