HYD vs Rajsthan : రైజర్స్ చిత్తుగా..
ABN, First Publish Date - 2023-04-03T00:27:33+05:30
సుదీర్ఘ విరామం తర్వాత ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. హుషారుగా మైదానంలోకి అడుగుపెట్టిన ఫ్యాన్స్‌కు మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. చెత్త ఆటతీరుతో మూల్యం చెల్లించింది.
72 పరుగులతో రాజస్థాన్ గెలుపు
శాంసన్, బట్లర్, జైశ్వాల్ హాఫ్ సెంచరీలు
చాహల్‌కు నాలుగు వికెట్లు
సొంత గడ్డపై తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు పరాభవం ఎదురైంది. రాజస్థాన్ టాపార్డర్ ధాటికి బౌలర్లు పూర్తిగా తేలిపోయి భారీ స్కోరుకు కారణమయ్యారు. ఇక బ్యాటర్ల నుంచైనా పోరాటం కనిపిస్తుందా అనుకుంటే.. చాహల్ (4/17) ఉచ్చులో పడి విలవిల్లాడారు. చివర్లో సమద్, ఉమ్రాన్‌ల జోరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీసం వంద పరుగులైనా దాటగలిగింది.
హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. హుషారుగా మైదానంలోకి అడుగుపెట్టిన ఫ్యాన్స్‌కు మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. చెత్త ఆటతీరుతో మూల్యం చెల్లించింది. అటు రాజస్థాన్ రాయల్స్ మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించిన రాయల్స్.. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 72 పరుగులతో ఘనవిజయం సాధించింది. ముందుగా రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ సంజూ శాంసన్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 55), బట్లర్ (22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 54), జైశ్వాల్ (37 బంతుల్లో 9 ఫోర్లతో 54) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ఫరూఖి, నటరాజన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు అతికష్టంగా 131 పరుగులు చేసి ఓడింది. చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ సమద్ (32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 నాటౌట్), ఉమ్రాన్ (8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 19 నాటౌట్) వేగంగా ఆడారు. చాహల్‌కు 4, బౌల్ట్‌కు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా బట్లర్ నిలిచాడు.
చాహల్ ధాటికి విలవిల: భారీ ఛేదనలో రైజర్స్ బ్యాటింగ్ తొలి ఓవర్ నుంచే గాడి తప్పింది. పరుగుల ఖాతా తెరవకముందే బౌల్ట్ ధాటికి ఓపెనర్ అభిషేక్, త్రిపాఠి డకౌట్లుగా వెనుదిరిగారు. మయాంక్, బ్రూక్
(13) నిలకడగా ఆడడంతో పవర్‌ప్లేలో కష్టంగా 30 పరుగులు చేసింది. కానీ ఆదుకుంటాడనుకున్న బ్రూక్‌ను చాహల్ బౌల్డ్ చేశాడు. మూడో వికెట్‌కు 34 రన్స్ వచ్చాయి. ఇక ఇక్కడి నుంచి పరుగులేమో కానీ వికెట్లు కాపాడుకోవడమే గగనమైంది. చాహల్ వరుస విరామాల్లో వికెట్లు తీసి రైజర్స్‌ను కుదురుకోనీయలేదు. ఓ దశలో 81/7 స్కోరుతో ఉన్న ఈ జట్టు వంద పరుగులైనా చేస్తుందా? అన్న సందేహం కలిగింది. అయితే 19వ ఓవర్‌లో ఉమ్రాన్ 4,6తో 13 రన్స్.. ఆఖరి ఓవర్‌లో సమద్ 6,4,4, ఉమ్రాన్ సిక్సర్‌తో 23 రన్స్ సాధించి ఫ్యాన్స్‌ను కాస్త ఖుషీ చేయగలిగారు. వీరి ఇన్నింగ్స్‌లో ఈ జోడీదే అత్యధిక (తొమ్మిదో వికెట్‌కు 36 పరుగులు) భాగస్వామ్యం కావడం గమనార్హం.
ఆరంభం నుంచే..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు మెరుపు ఆరంభం లభించింది. టాప్-3 బ్యాటర్లు బట్లర్, జైశ్వాల్, శాంసన్ వీర బాదుడుకు స్కోరు అవలీలగా 200 దాటేసింది. భువీ, నటరాజన్, ఫరూఖి ఓవర్లను వీరు ఆడేసుకున్నారు. ముందుగా జైశ్వాల్ తొలి మూడు ఓవర్లలోనే 5 ఫోర్లతో కదం తొక్కాడు. ఇక నాలుగో ఓవర్‌లో బట్లర్ రెండు వరుస సిక్సర్లు సాధించాడు. అదే ఓవర్‌లో జైశ్వాల్ మరో ఫోర్‌తో 19 రన్స్ వచ్చాయి. ఐదో ఓవర్‌లో నాలుగు.. ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన బట్లర్ 20 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ అదే ఓవర్‌లో ఫరూఖి అతడిని అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 35 బంతుల్లోనే 81 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు పవర్‌ప్లేలో రాజస్థాన్ తమ అత్యధిక స్కోరు (85)ను సాధించింది. ఆ తర్వాత జైశ్వాల్‌కు శాంసన్ కలవడంతో రెండో వికెట్‌కు 54 రన్స్ చేరాయి. అయితే 11 నుంచి 15 ఓవర్ల మధ్య పరుగులు నెమ్మదించాయి. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాక 13వ ఓవర్‌లో జైశ్వాల్‌ను ఫరూఖి అవుట్ చేశాడు. ఆ వెంటనే దేవ్‌దత్ (2)ను ఉమ్రాన్, పరాగ్ (7)ను నటరాజన్ పెవిలియన్‌కు చేర్చారు. కానీ చివర్లో శాంసన్‌కు జతగా హెట్‌మయెర్ (22 నాటౌట్) భారీ సిక్సర్లతో విరుచుకుపడి స్కోరును వేగంగా పెంచారు. 19వ ఓవర్‌లో శాంసన్ అవుటైనా ఇబ్బంది లేకపోయింది.
2020 ఐపీఎల్ నుంచి శాంసన్ తానాడిన తొలి మ్యాచ్‌ల్లో 74, 119, 55, 55 స్కోర్లు సాధించడం విశేషం. ’’
ఐపీఎల్‌లో ఎక్కువ వికెట్లు తీసిన స్పిన్నర్‌గా అమిత్ మిశ్రా (166)ను
అధిగమించిన చాహల్ (170).
స్కోరుబోర్డు
రాజస్థాన్: జైశ్వాల్ (సి) మయాంక్ (బి) ఫరూఖి 54; బట్లర్ (బి) ఫరూఖి 54; శాంసన్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 55; పడిక్కల్ (బి) ఉమ్రాన్ 2; పరాగ్ (సి) ఫరూఖి (బి) నటరాజన్ 7; హెట్‌మయెర్ (నాటౌట్) 22; అశ్విన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 203/5. వికెట్ల పతనం: 1-85, 2-139, 3-151, 4-170, 5-187; బౌలింగ్: భువనేశ్వర్ 3-0-36-0; ఫరూఖి 4-0-41-2; సుందర్ 3-0-32-0; నటరాజన్ 3-0-23-2; రషీద్ 4-0-33-0; ఉమ్రాన్ 3-0-32-1.
హైదరాబాద్: అభిషేక్ (బి) బౌల్ట్ 0; మయాంక్ (సి) బట్లర్ (బి) చాహల్ 27; త్రిపాఠి (సి) హోల్డర్ (బి) బౌల్ట్ 0; బ్రూక్ (బి) చాహల్ 13; సుందర్ (సి) హెట్‌మయెర్ (బి) హోల్డర్ 1; ఫిలిప్స్ (సి) ఆసిఫ్ (బి) అశ్విన్ 8; సమద్ (నాటౌట్) 32; రషీద్ (స్టంప్) శాంసన్ (బి) చాహల్ 18; భువనేశ్వర్ (బి) చాహల్ 6; ఉమ్రాన్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 131/8. వికెట్ల పతనం: 1-0, 2-0, 3-34, 4-39, 5-48, 6-52, 7-81, 8-95; బౌలింగ్: బౌల్ట్ 4-1-21-2; ఆసిఫ్ 3-0-15-0; హోల్డర్ 3-0-16-1; అశ్విన్ 4-0-27-1; చాహల్ 4-0-17-4; సైనీ 2-0-34-0.
Updated Date - 2023-04-03T00:27:33+05:30 IST