Rinku Singh : నాటి స్వీపర్.. సిక్సర్ల కింగ్
ABN, First Publish Date - 2023-04-11T02:57:57+05:30
రింకూ సింగ్.. ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు క్రికెట్ ప్రపంచమంతా ఇదే పేరు మార్మోగిపోతోంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చివరి
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
రింకూ సింగ్.. ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు క్రికెట్ ప్రపంచమంతా ఇదే పేరు మార్మోగిపోతోంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్లో వరుస ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన 25 ఏళ్ల రింకూ అద్భుత ఇన్నింగ్స్‌కు ఫిదా కానివారు ఉండరు. అంతలా అందరినీ ఆకట్టుకున్న రింకూను సిక్సర్ల కింగ్ అంటూ అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. కానీ, ఈ స్థాయికి రావడం వెనక అతను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. నిరుపేద కుటుంబానికి చెందిన రింకూ జీవితమంతా ఒడిదుడుకులే. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన ఖాన్‌చంద్ సింగ్ ఐదుగురు సంతానంలో మూడోవాడు రింకూ. తండ్రి ఖాన్‌చంద్ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే సంస్థలో కూలీగా పనిచేసేవారు. రింకూ పెద్దన్నయ్య ఆటో డ్రైవర్ కాగా, మరో సోదరుడు కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో పని చేసేవాడు. ఆర్ధికంగా కుటుంబ పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో ఒకానొక సమయంలో స్వీపర్‌గా పనిచేసిన రింకూ.. సోదరుడు పనిచేస్తున్న కోచింగ్ సంస్థలో బల్లలు కూడా తుడిచేవాడు. తనకు ఇష్టం లేకపోయినా స్వీపింగ్‌తో పాటు బల్లలు తుడిచే పనులు చేయాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో రింకూ చెప్పుకొచ్చాడు. రింకూ చిన్నప్పుడు క్రికెట్ ఆడేందుకు వెళ్తే.. పనులు చేయకుండా ఆటలేంటని తండ్రి కొట్టేవాడట.
‘ఓసారి ఇంటర్ క్లబ్‌లో ఆడేందుకు లెదర్ బంతి కోసం డబ్బులు అడిగితే నాన్న ఇవ్వలేదు. కానీ, మ్యాచ్ కోసం కాన్పూర్ వెళ్తానంటే అమ్మ కిరాణా దుకాణాదారుని వద్ద రూ. 1000 అప్పు చేసి నాకిచ్చింది’ అని చిన్నప్పటి కష్టాలను రింకూ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత కానీ, 2012లో ఇంటర్ స్కూల్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి బహుమతిగా ఓ బైక్‌ను అందుకోవడంతో రింకూపై నాన్నకు నమ్మకం కలిగింది. అప్పటినుంచి నాన్న ప్రోత్సాహంతో ముందుకు సాగిన రింకూ.. 2014 యూపీ తరఫున దేశవాళీల్లోకి అడుగుపెట్టాడు. 2018-19 రంజీ సీజన్‌లో పది ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలతో కలిపి 953 పరుగులు చేశాడు. తొలిసారిగా 2017లో ఐపీఎల్‌లో పంజాబ్ జట్టుకు ఎంపికైనా తుది జట్టులో ఆడేందుకు చాన్స్ మాత్రం రాలేదు. ఆ మరుసటి ఏడాది వేలంలో కోల్‌కతా రింకూను తీసుకుంది. అప్పటినుంచి ఐదేళ్లుగా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న రింకూ.. గతేడాది మోకాలి గాయంతో ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కానీ, ఈసారి తనను అట్టిపెట్టుకున్న నైట్‌రైడర్స్ నమ్మకాన్ని వమ్ముచేయని రింకూ.. ఐపీఎల్ చరిత్రలోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌తో తన జట్టుకు అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ అందించాడు.
ఆ సంచలన బ్యాట్ నాదే
గుజరాత్‌తో మ్యాచ్‌లో చివరి ఐదు బంతులను సిక్సర్లుగా మలచిన రింకూ సింగ్ సంచలన బ్యాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్ నితీశ్ రాణాదట. ఈ విషయాన్ని రాణానే స్వయంగా వెల్లడించాడు. ’ఈ సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌లను ఇదే బ్యాట్‌తో ఆడా. అయితే, గుజరాత్‌తో మ్యాచ్‌కు రింకూ నా బ్యాట్‌ను అడిగాడు. అయితే నేను ఇవ్వొద్దనుకొని అతడికి జవాబు చెప్పలేదు. కానీ, డ్రెస్సింగ్ రూమ్ నుంచి నా బ్యాట్‌ను తీసుకెళ్లి ఎవరో రింకూకు ఇచ్చారు. ఆ బ్యాట్‌తోనే దుమ్ము దులిపాడు. సూపర్ హీరోగా మారాడు’ అని రాణా చెప్పుకొచ్చాడు.
Updated Date - 2023-04-11T02:57:57+05:30 IST