ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ChatGPT : చాట్‌జీపీటీ అండతో పోటీకి సై అంటున్న మైక్రోసాఫ్ట్.. గూగులే టార్గెట్

ABN, First Publish Date - 2023-02-10T21:44:27+05:30

చాట్‌జీపీటీ.. కృత్రిమ మేథ(Artificial Intelligence - AI) మోడల్‌గా ప్రపంచానికి పరిచయమైన అతి తక్కువ సమయం(2 నెలలు)లోనే 10 కోట్ల మంది యూజర్ల మన్ననలు అందుకుంది. ఓపెన్ఏఐ సంస్థ సృష్టి అయిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాట్‌జీపీటీ.. కృత్రిమ మేథ(Artificial Intelligence - AI) మోడల్‌గా ప్రపంచానికి పరిచయమైన అతి తక్కువ సమయం(2 నెలలు)లోనే 10 కోట్ల మంది యూజర్ల మన్ననలు అందుకుంది. ఓపెన్ఏఐ సంస్థ సృష్టి అయిన చాట్‌జీపీటీని అభివృద్ధి చేసేందుకు 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం చేసిన దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు ఆ ఆదరణను సానుకూలంగా మలచుకుంటూ పోటీకి సై అంటోంది. దిగ్గజ సెర్చింజన్ సంస్థ గూగులే టార్గెట్‌గా ముందుకు సాగుతోంది.

పోటీ ఉండదనుకున్నా..

వారం క్రితం వరకు చాట్‌జీపీటీతో గూగుల్‌కు ఎలాంటి ముప్పు ఉండబోదనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. చాట్‌జీపీటీ ఒక లాంగ్వేజ్ మోడల్ అని.. యూజర్లకు కావాల్సిన సమాచారం ఇస్తుందే తప్ప.. అది గూగుల్‌కు పోటీ కాదని.. గూగుల్ ఒక సెర్చ్ ఇంజన్ అని, కావాల్సిన సమాచారానికి సంబంధించిన లింకులు ఇస్తుందని, చాట్‌జీపీటీలో ఆ ఫీచర్ లేదని విశ్లేషణలు వెలువడ్డాయి. అయినా.. గూగుల్ ముందున్న ముప్పును ఊహించింది. పోటీ ప్రపంచంలో రెప్పపాటు సమయం ఏమరపాటుగా ఉన్నా.. అథఃపాతాళానికి పడిపోతామని, తిరిగి కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టొచ్చని భావించింది. ఇందుకు మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ తొలినాళ్లలో పరిచయం చేసిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌(ie)నే నిదర్శనంగా తీసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ వచ్చాక.. ie మరుగునపడిపోయింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఇన్‌స్టాలేషన్‌తోపాటు ఐఈ డీఫాల్ట్ యాప్‌గా ఇన్‌స్టాల్ అయినా.. అది కేవలం గూగుల్ క్రోమ్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఉపయోగపడే టూల్‌గానే నెటిజన్లు భావించారు. ఇప్పుడు అలాంటి ముప్పే తన సెర్చింజన్‌కు.. తన ఏఐ ప్రాజెక్టులకు వస్తుందని ఊహించిన గూగుల్.. వెంటనే బాడ్(BARD) పేరుతో తన ఏఐ టూల్‌ని ప్రకటించింది. కానీ, హడావుడిలో టెస్టింగ్‌లను విస్మరించడంతో.. బాడ్ చేసిన చిన్న పొరపాటు గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ షేర్లు రూ. 8.20 లక్షల కోట్ల (100 బిలియన్ డాలర్లు) మేర పతనం అయ్యేందుకు కారణమైంది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ షేర్ల విలువ 3% మేర పైకి ఎగబాకాయి.

మరో అడుగు ముందుకేసిన మైక్రోసాఫ్ట్

గూగుల్ ముందుచూపును పసిగట్టిన మైక్రోసాఫ్ట్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదనే భావనతో తన ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించింది. గురువారం (2023 ఫిబ్రవరి 9న) చాట్‌జీపీటీ సేవలను తమ బ్రౌజర్ ఎడ్జ్(Microsoft Edge), సెర్చింజన్ బింగ్(Bing)కు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నుంచి ఆ ప్రణాళికలను బీటా వెర్షన్‌గా అమలు చేయడాన్ని ప్రారంభించింది. బింగ్‌లో సెర్చ్ రిజల్ట్స్ (Search Results) పేజీలో ఎడమపక్క సైడ్‌బార్‌(Side Bar)గా చాట్‌జీపీటీ సేవలను పరిచయం చేశారు. అంటే.. నెటిజన్లు ఏదైనా సమాచారాన్ని బింగ్‌లో శోధిస్తే.. గతంలో మాదిరిగా సంబంధిత వెబ్ పేజీల లింకులను చూపడంతోపాటు.. సైడ్‌బార్‌లో చాట్‌జీపీటీ మరింత స్పష్టమైన సమాచారాన్ని అందజేస్తుంది. అంటే, నెటిజన్లు తమకు కావాల్సిన సమాచారం కోసం సెర్చ్ రిజల్ట్స్‌ను స్రోల్ చేసుకుంటూ వెళ్లే అవసరం లేకుండా.. చాట్‌జీపీటీ దాదాపుగా వారి అవసరాన్ని తీరుస్తుంది. సైడ్‌బార్‌లో ఉన్న సమాచారం మీద క్లిక్ చేయగానే.. సెర్చ్ రిజల్ట్స్ పేజీలో దానికి సంబంధించిన లింకు హైలైట్ అవుతుంది. యూజర్లు సెర్చ్‌తోపాటు.. చాట్ చేసి, తమకు కావాల్సిన సమగ్ర సమాచారాన్ని పొందే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇది పూర్తిస్థాయిలో అమలైతే.. అది గూగుల్‌కు ప్రమాద ఘంటికేనని విశ్లేషకులు చెబుతున్నారు.

కొంగొత్తగా బింగ్, ఎడ్జ్..

మైక్రోసాఫ్ట్ గురువారం నాటి ప్రకటన మేరకు.. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న తన బ్రౌజర్ ఎడ్జ్, సెర్చింజన్ బింగ్‌లో సమూల మార్పులు వస్తాయి. ఈ రెండూ పూర్తిస్థాయిలో చాట్‌జీపీటీ కృత్రిమ మేధతో పనిచేస్తాయి. అంటే.. ఒక యూజర్ కంప్యూటర్‌లో ఎడ్జ్‌ను బ్రౌజర్‌గా వాడితే.. అది చాట్‌జీపీటీగా, బింగ్ సెర్చింజన్‌గా ఏకకాలంలో రెండు పనులు చేసే అవకాశాలుంటాయి. ఇతర బ్రౌజర్లలో బింగ్ వాడేవారికీ చాట్‌జీపీటీ మేధతో సమాధానాలు వస్తాయి. ఇక మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్, వినియోగదారుల విభాగం ప్రధాన మార్కెటింగ్ అధికారి(సీఎంవో) యూసుఫ్ మెహదీ ప్రకారం.. మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులైన ప్రతి సాఫ్ట్‌వేర్‌లో ఏఐ లేదా చాట్‌జీపీటీ భాగం కానుంది. అంటే.. విండోస్ ఆపరేటింగ్ సిస్టం, దాని అనుబంధ సాఫ్ట్‌వేర్లనూ అప్‌గ్రేడ్ చేస్తారు. అదే జరిగితే కృత్రిమ మేధ రంగంలో ఇది ఒక విప్లవాత్మక మార్పు అని నిపుణులు చెబుతున్నారు.

చాట్‌జీపీటీ అసమర్థతలు.. గూగుల్‌కు అనుకూలాంశాలు

గూగుల్ ఏఐతో పోలిస్తే.. ఎంతో ముందంజలో ఉన్నా చాట్‌జీపీటీలో ఉన్న కొన్నిఅసమర్థతలు ఈ పోటీలో గూగుల్‌కు కలిసివచ్చే అవకాశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం చాట్‌జీపీటీ కేవలం ఆంగ్లభాషలో మాత్రమే సమర్థంగా పనిచేస్తోంది. ఇతర అనలటికల్(ఆంగ్ల అక్షరాలను ఉపయోగించి వాడేవి) ఫ్రెంచ్, జర్మన్ వంటి భాషల విషయంలోనూ ఇది అంత సమర్థంగా పనిచేయడం లేదు. ఇక సింథటిక్ భాషల(తెలుగు, హిందీ వంటివి) విషయంలో చాట్‌జీపీటీ పనితీరు మరీ పేలవంగా ఉంది. తెలుగుకు తెగులు పట్టేలా దాని సమాధానాలున్నాయి. అయితే.. ఈ విషయంలో గూగుల్ చాలా ముందంజలో ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఒకప్పటి లాంగ్వేజ్ కోడ్‌లను పరిగణనలోకి తీసుకుంటే.. మొదటల్లో అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్‌చేంజ్(ASCII) ఆధారంగా కంప్యూటర్లు ఇన్‌పుట్‌ను తీసుకునేవి. ఆ తర్వాతి కాలంలో భారతీయ భాషల కోసం ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్‌చేంజ్(INCII) ఆగమనంతో నాన్-యూనీకోడ్‌లో భారతీయ భాషల్లో ఇన్‌పుట్ ఇచ్చే వెసులుబాటు వచ్చింది. కానీ, ఉర్దూ టైపింగ్ విషయంలో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అందుక్కారణం.. ఉర్దూ వర్ణమాలలోని రెండో అక్షరం ‘బే’ అనేది వేర్వేరు సందర్భాల్లో 32 రూపాలను సంతరించుకుంటుంది. ఈ సమస్యకు హైదరాబాద్‌కు చెందిన సీ-డాక్ వంటి సంస్థలు పరిష్కారాన్ని కనుగొన్నాయి. పర్షియన్ అరబిక్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్‌చేంజ్(PASCII)ని వినియోగించుకుని, ఆ సమస్యను అధిగమించాయి. గూగుల్ తన లాంగ్వేజ్ మోడల్‌ను ప్రారంభించే ముందు.. ఈ సమస్యలన్నింటికీ పక్కా అల్గారిథమ్‌లతో ముందుకు వెళ్లింది. అంతేకాదు.. ఒకప్పటి గూగుల్ ట్రాన్స్‌లేషన్‌కు.. ఇప్పటి గూగుల్ ట్రాన్స్‌లేషన్‌కు ఎంతో వ్యత్యాసం ఉంది. 100% పక్కాగా తర్జుమా చేయలేకపోయినా.. 90% వరకు గూగుల్ ట్రాన్స్‌లేషన్ నైపుణ్యాన్ని పెంచుకుంది. ఇప్పుడు గూగుల్‌ బాడ్‌కు ఇదే కలిసివచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు. మరో అంశం ఏమిటంటే.. చాట్‌జీపీటీ చిత్రాలను, పుస్తకాలను, రీసెర్చ్ పత్రాలను వెతికిపెట్టలేదు. కానీ, గూగుల్ ఇప్పటికే తన సెర్చింజన్‌లో ఫొటోల విభాగాన్ని అందుబాటులో పెట్టింది. గూగుల్ బుక్స్ విభాగం ఉంది. ఈ అంశాలు బాడ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఈ కోణాల్లో చాట్‌జీపీటీని మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సర్వర్ భారం విషయంలోనూ..

ఇక చాట్‌జీపీటీ 10 కోట్ల మంది యూజర్లకే తరచూ మొరాయిస్తోంది. ఒత్తిడి తీవ్రమైతే.. పేజీ లోడ్ కాదు. పైగా.. సమాధానాలు ఇచ్చే వేగం క్రమంగా నెమ్మదిస్తోంది. గూగుల్‌కు ఆ సమస్య లేదు. అన్ని ఖండాల్లో అత్యాధునిక సర్వర్ల హబ్‌లతో బ్యాకప్‌కు ఢోకాలేకుండా ముందుకు సాగుతోంది. గూగుల్ క్రాష్ అయ్యిందనే వార్తలు గడిచిన దశాబ్దకాలంలో ఒకట్రెండు కంటే ఎక్కువ ఉండవు. ఈ వనరులన్నీ గూగుల్ బాడ్‌కు కలిసివచ్చే అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. అదనపు వనరులకు గూగుల్‌కు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. చాట్‌జీపీటీ విషయంలో మైక్రోసాఫ్ట్ తన వనరులను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం అనివార్యంగా మారుతోంది.

ప్రపంచంలోని రెండు దిగ్గజ టెక్ సంస్థల మధ్య నెలకొంటోన్న పోటీలో పైచేయి ఎవరిదైనా.. నెటిజన్లు, యూజర్లకు మాత్రం ఏఐ ఆధారిత టూల్స్ మరింత ప్రయోజనకరంగా మారనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - 2023-02-10T22:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising