IND-AUS TEST Match : తొలి రోజే కంగారు
ABN, First Publish Date - 2023-02-10T03:54:00+05:30
ఐదు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగాడు.. అదీ టెస్టు ఫార్మాట్‌లో.. అయితేనేం.. వరల్డ్ నెంబర్‌వన్ ఆల్‌రౌండర్ జడేజా తన మ్యాజిక్ బంతుల్లో
ఆసీస్‌ను చుట్టేసిన స్పిన్నర్లు
తొలి ఇన్నింగ్స్ 177 ఆలౌట్
జడేజాకు 5 వికెట్లు జూ భారత్ 77/1
రోహిత్ హాఫ్ సెంచరీ
ఐదు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగాడు.. అదీ టెస్టు ఫార్మాట్‌లో.. అయితేనేం.. వరల్డ్ నెంబర్‌వన్ ఆల్‌రౌండర్ జడేజా తన మ్యాజిక్ బంతుల్లో పదునేమీ తగ్గలేదని నిరూపించాడు. తొలిరోజే ఐదు వికెట్లతో చెలరేగి ఆస్ట్రేలియాను కంగారెత్తించాడు. మరోవైపు అశ్విన్ దాడితో కమిన్స్ సేన కుదేలైంది. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. మిగతా బ్యాటర్లు సహకరిస్తే భారత్‌కు భారీ స్కోరు ఖాయమే..
నాగ్‌పూర్: ఊహించినట్టుగానే టర్నింగ్ పిచ్‌పై ఆస్ట్రేలియా విలవిల్లాడింది. గురువారం ఆరంభమైన ఈ తొలి టెస్టు మొదటి రోజే గింగిరాలుతిరిగే బంతులతో లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (5/47), ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ (3/42) దాడికి దిగారు. దీంతో ఏడుగురు బ్యాటర్లు సింగిల్‌డిజిట్‌కే పరిమితం కావడంతో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లు ఆడి 177 పరుగులే చేసింది. లబుషేన్ (49), స్మిత్ (37), క్యారీ (36), హ్యాండ్స్‌కోంబ్ (31) ఫర్వాలేదనిపించారు. అనంతరం భారత్ రోజు ముగిసేసరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ (56 బ్యాటింగ్)తో పాటు అశ్విన్ పరుగులేమీ చేయకుండా ఉన్నాడు. ప్రస్తుతానికి కేవలం 100 పరుగులే వెనుకబడి ఉండగా, ఈ పిచ్‌పై సహనం ప్రదర్శిస్తే రన్స్ రావడం కష్టమేమీ కాదు. రెండో రోజు పూర్తిగా బ్యాటింగ్ చేయగలిగితే మ్యాచ్‌లో భారత్ ఆధిక్యం ప్రదర్శించినట్టే. ఇక ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ తరఫున ఆంధ్ర కీపర్ కేఎస్ భరత్, సూర్యకుమార్‌లు అరంగేట్రం చేశారు.
తొలి దెబ్బ పేసర్లదే..: నాగ్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందని ఊహించిందే. కానీ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీ్‌సను అనూహ్యంగా భారత పేసర్లు సిరాజ్, షమి హడలెత్తించారు. రెండో ఓవర్‌లో తక్కువ ఎత్తులో వచ్చిన సిరాజ్ బంతిని ఆడలేక ఖవాజా (1) ఎల్బీ అయ్యా డు. ఇక తర్వాతి ఓవర్‌లోనే షమి విసిరిన బుల్లెట్ బంతికి వార్నర్ (1) ఆఫ్‌సైడ్ వికెట్ అల్లంత దూరాన పడింది. అప్పటికి స్కోరు రెండు పరుగులే. ఇక ఏడో ఓవర్‌లోనే రోహిత్ బంతిని స్పిన్నర్ జడేజా చేతికిచ్చాడు.
జడ్డూ మాయ: తొలి సెషన్‌లో లబుషేన్, స్మిత్ ఆటతీరు చూశాక వీరిద్దరి నుంచి భారీ స్కోరు ఖాయమేననిపించింది. కానీ ఈ సెషన్‌లో స్పిన్ తడాఖాతో ఆసీస్ టపటపా ఆరు వికెట్లు కోల్పోయింది. ఇందులో నాలుగు జడేజానే తీశాడు. 36వ ఓవర్‌లో ఆసీ్‌సకు గట్టి ఝలక్‌నిస్తూ మొదట లబుషేన్, రెన్షా (0)లను జడ్డూ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు అక్షర్ ఓవర్‌లో స్మిత్ మూడు ఫోర్లతో బ్యాట్ ఝుళిపించాడు. కానీ అతడిని కూడా జడేజా తన అద్భుత బంతులతో ఆత్మరక్షణలోకి నెట్టి చివరికి బౌల్డ్ చేశాడు. అనంతరం అలెక్స్ క్యారీ, హ్యాండ్స్‌కోంబ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. 54వ ఓవర్‌లో క్యారీని అశ్విన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. చివరి సెషన్ ఆరంభంలోనే మిగతా రెండు వికెట్లను కూడా చేజార్చుకుంది.
రోహిత్ ధనాధన్: రోహిత్ ధాటికి భారత ఇన్నింగ్స్ జోరు గా ఆరంభమైంది. మరో ఎండ్‌లో రాహుల్ (20) డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. అటు పేస్, స్పిన్ తేడా లేకుండా కెప్టెన్ బ్యాట్ ఝుళిపిస్తూ 66 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే మరో రెండు ఓవర్లలో తొలి రోజు ముగుస్తుందనగా రాహుల్‌ను మర్ఫీ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేశాడు.
స్కోరుబోర్డు: ఆసీస్ తొలి ఇన్నింగ్స్: వార్నర్ (బి) షమి 1; ఖవాజా (ఎల్బీ) సిరాజ్ 1; లబుషేన్ (స్టంప్) భరత్ (బి) జడేజా 49; స్మిత్ (బి) జడేజా 37; రెన్షా (ఎల్బీ) జడేజా 0; హ్యాండ్స్‌కోంబ్ (ఎల్బీ) జడేజా 31; క్యారీ (బి) అశ్విన్ 36; కమిన్స్ (సి) కోహ్లీ (బి) అశ్విన్ 6; మర్ఫీ (ఎల్బీ) జడేజా 0; లియోన్ (నాటౌట్) 0; బోలాండ్ (బి) అశ్విన్ 1; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 63.5 ఓవర్లలో 177 ఆలౌట్. వికెట్ల పతనం: 1-2, 2-2, 3-84, 4-84, 5-109, 6-162, 7-172, 8-173, 9-176, 10-177. బౌలింగ్: షమి 9-4-18-1; సిరాజ్ 7-3-30-1; జడేజా 22-8-47-5; అక్షర్ 10-3-28-0; అశ్విన్ 15.5-2-42-3. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 56; రాహుల్ (సి అండ్ బి) మర్ఫీ 20; అశ్విన్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 24 ఓవర్లలో 77/1. వికెట్‌పతనం: 1-76. బౌలింగ్: కమిన్స్ 4-1-27-0; బోలాండ్ 3-1-4-0; లియోన్ 10-3-33-0; మర్ఫీ 7-0-13-1.
అశ్విన్@450
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో క్యారీని అవుట్ చేసిన అశ్విన్ టెస్టుల్లో 450 వికెట్లను పూర్తి చేశాడు. అదీ 89 టెస్టుల్లోనే సాధించాడు. దీంతో భారత్ తరఫున అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బౌలరయ్యాడు. ఓవరాల్‌గా మురళీధరన్ (80 మ్యాచ్‌లు) తర్వాత రెండో బౌలర్. ప్రపంచ క్రికెట్‌లో 450+ టెస్టు వికెట్లను సాధించిన వారిలో అశ్విన్‌ది తొమ్మిదో స్థానం. భారత్ తరపున అనిల్ కుంబ్లే (619 వికెట్లు) టాప్‌లో ఉన్నాడు.
Updated Date - 2023-02-10T03:54:01+05:30 IST