IPL auction 2024: పావెల్ @ రూ.7.4 కోట్లు.. స్మిత్ అన్‌సోల్డ్.. దుబాయ్‌లో ఐపీఎల్ 2024 వేలం!
ABN, Publish Date - Dec 19 , 2023 | 02:22 PM
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం (IPL Auction) ఆసక్తికరంగా సాగుతోంది. మొత్తం పది ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్న ఈ వేలంలో 77 స్లాట్‌లు ఉన్నాయి. వాటిల్లో 30 మంది విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు.
దుబాయ్ (Dubai) వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం (IPL Auction) ఆసక్తికరంగా సాగుతోంది. మొత్తం పది ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్న ఈ వేలంలో 77 స్లాట్‌లు ఉన్నాయి. వాటిల్లో 30 మంది విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు. దేశ విదేశీ ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ వేలం కొద్ది సేపటి క్రితం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటివరకు జరిగిన వేలంలో వెస్టిండీస్ టీ20 కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌కు (Rovman Powell) మంచి డిమాండ్ కనిపించింది. రూ. కోటి కనీస ధరతో మొదలైన పావెల్ కోసం కోల్‌కతా, రాజస్థాన్ జట్లు పోటీ పడ్డాయి. చివరకు పావెల్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.7.4 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది.
గత సీజన్‌లో రూ.13.25 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్న హ్యారీ బ్రూక్ (Harry Brook) తాజాగా వేలంలోకి వచ్చాడు. ఈ ఇంగ్లండ్ ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 4 కోట్లకు దక్కించుకుంది. ఈ ప్రపంచకప్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను (Travis Head) దక్కించుకునేందుకు చైన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. దాంతో రూ. 2కోట్లతో బరిలోకి దిగిన హెడ్‌ను సన్ రైజర్స్ రూ.6.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక, ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.4 కోట్లకు దక్కించుకుంది. అతడి బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లు.
ఇక, న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్రను రూ.1.8 కోట్లకు చెన్నై టీమ్ సొంతం చేసుకుంది. రూ.50 లక్షల బేస్ ధరతో బరిలోకి దిగిన రచిన్ కోసం చెన్నై, ఢిల్లీ పోటీ పడ్డాయి. చివరకు రూ.1.8 కోట్లకు రచిన్ సీఎస్కే స్వంతమయ్యాడు. కాగా, ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా ఆటగాడు రైలీ రసోవ్, భారత ప్లేయర్లు మనీశ్ పాండే, కరుణ్ నాయర్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.
Updated Date - Dec 19 , 2023 | 02:22 PM